logo

చదవలేకపోయామని అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం

పెళ్లి అయిన అయిదేళ్లకు ఆ దంపతులకు సంతానం కలిగింది. లేక లేక పుట్టిన ఇద్దరు ఆడబిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటుండగా పరీక్షల ఫలితాలు ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తాయి.

Published : 15 Apr 2024 04:03 IST

ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: పెళ్లి అయిన అయిదేళ్లకు ఆ దంపతులకు సంతానం కలిగింది. లేక లేక పుట్టిన ఇద్దరు ఆడబిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటుండగా పరీక్షల ఫలితాలు ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచెత్తాయి. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ మండలానికి చెందిన ఓ చిన్న రైతుకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారికి ఉత్తమ భవిత ఇవ్వాలని ఏ పనికీ పంపకుండా చదివిస్తూ నిత్యం శ్రమిస్తున్నారు. పెద్దపాప(18) బీటెక్‌ ప్రథమ సంవత్సరం, చిన్న అమ్మాయి (17) ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. పెద్ద కుమార్తె ప్రథమ సెమిస్టర్‌లో ఉత్తీర్ణత కాలేకపోయింది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో చిన్న కుమార్తె కూడా ఒక సబ్జెక్టు తప్పింది. ఈ క్రమంలో నాన్న మన కోసం ఎంతో కష్ట పడుతున్నారు.. పరీక్ష తప్పడంతో ఆయన ఏమనుకుంటారో, ఎలా మందలిస్తారో అనే భయంతో చిన్నమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అక్క కూడా ఆమెతో కలిసి ఇంట్లోని గడ్డి మందు తాగి శనివారం ఆత్మహత్యకు యత్నించారు. వాంతులు చేసుకుంటుండగా ఏమైందని తండ్రి అడగ్గా ఉత్తీర్ణులు కాలేకపోయామని గడ్డి మందు తాగామని చెప్పడంతో ఆయన ఒక్క సారిగా కుప్పకూలాడు. వెంటనే తేరుకొని గుడివాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం విజయవాడకు సిఫార్సు చేశారు. అక్కడ చిన్న పాప మృతి చెందింది. పెద్ద పాప మృత్యువుతో పోరాడుతోంది. ఆ పిల్లనైనా భగవంతుడు కాపాడాలని తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు. 48 గంటలవరకూ ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గుడివాడ తాలూకా పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ ఎన్‌.లక్ష్మీనరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని