logo

‘ ఒక్క బీసీ ఓటూ వైకాపాకు పడకూడదు’

రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీలను వైకాపా పొట్టనబెట్టుకుందని, అలాంటి పార్టీకి మైలవరం నియోజకవర్గం నుంచి ఒక్క బీసీ ఓటు కూడా పడకూడదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Published : 15 Apr 2024 04:11 IST

ఐక్యత చాటుతున్న చిన్ని, కొనకళ్ల, నెట్టెం, కొల్లు, వసంత తదితరులు

మైలవరం: రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీలను వైకాపా పొట్టనబెట్టుకుందని, అలాంటి పార్టీకి మైలవరం నియోజకవర్గం నుంచి ఒక్క బీసీ ఓటు కూడా పడకూడదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం మైలవరంలో జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా బీసీ సదస్సు నిర్వహించారు. రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై దాడులను ఉదహరించారు. 140 బీసీ కులాలకు తెదేపా అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని, అందుకే చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ ప్రకటించారని చెప్పారు. మైలవరంలో బీసీకి సీటు ఇచ్చామని చెప్పుకొంటున్న జగన్‌..  కొలుసు పార్థసారథికి ఎందుకు సీటివ్వలేదని ప్రశ్నించారు. జంగా కృష్ణమూర్తిని కూడా జగన్‌ అవమానించారన్నారు. మైలవరంలో తెదేపా అభ్యర్థి కృష్ణప్రసాద్‌ను గెలిపిస్తే అన్నివర్గాలకు అండగా ఉంటారన్నారు. ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌, నాన్నా పులి కథ మొదలుపెట్టారని, 2014లో తండ్రి మరణంపై, 2019లో బాబాయ్‌ హత్య, కోడికత్తి కేసు నాటకాలాడి తెదేపాపై బురద చల్లారన్నారు. తాజాగా గులకరాయి కథ చెబుతూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని 7 స్థానాల్లో తెదేపా గెలుస్తుందని, మైలవరంలో భారీ ఆధిక్యత వస్తుందని చెప్పారు. ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం పథకాల పేరిట ప్రజల్ని మోసగించి, పన్నుల రూపేణా భారం మోపిందని జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెదేపాతోనే బీసీలకు అండ లభిస్తోందని కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. 16న మైలవరంలో దళిత శంఖారావం నిర్వహిస్తామని, 22న నామినేషన్‌ వేస్తున్నాననీ, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ , ఎమ్మెల్సీ రామారావు, తెదేపా బీసీ సాధికారికత రాష్ట్ర నాయకురాలు నూకాలమ్మ, బీసీ నాయకులు గురుమూర్తి, చిట్టిబాబు, శ్రీనివాసరావు, నరసింహారావు, భాజపా నాయకుడు బాలకోటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని