logo

కక్ష కట్టి .. కడుపుకొట్టి

సాధారణ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేసే పని ఒకటే అయినా కనీస వేతనం అందక పోవడంతో అంతంత మాత్రపు వేతనాలతో దయనీయమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు.

Published : 15 Apr 2024 04:08 IST

కనీస వేతనం అందడంలేదని ఔట్‌సోర్సు ఉద్యోగుల ఆవేదన
మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే

పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై చేపట్టిన ధర్నాలో పాల్గొన్న నాయకులు, ఉద్యోగులు (పాత చిత్రం)

సాధారణ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేసే పని ఒకటే అయినా కనీస వేతనం అందక పోవడంతో అంతంత మాత్రపు వేతనాలతో దయనీయమైన పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 1.15లక్షల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నట్లు వివిధ సంఘాల నాయకులు చెబుతున్నారు. అలాంటి వారందరికీ సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తరువాత వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఔట్‌సోర్సింగ్‌ ద్వారా పనిచేసేవారికి 32శాతం పెంచాలని పీఆర్సీ కమిటీ సిఫార్సు చేసినా ఆ దిశగా పూర్తిస్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవు. పైగా పాలకులు, అధికారుల వేధింపులు ఎక్కువ కావడంతో ఇబ్బందులు తాళలేక అనేకసార్లు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోవడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులు, తదితర సమస్యలపై పలు సంఘాల నాయకులు, ఉద్యోగులు తమ అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించారు.


తీవ్ర అన్యాయం: సీహెచ్‌ జయరావు, సీఐటీయూ నాయకులు

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏళ్లు గడిచిపోతున్నా వారి డిమాండ్లు పరిష్కరించకపోవడంతో చివరికి రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి దాపురించింది. అయినా ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. ఉద్యోగులు  ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి ఏవైతే హామీలు ఇచ్చారో అవి అమలు చేయాలని మాత్రమే కోరుతున్నా ఇప్పటివరకు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం.


కనీస వేతనం ఏదీ: బి.కాశమ్మ, ఆశావర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు

గత 15 ఏళ్లుగా గర్భిణులు, బాలింతలు, శిశువులకు ఆరోగ్యసేవలు అందిస్తున్నాం. మా సమస్యలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సమాన పనికి సమానవేతనం అమలు చేస్తామని చెప్పడమే తప్ప ఇంతవరకు అమలు చేయలేదు. మాకు సంబంధంలేని పనులు చేయిస్తున్నారు. అయినా మా సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరం. ఏకారణం చేత ఆశాలు చనిపోయినా రూ. 10 లక్షల బీమాసౌకర్యం కల్పించాలని ఎప్పటినుంచో అడుగున్నా ఇంతవరకు స్పందించలేదు. అవసరమైన వసతులు కల్పించడంతోపాటు కనీసం వేతనం అమలు చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాô.


ఇబ్బందులు పడుతున్నారు..

మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప అమలు చేయకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నారు. చాలీ చాలని జీతాలతో కుటుంబపోషణ భారమై ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. సమస్యల పరిష్కారంపై సమ్మె చేసిన సమయంలో వివిధ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు. జీతం పెంచినట్లు పెంచి హెల్త్‌ అలవెన్స్‌ నిలిపివేశారు. ఆరోగ్య అలవెన్సు రూ.6వేల చొప్పున ఇచ్చేవారు. అది కూడా ఇవ్వడం లేదు. ఇంకా అనేక హామీలు అమలు చేయలేదు. ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని కోరుతున్నాం. 

ధనికొండ నాగమల్లేశ్వరరావు, మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగ సంఘ నాయకులు


పథకాలు రావడం లేదు

కనీస వేతనానికి నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు అంటూ ప్రభుత్వ పథకాలు ఏమీ రావడంలేదు. దీనివల్ల అంగన్‌వాడీ కార్యకర్తలే కాకుండా అనేక విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌వాడీలకు రావాల్సిన జీతాలతోపాటు వివిధ బకాయిలు పేరుకుపోయాయి. సమ్మె సమయంలో ఇచ్చిన హమీలకుగానూ కొన్నింటికి మాత్రం ఉత్తర్వులు ఇచ్చారు. ఇంకా కొన్ని అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం మా ఇబ్బందులు గుర్తించి ఇచ్చిన హామీలు అమలు చేసి, న్యాయం చేయాలని కోరుతున్నాం.

రెజీనారాణి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకురాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని