logo

కార్మికులపై జగన్‌ కాఠిన్యం

వైకాపా పాలనలో కార్మిక రంగాలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కార్మికులు లేనిదే ఏ పనీ జరగదు. అటువంటి కీలకమైన ఈ రంగానికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కనీస వేతనం అమలు కావడం లేదు.

Published : 01 May 2024 01:40 IST

చింతపల్లి, రంపచోడవరం, అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే

వైకాపా పాలనలో కార్మిక రంగాలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కార్మికులు లేనిదే ఏ పనీ జరగదు. అటువంటి కీలకమైన ఈ రంగానికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కనీస వేతనం అమలు కావడం లేదు. వీరికి ప్రభుత్వం తరపున అందుతున్నది కేవలం నెలకు రూ. రెండు వేల నుంచి రూ.మూడు వేలు మాత్రమే. పారిశుధ్ధ్య కార్మికులకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తామని జగన్‌ ప్రకటించారు. కానీ ఇది అమలుకు నోచుకోలేదు. వీరికి కేవలం రూ.6 వేలే ఇస్తున్నారు. అది కూడా పంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. అంగన్‌వాడీ సిబ్బంది తమ వేతనాన్ని పెంచాలంటూ అనేక ఆందోళనలు చేసినా వారికి కంటి తుడుపు హామీలు ఇచ్చి అమలు చేయడం మానేశారు. ఆశా కార్యకర్తలు, సీహెచ్‌డబ్ల్యూలు, ఏపీఎఫ్‌డీసీ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు, పొరుగు సేవల కింద ఉద్యోగాలు చేస్తున్న వారెవరికీ సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదు. వీరంతా శ్రమదోపిడీకి గురవుతూనే ఉన్నారు.

ఇసుకపై ఆంక్షలతో ఇబ్బందులు

-ఉగ్గిరాల భాస్కరరావు, యార్లమామిడి

గత ప్రభుత్వం ఇసుక పుష్కలంగా లబించేది. జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత ఐదేళ్లలో ఇసుక సరఫరాలో తీవ్ర ఆంక్షలు విధించడంతో కొన్నాళ్లపాటు భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు

-కారం సింహాచలం, మాజీ సర్పంచి, బందపల్లి

వైకాపా అధికారం చేపట్టాక భవన నిర్మాణ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి ఎంతో మేలు చేశారు. . కార్మికుల సంక్షేమాన్ని అమలు చేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యం.


సమ్మె హామీలు నెరవేర్చలే

- గంగరాజు, పర్యటక శాఖ ఒప్పంద, పొరుగుసేవల కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు

అరకులోయ పట్టణం: జీతాల పెంపు, కార్మికుల క్రమబద్ధీకరణ, పదోన్నతుల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఎమ్మెల్సీ రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ,  అధికారులు సమస్యల పరిష్కారానికి హామీలిచ్చారు.  అయినా దినసరి, మ్యాన్‌పవర్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు. క్రమబద్ధీకరణ, పదోన్నతులపై  న్యాయం జరగలేదు.


ప్రభుత్వం స్పందించడం లేదు

- బోనంగి చిన్నయ్యపడాల్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ప్రభుత్వాలు వీటిని అమలు చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నా వీరికి పనికి తగ్గ జీతాలు ఇవ్వడం లేదు. వీరంతా కార్మికులుగానే మిగిలిపోతున్నారు. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు.  


ఆర్థిక ఇబ్బందులు

- పాంగి ధనుంజై, కార్మిక సంఘం నేత

ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతోంది. పనికి తగ్గ వేతనాన్ని చెల్లించకపోవడంతో కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం గ్యాస్‌, పెట్రోలు, నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవనం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంకా నెలకు రూ. ఆరు వేల వేతనంతో నెలంతా కుటుంబంతో ఎలా బతకాలో ప్రభుత్వమే చెప్పాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని