logo

వైకాపా పాలనలో కానరాని అభివృద్ధి

అరకు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటి, భాజపా నేత ఖుష్బూ పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావులతో కలిసి ఆమె రోడ్‌షో నిర్వహించారు.

Updated : 01 May 2024 04:40 IST

సినీ నటి, భాజపా నేత ఖుష్బూ

అరకులోయ, న్యూస్‌టుడే: అరకు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటి, భాజపా నేత ఖుష్బూ పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావులతో కలిసి ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తాను కెప్టెన్‌ నాగార్జున సినిమా షూటింగ్‌ సమయంలో 1986లో అరకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చానన్నారు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎక్కడా రహదారులు వేయలేదన్నారు. ఒక్క పేద వ్యక్తికి కూడా ఇల్లు ఇవ్వలేదని పేర్కొన్నారు.

2035 వరకు తాను ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని వైకాపా అధినేత జగన్‌ చెబుతున్నారని, ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. జగన్‌ కామెడీ తప్ప అభివృద్ధి చేయడం లేదని ఎద్దేవా చేశారు. అరకులోయను ఊటీ, కొడైకెనాల్‌ తరహాలో అభివృద్ధి చేయవచ్చన్నారు. పర్యటక రంగం బాగుపడితే గిరి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్‌ భారత్‌ కార్యక్రమంతో దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారన్నారు. అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు. వైకాపా దుర్మార్గపు పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.     అరకు లోక్‌సభ స్థానంలో విజయం సాధించి ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దామన్నారు. భవిష్యత్తు తరాల కోసమే తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు మాట్లాడుతూ.. జీవో నంబర్‌ 3 పునరుద్ధరణ జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. అప్పుడే గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. భాజపా నాయకులు మాధవ్‌, తెదేపా నాయకులు దొన్నుదొర, బాకూరి వెంకటరమణ, లక్ష్మి, నీరజ, పాండురంగస్వామి, అమ్మన్న, సాయిరాం, భాజపా నాయకులు రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని