logo

ఎందుకీ జాప్యం ఏమిటీ మౌనం..?

ఎటువంటి ఆధారాలు లభించని నేరాల్లో సైతం నిందితులను రోజులు, గంటల వ్యవధిలోనే జిల్లా పోలీస్‌ శాఖ పట్టుకున్న సంఘటనలున్నాయి.

Published : 04 Aug 2023 05:05 IST

పలు హత్యల కేసుల్లో కనిపించని పురోగతి
దర్యాప్తు పేరుతో దాటవేత
మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే

టువంటి ఆధారాలు లభించని నేరాల్లో సైతం నిందితులను రోజులు, గంటల వ్యవధిలోనే జిల్లా పోలీస్‌ శాఖ పట్టుకున్న సంఘటనలున్నాయి. విస్తరించిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల నిందితులు సునాయాసంగా పట్టుబడుతున్నారు. అలాంటిది స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించే కొన్ని హత్యల విషయంలో నిందితులు పట్టుబడకపోవడం చర్చకు తావిచ్చేలా చేస్తోంది. ప్రధానంగా ఆర్థికంగా, రాజకీయంగా పట్టున్న కుటుంబాల్లో హత్యలకు సంబంధించిన దర్యాప్తు తీరుపై విశ్వసనీయత కోల్పోయేలా కొన్ని ఉదంతాలు నిలుస్తున్నాయి.

ఇవీ ఉదాహరణలు

  • రెండేళ్ల క్రితం గుడివాడ రాజేంద్రనగర్‌లో జంట హత్యలు చోటుచేసుకున్నాయి. ఆర్థికంగా మంచి ఉన్నతస్థితిలో ఉన్న దంపతులను ఇంట్లోనే అతి కిరాతకంగా హతమార్చారు. హత్య జరిగిన తీరు, సంఘటనా స్థలాన్ని చూసిన వారికి ఎవరికైనా కరడుగట్టిన నేరస్థులే ఆ దారుణానికి పాల్పడ్డారన్న విషయం అర్థమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన ఈ హత్య కేసులో అదే ప్రాంతానికి చెందిన ఓ సాధారణ డ్రైవర్‌ను నిందితునిగా నిర్ధారించడంతో కేసు గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు నిందితులు తప్పించుకున్నారన్న వ్యాఖ్యలు మృతుల బంధువర్గంలోనే వ్యక్తమయ్యాయి.
  • గుడివాడ హత్య ఘటన ప్రజలు మరవకముందే అవనిగడ్డలో డాక్టర్‌ శ్రీహరి నివాసగృహంలోనే హత్యకు గురయ్యారు. వ్యాపార, రాజకీయ ప్రముఖలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన మంచి స్థితిపరుడు. స్నేహితులతో కలిసి చేసే వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడులు సమకూర్చేవారు. అటువంటి వ్యక్తి దారుణ హత్యకు గురై సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ నేరస్థులు ఎవరన్న విషయం తేలలేదు.

వైద్యురాలి హత్య విషయంలోనూ..

వారం రోజుల క్రితం నగరానికి చెందిన వైద్యురాలు మాచర్ల రాధ నివాసగృహంలోనే హత్యకు గురయ్యారు. జనసంచారం బాగా ఉండే రాత్రి 9.00 గంటల సమయంలో ఆస్పత్రి కింద ఫ్లోర్‌లో ఓపీ నడుస్తుండగా, పై అంతస్తులో ఉన్న ఆమెను హతమార్చారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సంచలనం కల్గించిన హత్య జరిగి వారం కావొస్తున్నా ఇంకా దర్యాప్తు తీరు ఒక  కొలిక్కిరాలేదు. ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది కళ్లుగప్పి బయట వ్యక్తులు పై అంతస్తుకు వెళ్లే అవకాశం లేదు. ఆస్పత్రి పరిసరాల్లో ఇతర వ్యాపారసంస్థలకు చెందిన సీసీ కెమెరాలున్నా.. వాటి ఫుటేజి నుంచి అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కన్పించలేదు. ప్రాథమికంగా చేపట్టిన దర్యాప్తులో ఎటువంటి కీలక ఆధారాలు లభించలేదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో కొన్ని ఛాట్‌లు తొలగించి ఉన్నట్టుగా తెలుస్తోంది. అవనిగడ్డతో పాటు మచిలీపట్నంలో చోటుచేసుకున్న హత్యాసంఘటనల్లో మృతులెవ్వరికీ బయట వ్యక్తులతో విభేదాలు లేవు. హత్య జరిగిన తీరును పరిశీలించినా ఎవరో తెలియని వ్యక్తులు హఠాత్తుగా చొరబడి హత్యకు పాల్పడే పరిస్థితులు కన్పించడం లేదు. మృతుల తరపు కుటుంబసభ్యులు, సన్నిహితులు, పరిచయస్తుల అనుమానాలను పరిగణనలోకి తీసుకున్నా హంతకులెవరన్న విషయం తెలిసిపోతుందన్న భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.


  • మచిలీపట్నానికి చెందిన జువ్వనపూడి వినోదరావు ఎమ్మార్పీఎస్‌, కుల వివక్షపోరాట సమితి కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించేవారు. నగర వాసులకు చిరపరిచితులు. ఆయనను హత్యచేసి నివాసగృహంలోని వరండాలో ఉరి వేసుకుని మృతి చెందినట్టుగా హంతకులు చిత్రీకరించారు. మృతుని చేతులు కట్టేసి ఉండడంతో పాటు, మొహానికి ప్లాస్టిక్‌ సంచులు చుట్టేసిన స్థితిలో వేలాడుతున్న మృతదేహాన్ని చూస్తే అది హత్యే అన్న విషయం ఎవరికైనా తెలిసిపోతుంది. సంఘటనా స్థలంలో కొన్ని బలమైన ఆధారాలు లభించాయి. నెలలు దొర్లిపోతున్నా హత్యకు పాల్పడిన వారి ఆచూకీ లభించడం లేదు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని