logo

చేతకాక చేతులెత్తేశారు...

పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్‌ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.  

Published : 24 Apr 2024 01:58 IST

అద్దెలు అయినా చెల్లించాలంటూ నిరసన తెలుపుతున్న దేవీపట్నం ముంపు గ్రామాల నిర్వాసితులు (పాత చిత్రం)

పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్‌ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.  పరిహారం చెల్లించలేదు. పునరావాస కాలనీలను పూర్తిచేయలేదు.

న్యూస్‌టుడే, కూనవరం, దేవీపట్నం, చింతూరు 

దేవీపట్నం మండలంలోని నిర్వాసితులు ఇళ్లు, పొలాలు అన్నీ వదిలి గోదావరి వరద భయంతో బయటకు వచ్చి దాదాపు మూడేళ్లు గడిచినా పునరావాస కాలనీ నిర్మాణ పనులు నేటికీ పూర్తవకపోవడంతో ఇళ్ల అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా చెల్లా చెదురుగా  ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో ఉంటున్నామని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నిర్వాసితులు ప్రతిఏటా గోదావరి వరదల్లో మునిగిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిర్వాసితుడిని కూడా పునరావాస కాలనీకి తరలించలేదున తాజాగా వరదల సమయంలో పరామర్శకు వచ్చిన ముఖ్యమంత్రి కేంద్రం నిధులివ్వకుంటే తానేమి చేయలేనంటూ చేతులెత్తేశారు. దీంతో నిర్వాసితులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.


అయిదేళ్లు గడిపేశారు..

ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైకాపా నిర్వాసితులను నిండా ముంచింది. అటు గోదావరి వరదలు.. ఇటు ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. పరిహారం చెల్లించకుండానే ప్రభుత్వం అయిదేళ్లు గడిపేసింది. పునరావాసం కల్పించడంలోనూ పూర్తిగా విఫలమైంది. వరదల సమయంలో సీఎం వచ్చి నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు లేవన చెప్పడం హాస్యాస్పదం.

 పాయం వెంకయ్య, పెదార్కూర్‌, కూనవరం మండలం


హామీలే.. ఆచరణ లేదు..

గత ఎన్నికల్లో నిర్వాసితులకు ఎన్నో హామీలిచ్చిన వైకాపా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేకపోయింది. నిర్వాసితుల సమస్యలపై పలు పోరాటాలు చేసినా ప్రభుతానికి చీమ కుట్టినట్లు లేదు. అందుకే ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తాం.

 కొమరం పెంటయ్య, మాజీ ఎంపీపీ, కూనవరం


కాలనీలు పూర్తిచేయలేదు

వైకాపా ప్రభుత్వం నిర్వాసితులకు ఎలాంటి న్యాయం చేయలేదు. అనేకసార్లు అధికారులు సర్వేలు చేసినా ఒక్క రైతుకు పైసా విదల్చలేదు. నిర్వాసితులకు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా సొంత నిర్ణయాలతో కాలం గడిపేసింది. పునరావాస కాలనీలు నేటికి పూర్తి కాలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎవరికీ ప్యాకేజీ అందలేదు.  

 ఇల్లా చిన్నారెడ్డి, చింతూరు


ఏడాదైనా వసతులు లేవు

మేము పునరావాస కాలనీకి వచ్చి ఏడాది దాటింది. మా ఊరంతా రాలేదు. వరదలకు భయపడి మేము తొమ్మిది మంది మాత్రమే వచ్చాం. ఇప్పటివరకు ఇక్కడ రోడ్లు వేయలేదు. ఇంటికి కుళాయి నీరు రావడం లేదు. మరుగుదొడ్డి పూర్తి చేయకుండానే వదిలేశారు. గుడి, బడి, అంగన్‌వాడీలు కట్టలేదు. రేషన్‌ కోసం ప్రతి నెలా మా స్వగ్రామం వెళుతున్నాము.

 అందెల సూర్యకాంతం, భైరవపట్నంలోని జీడిగుప్ప నిర్వాసితురాలు


ఇళ్లు పూర్తిచేస్తే అద్దె సమస్యలు తీరతాయి

గంగాలమ్మ ఆలయం సమీపంలో దేవీపట్నం నిర్వాసితులకు నిర్మిస్తున్న ఇళ్లలో సుమారు 350 ఇళ్లు చివరి దశకు వచ్చాయి. కనీసం వాటిని పూర్తిచేస్తే కొన్ని కుటుంబాలకైనా అద్దె సమస్యలు తీరతాయి.  కాలనీకి వచ్చిన ప్రతి అధికారికి ఈ విషయం మొరపెట్టుకున్నా ఫలితం లేదు. నిర్వాసితులకు కేటాయించిన తొమ్మిది ఎకరాల స్థల వివాదం త్వరితగతిన పరిష్కరించకపోతే వంద కుటుంబాలకు పైగా నిర్వాసితులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 బుర్రే ఆనందరావు, దేవీపట్నం


అద్దెలు చెల్లించలేకపోతున్నాం

పోలవరం ప్రాజెక్టు పుణ్యమా అంటూ ముంపు గ్రామాలను ఖాళీచేసి దాదాపు మూడేళ్లవుతున్నా ఇళ్ల నిర్మాణాలు పూర్తవలేదు. ప్రతినెలా వేల రూపాయిల అద్దెలు చెల్లించలేకపోతున్నాం. ఉపాధి సైతం పూర్తిస్థాయిలో లేకపోవడంతో క్రమేపీ అద్దెలు చెల్లించడం మరింత కష్టంగా మారింది.

 గేదెల పెదసుబ్బారావు, దేవీపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని