logo

రాష్ట్రంలో వైకాపా నియంత పాలన

రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు.

Published : 08 May 2024 01:32 IST

రంపలో ప్రచారం చేస్తున్న తెలుగు మహిళలు

కొయ్యూరు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో నియంత పాలన సాగిస్తున్న వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. మంగళవారం బట్టపనుకుల, నడింపాలెం, శరభన్నపాలెం పంచాయతీల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం తథ్యమన్నారు. కూటమితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. నడింపాలెం ఉప సర్పంచి, వైకాపా నేత డి.రాజుబాబుతోపాటు పలువురు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. తెదేపా మండల అధ్యక్షుడు జి.సత్యనారాయణ, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి రామ్మూర్తి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

కూనవరం, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థులు గెలిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. అభిచర్ల, పోలిపాక గ్రామాల్లో ఆమె స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. బాబు సూపర్‌ సిక్స్‌తో మహిళలకు ఎంతో మేలు జరగనుందన్నారు. పొడియం అప్పారావు,  ప్రేమ్‌చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎటపాక, న్యూస్‌టుడే: మండలంలోని కుసుమానపల్లి, గన్నవరం, గౌరిదేవిపేట, అచ్యుతాపురం, కామంతోగు, ఎటపాక, గుండువారిగూడెం, గట్టుగూడెం గ్రామాల్లో మంగళవారం ఎన్డీయే కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం, ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీపురంలో ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.  తెదేపా సీనియర్‌ నాయకులు పాటి చలపతిరావు, మువ్వా శ్రీనివాస్‌, కిలారు వెంకటేశ్వర్లు, వైస్‌ ఎంపీపీ దొంతు మంగేశ్వరరావు, తెలుగు యువత నాయకులు వల్లభనేని చందు, రావి మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: పోతంగి పంచాయతీ పనసపుట్టులో తెదేపా మండల అధ్యక్షుడు తుడుము సుబ్బారావు, కూటమి శ్రేణులు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. అరకు పార్లమెంట్‌ ఎస్టీ సెల్‌ ఉపాధ్యక్షుడు కమ్మిడి సుబ్బారావు, టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి స్వామి, మాజీ ఎంపీపీ దన్నెరావు, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

నడింపాలెం ఉప సర్పంచ్‌ రాజుబాబుకు తెదేపా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఈశ్వరి

రంపచోడవరం, న్యూస్‌టుడే: మండలంలోని బొర్నగూడెం, చినబారంగి, గిన్నేపల్లి, ముసురుమిల్లి గ్రామాల్లో తెదేపా మండల మాజీ అధ్యక్షుడు అడబాల బాపిరాజు, అరకు పార్లమెంటు ఉపాధ్యక్షుడు కారం సింహాచలందొర, రంపలో తెదేపా నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వై.నిరంజనీదేవి, రంపచోడవరంలో తెదేపా మహిళా ఉపాధ్యక్షురాలు సంకురు పెంటమ్మ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా నాయకులు కుంజం బాపన్నదొర, చవలం బాపిరాజుదొర, వెంకటలక్ష్మి, బాపనమ్మ, నీలాయమ్మ  పాల్గొన్నారు.

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయని తెదేపా అరకు పార్లమెంట్‌ బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు నాగభూషణం అన్నారు. మంగళవారం డైరీనగర్‌, సత్యవరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వరరామచంద్రాపురం, మారేడుమిలి మండలాల్లో కూటమి నాయకులు విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు.


అనంత బాబు మాయలో గిరి మహిళలు పడొద్దు

దేవీపట్నం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎమ్మెల్సీ అనంత బాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇందుకూరు ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీ-1లో మంగళవారం ఆమె ప్రచారం చేశారు. ‘వైకాపాలో సీనియర్‌ నాయకులకు సీటు ఇవ్వకుండా మహిళలకే అనంత బాబు ఎందుకు టికెట్లు ఇప్పిస్తున్నారు. మహిళలంటే బలహీనులు చెప్పినట్టు వింటారు.. చెప్పినట్లు చేస్తారు. ఇప్పటికే ఓ గిరిజన మహిళకు పదవి ఆశచూపి ఆమె కుటుంబంలో చిచ్పుపెట్టారు. ఆమెను డమ్మీ చేసి కూర్చోమంటే కూర్చునేలా... నిల్చోమంటే నిల్చునేలా చేశారు. ఇప్పటికే ఆ మహిళ నా గిరిజనులకు నేను మంచి చేయాలన్నా చేయలేని పరిస్థితి ఏర్పడిందంటూ అందరి వద్దా ఆవేదన చెందుతోంది. ఇటువంటి వ్యక్తి మాయలో గిరిజన మహిళలు పడొద్దని...’ శిరీషాదేవి పేర్కొన్నారు. ఇలాంటి దళారులకు మనం అవకాశం ఇస్తే మన ప్రాంతం సంపద దోచుకుంటారన్నారు. ఆ వ్యక్తి ప్రత్తిపాడు వెళ్తే ఎక్కడి నుంచే వచ్చి ఇక్కడ నీ పెత్తనం ఎంటీ అంటూ అక్కడ వారు తరిమేశారు. గతంలో ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీత మంచి పనులు చేస్తూ వ్యక్తిగత ఇమేజ్‌ పెంచుకుంటుంటే అనంత బాబు సహించలేకపోయారన్నారు.  గిరిజనుల మేలు కోరి గీత అప్పట్లో వైకాపాను వదిలేశారని శిరీషాదేవి పేర్కొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు