logo

దాళ్వా ధ్యానం కొనేవారేరి?

ఖరీఫ్‌లో ఆర్బీకేలకు అప్పగించిన ధాన్యం సొమ్ము కోసం మొన్నటి వరకు ఎదురు చూసిన రైతులకు అప్పుడే మరో సమస్య ఎదురైంది.

Published : 15 Apr 2024 04:10 IST

మద్దతు ధర రూ.1,650, వ్యాపారుల కొనుగోలు రూ.1,150
బస్తాకు రూ.500 నష్టపోతున్న రైతులు
కంకిపాడు, న్యూస్‌టుడే

కంకిపాడు బైపాస్‌పై ఆరబోశారిలా..

రీఫ్‌లో ఆర్బీకేలకు అప్పగించిన ధాన్యం సొమ్ము కోసం మొన్నటి వరకు ఎదురు చూసిన రైతులకు అప్పుడే మరో సమస్య ఎదురైంది. ఈ సీజన్‌లో జిల్లాలో దాదాపు 1.20 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేశారు. ప్రస్తుతం కోత దశకు రాగా యంత్రాలతో నూర్పిడి పనులు చేపట్టారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసు లేకపోవడంతో సాగుదారులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర 75 కిలోల బస్తా రూ.1,650 కాగా మధ్యవర్తులు, మిల్లర్లు రూ.1,150లకు కొనుగోలు చేస్తున్నారు. ఇలా బస్తాకు రూ.500 మేర నష్టపోతున్నామని వాపోతున్నారు.

చేసేదిలేకే సాగు

జిల్లాలో 35 శాతం భూములు అపరా వంటి ఆరుతడి పైర్ల సాగుకు అనుకూలంగా లేవు. చౌడు శాతం అధికంగా ఉండడంతోపాటు పరిసర రైతులు దాళ్వా వేస్తుండడంతో మిగతా రైతులూ ఆదే మార్గం ఎంచుకున్నారు. గత ఖరీఫ్‌లో పంట చేతికి వచ్చే సమయంలో తుపాను, భారీ వర్షాలు, ఈదురుగాలులకు వరి పైరుకు భారీనష్టం జరగడం విదితమే. ఇదే సమయంలో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధర 30-40 శాతం పెరిగింది. దీంతో ధాన్యంకు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో దాళ్వా వైపు మొగ్గు చూపారు. సరకు నాణ్యత బాగుంది. దిగుబడి ఆశావహంగా ఉంది. వేసవిలో ఎండ తీవ్రతకు తేమ శాతం నిబంధనలకు లోబడే ఉంది. ఈ దశలో కనీసం బస్తాకు రూ.1,450 వరకైనా లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది.


సిండికేట్‌కు బ్రేక్‌ వేయండి

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో వ్యాపారులు, మిల్లర్ల సిండికేట్‌కు బ్రేకు పడుతుంది. మద్దతు ధర చెల్లించకపోయినా మధ్యే మార్గంగా రూ.1,400-1,450కైనా సేకరిస్తారు. దీంతో కర్షకులకు కొంతమేర ఉపశమనం లభిస్తుంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

కొణతం సుబ్రహ్మణ్యం, రైతు, ఉప్పలూరు


సేకరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

దాళ్వాకు అనుమతి లేదు. ప్రభుత్వం సేకరించదు..అనడానికి వీల్లేదు. వ్యవసాయ చట్టంలో రైతు ఏ సమయంలోనైనా తాను పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకునే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నేను 30 ఎకరాల్లో వరి వేశా. బయట మార్కెట్‌లో ప్రస్తుత ధర ప్రకారం ధాన్యం అమ్మితే రూ.6లక్షల నష్టం వస్తుంది.

మద్దాలి సాయిబాబు, కౌలు రైతు, పునాదిపాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని