logo

గందరగోళం.. పోస్టల్‌ బ్యాలెట్‌

నాలుగు రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Published : 08 May 2024 01:33 IST

పోస్టల్‌ బ్యాలెట్‌ కోరుతూ ఫాం-12 అందిస్తున్న ఉద్యోగులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: నాలుగు రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన వందల మంది ఉద్యోగుల ఓట్లు రాజమహేంద్రవరం, అమలాపురంలలో ఉన్నాయని, అక్కడకు వెళ్లి వేయాలని అధికారులు చెప్పడంతో ఆదివారం కొందరు అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా తమ ఓట్లు లేవని చెప్పడంతో సోమవారం మళ్లీ రంపచోడవరం చెప్పారు. అయితే ఇక్కడా ఓట్లు చెబుతున్నారని, తమ ఓటు ఎక్కడ వినియోగించుకోవాలని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గంగదరగోళ పరిస్థితుల్లో దాదాపు వంద మంది  ఉద్యోగులు ఓటు వేయకుండా వెనుదిరిగారు. ఈ సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ తీరును పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్‌ విజయ సునీత, రిటర్నింగ్‌ అధికారి ప్రశాంత్‌కుమార్‌ల దృష్టికి ఉద్యోగులు తమ సమస్యలు తీసుకెళ్లారు. ఫాం-12 తీసుకుని అందరితో ఓటు వేయించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. దీంతో కొంతమంది ఉద్యోగులు బ్యాలెట్‌ వేశారు. అప్పటికే సమయం అయిపోవడంతో ఉద్యోగులంతా బుధవారం రావాల్సిన పరిస్థితి తలెత్తింది.

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియలో ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పడిగాపులు తప్పలేదు. ఇతర జిల్లాలకు సంబంధించిన బూత్‌ ఒక్కటే పెట్టడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్రంలో కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలకు సంబంధించి మరో రెండు పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. 12డి దరఖాస్తు చేసినప్పటికీ తమ పేర్లు పోలింగ్‌ కేంద్రంలో లేకపోవడంతో కొంతమంది ఓటేయకుండా వెనక్కి వెళ్లిపోయారు.  

అరకులోయ: అరకులోయ కంఠబంసుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రశాంతంగా జరిగింది. 987 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అరకులోయ అసెంబ్లీకి చెందిన 870 మంది ఓటర్లు, పాడేరుకి చెందిన 62 మంది, ఇతర జిల్లాలకు చెందిన 55 మంది ఓటేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు