logo

అంతర జిల్లా ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు

జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు.

Published : 29 Mar 2024 04:09 IST

మాట్లాడుతున్న ఎస్పీ నయీం అస్మి

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: జల్సాలకు అలవాటుపడి వివిధ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ వాటిని విక్రయిస్తున్న దొంగను పట్టుకొని 37 ద్విచక్ర వాహనాలను తోట్లవల్లూరు పోలీసులు పట్టుకున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం ఆయన విలేకరులకు తెలియజేశారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురంలోని రామ్‌నగర్‌కు చెందిన నిందితుడు ఒడుగు సుబ్బారావు(40) కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలోని సాయిబాబాగుడి వద్ద నివాసం ఉంటూ తాపీ పని చేస్తూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదనే లక్ష్యంగా రద్దీగా ఉండే వాహనాలు నిలిపే ప్రాంతాలను ఎంపిక చేసుకొని పలు ద్విచక్ర వాహనాలను దొంగిలించేవాడు. ఈ వాహనాలను తెలిసినవారి ద్వారా తక్కువ ధరకే విక్రయిస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు.

పట్టుబడిందిలా.. : తోట్లవల్లూరు వద్ద కృష్ణా కరకట్టపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వారిని చూసి సుబ్బారావు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. పమిడిముక్కల సీఐ ఎం.కిషోర్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై పి.విశ్వనాథ్‌, కానిస్టేబుల్స్‌ రామకృష్ణ, రమణ, హెడ్‌ కానిస్టేబుల్స్‌ రవికుమార్‌, కె.నాగ వెంకన్న బృందం అతడ్ని విచారించగా మొత్తం బండారం బయటపడింది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, ఏలూరు జిల్లాల్లోని 18 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 37 ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు అంగీకరించాడు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు, పమిడిముక్కల, కంకిపాడు, పెనమలూరు, మోపిదేవి, గుడివాడ టౌన్‌, రాబర్ట్‌సన్‌పేట, ఏలూరు టౌన్‌, గుంటూరు జిల్లాలోని పొన్నూరు, గుంటూరు టౌన్‌, తెనాలి, బాపట్ల జిల్లాలో రేపల్లె, అమృతలూరు, ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని కృష్ణలంక, సత్యనారాయణపురం, మాచవరం, వన్‌, టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని ఎస్పీ వివరించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న బైకులు

నిందితుడిపై 31 కేసులు నమోదు చేశామని, మిగతా వాహనాలకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. అతడ్ని అరెస్టు చేసి ఉయ్యూరులోని పదో అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ముందు గురువారం హాజరుపరచామని తెలిపారు. ఈ కేసును ఛేదించిన గుడివాడ డీఎస్పీ కె.శ్రీకాంత్‌, పమిడిముక్కల సీఐ ఎం.కిషోర్‌బాబు, ఎస్సై విశ్వనాథ్‌, పలువురు సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని