logo

TDP-YSRCP: గన్నవరంలో గరం గరం!

ఎత్తులు పైఎత్తులు.. వ్యూహాలు ప్రతివ్యూహాలు.. వర్గపోరు.. ఆధిపత్యపోరు.. ఇలాంటి సమీకరణలకు గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా మారింది.

Updated : 18 Aug 2023 08:58 IST

తెదేపా గూటికి దాసరి సోదరులు?
యార్లగడ్డ కీలక సమావేశంపై ఆసక్తి

నిడమానూరులో లోకేశ్‌ బస చేసే ప్రాంతాన్ని సిద్ధం చేసే పనుల్ని ప్రారంభిస్తున్న తెదేపా నాయకులు

ఈనాడు - అమరావతి, హనుమాన్‌జంక్షన్‌ - న్యూస్‌టుడే : ఎత్తులు పైఎత్తులు.. వ్యూహాలు ప్రతివ్యూహాలు.. వర్గపోరు.. ఆధిపత్యపోరు.. ఇలాంటి సమీకరణలకు గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా మారింది. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొన్న ఈ ప్రాంత సమీకరణాలు మారనున్నాయి. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర యువగళం గన్నవరం కేంద్రంగా భారీ సభ జరగనుంది. గన్నవరంలో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో తెదేపా జెండా ఎగురవేయాలనే పట్టుదల పార్టీశ్రేణుల్లో నెలకొంది. త్వరలో భారీ మార్పులు.. చేరికలు జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అధికార పార్టీలో అసమ్మతి సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ఈ పరిణామాల పట్ల ఆసక్తి నెలకొంది. యువగళానికి ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. అందరి దృష్టి ప్రస్తుతం గన్నవరంపైనే ఉంది. రాజకీయంగా చైతన్యం కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళంలో గన్నవరం కేంద్రీకృతంగా మారింది.  యువనేత లోకేశ్‌కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసేలా నాయకులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరోవైపు వైకాపా అసమ్మతి నేత యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా సీఎం జగన్‌ తీరు తప్పు పడుతూ సమావేశం నిర్వహించడం, రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తాననడం, మాజీ ఎమ్మెల్యే బాలవర్థనరావు, చంద్రబాబుని కలవడం వేడిని మరింత పెంచుతుంది.


గన్నవరంపైనే!

యువగళం పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులు నిర్వహించనున్నారు. ఈ జిల్లా తెదేపాకు గట్టి పట్టు ఉన్న జిల్లా. గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్ర రెండు రోజులు కొనసాగనుంది. బహిరంగ సభ ఇక్కడే ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి పెనమలూరు నియోజకవర్గం మీదుగా నిడమానూరు చేరుకుంటుంది. చిన్నఆవుటపల్లి వద్ద బహిరంగ సభ వేదికను ఖరారు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ తెదేపా నుంచి పార్టీ మారి అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాటి నుంచి తెదేపా శ్రేణుల్లో పట్టుదల పెరిగింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనెల 20, 21 తేదీల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు. 21 సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. ఈక్రమంలో లోకేశ్‌ బస, బహిరంగ సభ నిర్వహణ నిమిత్తం అనువైన స్థలాల్ని ఎంపిక చేసిన నాయకులు నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బహిరంగ సభ కోసం చిన్నఆవుటపల్లి సమీపంలో తొమ్మిది ఎకరాలు, బస కోసం నిడమానూరు సమీపంలో ఆరెకరాలు సిద్ధం చేస్తున్నారు. గన్నవరం పర్యటనను లోకేశ్‌ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.


మారనున్న సమీకరణాలు

గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తుపై సమాలోచనలు చేస్తున్నారు. డీసీసీబీ ఛైర్మన్‌ పదవి ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్నారు. అప్పుడప్పుడు కార్యకర్తలను పరామర్శించేవారు. తెదేపా నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వంశీ పార్టీ మారి జగన్‌కు మద్దతు తెలపడంతో వైకాపా నేతల భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. యార్లగడ్డ, దుట్టా... ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వ్యతిరేకించి వైకాపాలో వేరు కుంపటి పెట్టుకున్నారు. అధినేత చెప్పినా ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేందుకు అంగీకరించలేదు. దీంతో గత ఆదివారం కార్యకర్తల ఆత్మీయ సమావేశం పేరుతో బహిరంగ సభ నిర్వహించి, జగన్‌ తనని మోసం చేశారని యార్లగడ్డ ఆవేదన వెళ్లగక్కారు. జగన్‌ సీటిచ్చినా ఇవ్వకపోయినా రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ ఖాయమని స్పష్టం చేశారు. శుక్రవారం కూడా మరోసారి సమావేశం కానున్నారు. లోకేశ్‌ పాదయాత్ర సందర్భంగా తెదేపాలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ధ్రువీకరణ కాలేదు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు కూడా చంద్రబాబుని కలవడంతో పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని చెబుతున్నారు.


ఫ్లెక్సీల లొల్లి..!

యువగళం పాదయాత్ర సందర్భంగా విజయవాడ నగరంలో, గన్నవరంలో అధికార పార్టీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారు. తమ నేతకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై తెదేపా నేతలు బుద్దా వెంకన్న, కేశినేని చిన్ని ఘాటుగా స్పందించారు. గురువారం రాత్రి కొన్ని తొలగించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు తలెత్తాయి. గన్నవరంలో బహిరంగ సభ వేదికకు స్థలం లభించకుండా వ్యూహాలు పన్నారు. ఎట్టకేలకు చిన్నఅవుట్‌పల్లి వద్ద ఏర్పాటు చేశారు. విజయవాడలో ఒక ప్రైవేటు ఫంక్షన్‌ హాలు ఇవ్వడానికి రాజకీయ ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు గురిచేశారు. ఎట్టకేలకు తిరిగి దానినే బసకు ఏర్పాటు చేశారు. వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు