logo

మడుగుల్లా మన్యం రోడ్లు మళ్లీ వేస్తారా ఓట్లు?

జిల్లాలోని పలుచోట్ల రహదారులు దారుణంగా తయారయ్యాయి. గుంతలమయంగా మారి వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు నిలిచి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంటోంది.

Updated : 09 May 2024 05:18 IST

తెదేపా హయాంలోనే నిర్మాణం
అయిదేళ్లలో పట్టని ప్రభుత్వం
అరకులోయ, న్యూస్‌టుడే

జిల్లాలోని పలుచోట్ల రహదారులు దారుణంగా తయారయ్యాయి. గుంతలమయంగా మారి వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు నిలిచి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంటోంది. వైకాపా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో కనీసం రోడ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. రోడ్లను బాగుచేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు వేడుకున్నా పట్టించుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రహదారులకు నిధులు మంజూరైనా  బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారులు మధ్యలోనే నిలిపేశారు.  ఎమ్మెల్యేలు..  ఇతర ప్రజా ప్రతినిధులు హడావుడిగా శంకుస్థాపనలు మాత్రం చేసేశారు. కనీసం రహదారులు సక్రమంగా నిర్వహించని ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నారు.

రకులోయ పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌కి వెళ్లే రహదారి ఐదేళ్ల నుంచి గుంతలమయంగానే ఉంది. వర్షం పడితే చాలు గుంతల్లో నీరు నిండిపోయి రహదారి కనిపించకుండా పోతోంది. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వాహనదారులు ఈ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నా వైకాపా ప్రభుత్వానికి పట్టటం లేదు. ఈ గుంతలు పూడ్చడానికి కేవలం రూ. 2 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. అధికార వైకాపా ఎమ్మెల్యే సైతం ఇదే మార్గంలో వందలాది సార్లు ప్రయాణించారు. అయినప్పటికీ ఆయన పట్టించుకోలేదు.


కొయ్యూరు, న్యూస్‌టుడే: చింతలపూడి నుంచి బాలారం వెళ్లే రహదారి మధ్యలో కొన్ని చోట్ల రాళ్లు తేలి అధ్వానంగా తయారైంది. మరికొన్నిచోట్ల గుంతలేర్పడ్డాయి. కొయ్యూరు నుంచి యు.చీడిపాలెం వెళ్లే రహదారి చాలా చోట్ల ఇలాగే ఉంది. పాత కృష్ణదేవిపేట నుంచి బంగారంపేట రోడ్డు మరమ్మతులకు గురైంది. వై.రామవరం సమీప యార్లగడ్డ నుంచి మఠంభీమవరం వెళ్లే దారంతా కోతకు గురై ప్రమాదకరంగా ఉంది. తారు రోడ్డు నిర్మించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు మొరపెట్టినా ఫలితం లేకపోయిందని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మారుమూల మఠంభీమవరం, యు.చీడిపాలెం, బూదరాళ్ల పంచాయతీల్లోని పలు గ్రామాలకు తారురోడ్డు నిర్మాణాలు లేకపోవడంతో వారంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు.


ద్విచక్ర వాహనంపై ప్రయాణం కష్టమే

ఎటపాక, న్యూస్‌టుడే: మండలంలోని గౌరిదేవిపేట బస్టాండ్‌ నుంచి గన్నేరుకొయ్యపాడు, నల్లకుంట, విస్సాపురం, బండిరేవు ఇలా సుమారు 8 గ్రామాలను కలుపుతూ మాధవరావుపేట సమీపంలో 30వ జాతీయ రహదారికి కలుస్తుంది. నిత్యం ఈ రోడ్డు వెంట అనేకమంది ప్రయాణిస్తారు. గౌరిదేవిపేట బస్టాండ్‌ నుంచి గన్నేరుకొయ్యపాడులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఉన్న రహదారి పెద్ద గోతులతో అధ్వానంగా తయారై ద్విచక్ర వాహనంపై కూడా కష్టంగా వెళ్లాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కింద పడిన దాఖలాలు కూడా ఉన్నాయి. గోళ్లగట్ట నుంచి భద్రాచలం వచ్చే రహదారి కూడా ఇదే పరిస్ధితి. గోదావరి వరదల సమయంలో అందరికి ఉపయోగపడే దారి కావడంతో ఎక్కువ శాతం ప్రజలు ఈ దారిలోనే ప్రయాణిస్తారు.


రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం మండలం పందిరిమామిడి నుంచి వై.రామవరం మండలం చవిటిదిబ్బల వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులు ఐదేళ్లయినా పూర్తి చేయలేదు. దీంతో రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం మండలాలకు చెందిన పలు గ్రామాల గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 29 కిలోమీటర్ల దూరం ఉండే ఈ రహదారి నిర్మాణానికి రూ. 29 కోట్ల నిధులతో ఐదేళ్ల క్రితం ర.భ.శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు పనులు ప్రారంభించారు.  భీమవరం నుంచి వాడపల్లి వరకు 9 కిలోమీటర్ల పనులు అటవీ శాఖ అభ్యంతరాలతో నిలిచిపోయాయి. అటవీ అధికారులకు నష్టపరిహారం కింద నగదును కూడా ర.భ.శాఖ అధికారులు చెల్లించి అనుమతులు తీసుకొన్నారు. అయితే గుత్తేదారు నిర్లక్ష్యం, చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం వంటి కారణాలతో పనులు నిలిచిపోయాయి.


కూనవరం, న్యూస్‌టుడే: కూనవరం నుంచి భద్రాచలం వెళ్లే ప్రధాన మార్గమంతా గుంతలు పడి అధ్వానంగా మారింది. పోలిపాక వద్ద గోదావరి వరదలు వచ్చిన ప్రతిసారీ రోడ్డు కొట్టుకు పోతున్నా అధికారులు, పాలకుల్లో చలనం లేదు. పలు ప్రాంతాల్లోని వంతెనల వద్ద గుంతలు ప్రమాదకరంగా మారాయి. పాపికొండల పర్యాటకం ఈ మార్గంలోనే జరుగుతున్నా... దిద్దుబాటు చర్యలు శూన్యం.


వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: మండలంలోని పెదమట్టపల్లి నుంచి చింతూరు మండలం నర్సింగపేట వరకు 16.2.కి.మీ ప్రధాన రహదారి నిర్మాణానికి 2020 ఆక్టోబర్‌లో పంచాయతీరాజ్‌ శాఖ పీఐయూ విభాగం నుంచి రూ.433 లక్షల విలువ అంచనాతో ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత బాబు శంకుస్థాపన చేశారు. అధికారులు కొత్తదారి వేస్తామంటూ, ఉన్నదారిని తవ్వి, కంకర పోసి వదిలేశారు. అప్పటి నుంచి రెండు మండలాల మధ్యనున్న దాదాపు 25 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా అత్యవసర వైద్యానికి కొన్నిసార్లు 108 వాహనం అక్కడకు వెళ్ళలేని పరిస్థితి.


ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: పాడేరు, జోలాపుట్టు ప్రధాన రహదారి నుంచి కిలగాడ పంచాయతీలోని పడాల్‌పుట్టు గ్రామానికి రహదారి నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. తారురోడ్డు నిర్మాణం చేపట్టేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.65 లక్షలు మంజూరు చేశారు. నాలుగేళ్ల క్రితం నిధులు మంజూరైనా, సకాలంలో పనులు చేపట్టలేదు. రూ.35 లక్షలు ఖర్చు చేసి, కంకర పోసి మమ అనిపించారు. నిధులు వృథా అయ్యాయి. పడాల్‌పుట్టు గ్రామానికి మాత్రం తారురోడ్డు సదుపాయం సమకూరలేదు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లి నుంచి గూడెంకొత్తవీధి మీదుగా సీలేరు వెళ్లే మార్గం దుర్భరంగా మారింది. ఆర్వీనగర్‌ నుంచి లంకపాకలు వరకూ అడుగడుగునా గోతులమయమైంది. గత తెదేపా ప్రభుత్వం హయాంలో ఈ రహదారి నిర్మాణానికి గిరిజన ఉప ప్రణాళిక నిధులు సుమారు రూ.80 కోట్లు వెచ్చించారు. ఆ తరువాత జగన్‌ సర్కారు ఈ నిధులు దారి మళ్లించింది. అప్పటికే  కొద్దిమేర పనులు చేపట్టిన గుత్తేదారుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురైంది.


రాజవొమ్మంగి: రాజవొమ్మంగి నుంచి మొల్లిమెట్ల మీదుగా లబ్బరి,  బడదనాంపల్లి పంచాయతీ లక్కవరప్పాడు నుంచి రాజుపేట వెళ్లే దాదాపు 2 కిలోమీటర్ల రహదారిలో రాళ్లు పైకి తేలి గోతులు పడి, ఓ చోట కోతకు గురైంది. వర్షం పడినపుడు గోతుల్లో నీరు చేరి బురదమయంగా మారుతుండటంతో వాహనాలు పాడవడంతోపాటు తరచూ ప్రమాదాలబారిన పడుతున్నామని వాహనదారులు, పాదచారులు వాపోతున్నారు. నిర్మించిన నాటి నుంచి ఈ రెండు రహదారులకు కనీస మరమ్మతులు చేపట్టలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని