logo

Avanigadda: జీతం రూ.500.. 20 నెలలుగా బకాయిలు

రెండున్నర దశాబ్దాల క్రితం నిర్ణయించిన నెలకు రూ.500 నామమాత్రపు గౌరవ వేతనాన్ని పెంచాలని బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్వోలు) కోరుతున్నారు.

Updated : 28 Aug 2023 09:29 IST

25 ఏళ్ల నాటి గౌరవ వేతనం పెంచాలి

సమావేశమైన అవనిగడ్డ నియోజకవర్గ బీఎల్వోలు (పాతచిత్రం)

అవనిగడ్డ, న్యూస్‌టుడే:  రెండున్నర దశాబ్దాల క్రితం నిర్ణయించిన నెలకు రూ.500 నామమాత్రపు గౌరవ వేతనాన్ని పెంచాలని బూత్‌ లెవల్‌ అధికారులు (బీఎల్వోలు) కోరుతున్నారు. మహిళా కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనం కంటే తమ నెల జీతం తక్కువేనని పలువురు వాపోతున్నారు. గతంలో ఎక్కువ మంది రెవెన్యూ సిబ్బందినే బీఎల్వోలుగా నియమించేవారు. అప్పటికీ చాలకపోతే అంగన్‌వాడీ కార్యకర్తల సేవల్ని వినియోగించేవారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బందిని ఎక్కువ మందిని బీఎల్వోలుగా నియమించింది. దానికి తోడు ఈ ఏడాది జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా సరిచేసే సర్వేను అప్పగించారు. దీంతో సచివాలయాల విధులతోపాటు ఇంటింటి సర్వేతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. సచివాలయ సంక్షేమ, డిజిటల్‌ సహాయకులను బీఎల్వోలుగా నియమించవద్దని 2022 డిసెంబరులో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదు.

నెలకు ఇచ్చే గౌరవ వేతనం రూ.500 కూడా 2022 జనవరి తర్వాత ఇంతవరకూ రాలేదని బీఎల్‌వోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 25 సంవత్సరాల క్రితం నుంచి ఇస్తున్న రూ.500 ఈ గౌరవ వేతనాన్ని మార్పు చేసి పనిచేసిన రోజులు లెక్కించి, రోజుకు రూ.1000 చొప్పున ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని బీఎల్వోలు కోరుతున్నారు. అందరి జీతాలు పెరిగాయి కానీ తమ వేతనం పెంచకుండా ఊపిరి సలపని పనులతో చాకిరీ చేయించుకోవడం దారుణమని వారంతా వాపోతున్నారు. నెల రోజులపాటు పూర్తిస్థాయి సర్వే అప్పగించినా జీతం మాత్రం రూ.500లేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి దారుణమైన వేతనం దేశంలో ఎవరికీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ నియోజకవర్గ ఈఆర్వో వి.పార్వతి వద్ద ‘న్యూస్‌టుడే’ దీనిపై ప్రస్తావించగా బీఎల్వోలకు ఇచ్చేది గౌరవ వేతనమని, రోజూ పని ఉండదని చెప్పారు. బకాయిలు లేవనడం గమనార్హం. ఎన్నికల డీటీ శ్రీనివాసరావు మాత్రం 2022 జనవరి నుంచి బకాయిలు ఉన్నాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు