logo

అంతకు మించి అన్నారు.. అలా వంచించారు!

మత్స్యకారులు నా కుటుంబ సభ్యులు. వారి జీవితాలను బాగుచేస్తాం. వైకాపా అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఏపీఐఐసీ పైపులైను పరిహారం చెల్లిస్తాం.

Published : 08 May 2024 01:40 IST

నాలుక మడతెట్టిన జగన్‌, వైకాపా నేతలు
అచ్యుతాపురం, న్యూస్‌టుడే

మత్స్యకారులు నా కుటుంబ సభ్యులు. వారి జీవితాలను బాగుచేస్తాం. వైకాపా అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఏపీఐఐసీ పైపులైను పరిహారం చెల్లిస్తాం. రాష్ట్రంలో అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకను సమగ్రంగా అభివృద్ధి చేసి తీరుతాం..

నెత్తిపై తాటాకు టోపీ పెట్టుకొని వల చేతపట్టుకొని సీఎం జగన్‌ చేసిన ప్రతిజ్ఞ ఇది.


ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెత దీనికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. ఎన్నికల ముందు వరకు గంగపుత్రులకు అది చేస్తాం... ఇది చేస్తామంటూ జగన్‌తోపాటు గొప్పలు చెప్పిన వైకాపా నాయకులు ఎన్నికల తరవాత ఐదేళ్లలో వారివైపు కన్నెత్తి చూడలేదు.


అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో (సెజ్‌) ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమల వ్యర్థాలను సముద్ర జలాల్లో కలపడానికి ఏపీఐఐసీ అధికారులు పూడిమడక తీరంలో పైపులైను ఏర్పాటు చేశారు. రసాయన వ్యర్థాల వల్ల తాము ఉపాధిని కోల్పోతామని మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 4,800 మంది మత్స్యకార కుటుంబ యజమానులు ఒక్కొక్కరికి రూ. 1.25 లక్షలు పరిహారం అందివ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం సరిపోదని, రూ. 5 లక్షలు అందివ్వాలని వైకాపా నాయకులు ఉద్యమబాట పట్టారు.తాము అధికారంలోకి వచ్చాక రూ. 5 లక్షలిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారు. ఈ హామీతో చాలామంది మత్స్యకారులు తెదేపా ప్రభుత్వం అందించిన పరిహారం తీసుకోకుండా ఉండిపోయారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయి, మళ్లీ ఎన్నికలు వచ్చినా ఈ హామీ అమలు కాలేదు. ఇలా వైకాపా పాలకుల మోసానికి బలయినవారు వెయ్యిమందికిపైగా ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

అచ్యుతాపురం మండలంలోని పూడిమడక అతిపెద్ద మత్స్యకార గ్రామం. ఇక్కడ దాదాపు 20 వేల జనాభా ఉంటారు. వీరికి వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. మత్స్యకారుల చేతివరకు వచ్చిన పరిహారం తీసుకోవద్దని, తాము అంతకుమించి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఇదే విషయాన్ని పదేపదే వల్లెవేశారు. దీనిని అమాయక మత్స్యకారులు పూర్తిగా నమ్మేశారు. తెదేపాకు కంచుకోటగా ఉండే ఈ గ్రామంలో గత ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించారు. కానీ చివరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా చేతులెత్తేశారు.

కాగితాలకే పరిమితం

మత్స్యకారులకు మేలు చేసేలా పూడిమడకలో మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తున్నామని సీఎం జగన్‌ ఘనంగా ప్రకటించారు. నెల్లూరు బహిరంగ సభలో పూడిమడకలో హార్బర్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రకటించారు. ఇక్కడ కనీసం తట్ట మట్టి కూడా తవ్విపోయకుండా శరవేగంగా పనులు జరుగుతున్నాయని ఎలా ప్రకటిస్తారంటూ విపక్షాలు, స్థానికులు మండిపడినా వైకాపా నాయకుల్లో చెలనంలేదు. ఎన్నికల ముందు మత్స్యకారుల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి హార్బర్‌ కోసమంటూ రోడ్డు మాత్రం నిర్మిస్తున్నారు. హార్బర్‌ నిర్మాణం చేపట్టకపోగా ఈ పేరుతో మత్స్యకారులు సాగు  చేసుకున్న జీడిమామిడి తోటలను ధ్వంసం చేసి వైకాపా పరిపాలన ఏవిధంగా ఉంటుందో మత్స్యకారులకు రుచిచూపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు