logo

ఫెర్రో.. ‘జగన్‌ దెబ్బకు’ మొర్రో!

ఫెర్రో పరిశ్రమలు లేకపోతే దేశానికి ప్రగతి ఉండదు. చంద్రయాన్‌-3 ప్రయోగానికి సైతం ఫెర్రో ఉత్పత్తులనే వినియోగించారు. ఈ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు విద్యుత్తు. ఏపీలో దీనిని భారం చేశారు.

Updated : 05 May 2024 05:07 IST

పరిశ్రమలు మూతపడే స్థాయికి తెచ్చిన ప్రభుత్వం

ఫెర్రో పరిశ్రమలు లేకపోతే దేశానికి ప్రగతి ఉండదు. చంద్రయాన్‌-3 ప్రయోగానికి సైతం ఫెర్రో ఉత్పత్తులనే వినియోగించారు. ఈ పరిశ్రమకు ప్రధాన ముడిసరకు విద్యుత్తు. ఏపీలో దీనిని భారం చేశారు. తెదేపా ప్రభుత్వం ఫెర్రో పరిశ్రమను ఎంతో ఆదుకుంటే వైకాపా దానిని పతనం చేసింది. ప్రభుత్వానికి ఫెర్రో విలువ తెలియడం లేదు. విశాఖలో వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన బిజినెస్‌ సమ్మిట్‌ ముగిసిన రెండోరోజు నుంచి పరిశ్రమల మూసివేత నిర్ఱయం తీసుకున్నాం. యూనిట్లు మూసివేసి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవడానికి చూస్తున్నాô

ఓ ఫెర్రో పరిశ్రమ యజమాని ఆవేదన ఇదీ..

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఫెర్రో పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో నడుస్తోంది. నడపాలో, మూసివేయాలో తెలియక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అంతర్జాతీయంగా ఉత్పత్తుల ధరలు కనిష్ఠ స్థాయికి పడిపోవడం, విద్యుత్తు భారం ఈ పరిశ్రమల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో ఈ రంగం చరిత్రగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే పగబట్టినట్లు విద్యుత్తు ఛార్జీలు పెంచడంతో పరిశ్రమల యజమానులు మూసివేతే శరణ్యమనే భావనలో ఉన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రభుత్వం ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించింది. దీనికితోడు అంతర్జాతీయంగా నిర్మాణరంగం కుదేలుకావడం, స్టీల్‌కు డిమాండ్‌ తగ్గడంతో ఉత్పత్తుల ధరలు పతనమయ్యాయి. దీంతో టన్నుకి రూ. 20 వేల వరకు నష్టం వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి.

తెదేపా ఆదుకుందిలా...

ఫెర్రో పరిశ్రమలకు తెదేపా ప్రభుత్వం సింగిల్‌ టారిఫ్‌ కింద యూనిట్‌ ధర రూ. 4.95కే అందించి ప్రోత్సహించింది. 2016-17లో మళ్లీ యూనిట్‌కు రూ. 1.50, 2017-18లో 0.75 పైసలు రాయితీ అందించి నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ రంగాన్ని కాపాడుకుంటూ వచ్చింది.

వైకాపా ముంచేసిందిలా..

  • తెదేపా ప్రభుత్వం విధించిన సింగిల్‌ టారిఫ్‌ను జగన్‌ సర్కార్‌ డబుల్‌ టారిఫ్‌గా మార్చి డ్యూటీ పేరుతో 6 పైసలు, 94 పైసలు, ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో 7 పైసలు నాలుగేళ్లగా వసూలు చేసింది. వీటితోపాటు ఎనర్జీ కింద 52 ఫ్యూయల్‌ ఛార్జీలు 40 పైసలు కలిపి.. మొత్తం ఒక్కో యూనిట్‌కి రూ. 3.89 అదనపు ఛార్జీ విధించారు. ఈ అదనపు బాదుడుకు కొనుగోలు ఛార్జీ రూ. 4.95 కలిపి, ఒక్కో యూనిట్‌ ధర ఏపీలో దేశంలో మరెక్కడా లేని విధంగా రూ. 8.84 అవుతోంది. రెట్టింపు భారం భరించలేమంటూ పరిశ్రమల యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి.
  • మన దేశంలో ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ పరిశ్రమలకు యూనిట్‌ విద్యుత్తు ధర రూ. 4.50 ఉంది. పక్కనే ఉన్న ఒడిశాలో యూనిట్‌ రూ. 5.20 ధర ఉండగా... కొత్తగా వచ్చే పరిశ్రమలకు రూ. 1.50 రాయితీ అందిస్తామంటూ ఆహ్వానిస్తోంది.

విద్యుత్తు ఛార్జీల బాదుడుతో ఫెర్రో రంగానికి 2022 జులై నుంచి టన్నుకు రూ. 20 వేల వరకు నష్టం వస్తోందని యజమానులు లబోదిబోమంటున్నారు.  

కనీసం వీరి బాధలు వినే నాథుడే రాష్ట్రంలో లేకుండా పోయాడు. ఉత్తరాంధ్రలో ఎక్కువ ఫెర్రో పరిశ్రమలు ఉన్నా, పరిశ్రమల శాఖకు మంత్రిగా గుడివాడ అమర్‌నాథే ప్రాతినిధ్యం వహిస్తున్నా కనీసం ఏ రోజు వారిని పిలిచి వారి ఇబ్బందులను అడిగిన దాఖలాలు లేవు. దీనిని బట్టి ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధిపై ఎంత ఉదాసీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఏ తోడ్పాటు లేకపోవడంతో యజమానులు పరిశ్రమలను మూసివేయడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. నష్టాలను తగ్గించుకోవడానికి ఇప్పటికే ఉత్పత్తి 70 నుంచి 90 శాతం వరకు తగ్గించుకున్నారు. కొందరు పక్క రాష్ట్రాలకు తరలిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే జరిగితే ఏపీలో 3.50 లక్షలమంది రోడ్డునపడే ప్రమాదం ఉంది.

తగ్గింపు మతలబు జగన్‌కే తెలియాలి?

ఫెర్రో పరిశ్రమలను ఒక్కొక్కటి మూసివేసే పరిస్థితి రావడంతో ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. 132 కేవీ పరిధిలో రూ. 1.55 పైసలు, 33 కేవీ పరిధిలో రూ. 1.70 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు మంత్రుల సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశం జరిగిన రెండు నెలల తరవాత నాలుక మడతపెట్టి 90 పైసల చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ డబ్బులను సైతం ఆరునెలల తరువాత అందిస్తామని, అప్పటివరకు సొంతంగా బిల్లులు చెల్లించుకోవాలని చెప్పారు. ఇచ్చే అరకొర సాయం తక్షణం అందించాల్సింది పోయి, ఆరునెలలు ఆగాలని చెప్పడంపై కంపెనీ ప్రతినిధులు, కార్మికులు మండిపడుతున్నారు.

ఫెర్రో రంగానికి మన రాష్ట్రమే ప్రధాన కేంద్రం. దేశంలో మరెక్కడా లేనివిధంగా 37 పరిశ్రమలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. 2002-12 వరకు కేవలం ఏడు పరిశ్రమలే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా ప్రభుత్వ కృషి కారణంగా 2018 నాటికి రూ. 15 వేల కోట్ల పెట్టుబడులతో 37 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా 50 వేల మంది, అనుబంధ రంగాల ద్వారా 3 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ప్రపంచానికి ఎగుమతి అవుతున్న ఉత్పత్తుల్లో రాష్ట్ర పరిశ్రమల వాటా 60 శాతం.

ఇక్కడి నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తుల్లో 95 శాతం విశాఖ పోర్టు నుంచే వెళ్తున్నాయి. ఇది పరోక్షంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతోంది. జీఎస్‌టీ రూపంలో ఏటా రూ. వేల కోట్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్నాయి.

ప్రధాన పరిశ్రమలు ఇవే

అభిజీత్‌, ఫేకర్‌, మైథాన్‌, అల్‌బస్‌, సుందరం, జిందాల్‌, శారదా, డెక్కన్‌, ఆంధ్రా, క్యాన్‌కాస్ట్‌, శ్రీనివాస, సరోజిని, నవభారత్‌, కడప, హిందూపురం, శారదా, జిందాల్‌ పరిశ్రమలతోపాటు చిత్తూరు, సామర్లకోట వద్ద ఫెర్రో పరిశ్రమలు ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో వైకాపా ప్రభుత్వం పగబట్టినట్లు విద్యుత్తు ఛార్జీల రూపంలో బాదుడు మొదలెట్టి ఫెర్రో రంగాన్ని మరింతగా నష్టాలపాలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని