logo

బెట్టు వీడిన వేదవ్యాస్‌

పెడన తెదేపా అభ్యర్థిగా సీటు దక్కకపోవడంతో కొంత కాలంగా పార్టీపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ బెట్టు వీడారు.

Published : 15 Apr 2024 04:13 IST

కూటమి గెలుపే లక్ష్యమని వెల్లడి

ఐక్యత చాటుతున్న కొనకళ్ల నారాయణరావు, కాగిత కృష్ణప్రసాద్‌, బూరగడ్డ వేదవ్యాస్‌, ఎంపీ బాలశౌరి, కొల్లు రవీంద్ర

మచిలీపట్నం(కోనేరుసెంటరు), పెడన న్యూస్‌టుడే: పెడన తెదేపా అభ్యర్థిగా సీటు దక్కకపోవడంతో కొంత కాలంగా పార్టీపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌ బెట్టు వీడారు. కూటమి నాయకులు వల్లభనేని బాలశౌరి, కొనకళ్ల నారాయణరావు, కొల్లు రవీంద్రతో పాటు పెడన తెదేపా అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌, తదితరులు వ్యాస్‌తో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఇటీవలే వ్యాస్‌ తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించడంతో పాటు భవిష్యత్తు రాజకీయ నిర్ణయం తీసుకుంటానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. వైకాపా నాయకులు ఆయనతో మంతనాలు సాగిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ స్థానానికి కూటమి అభ్యర్థిగా ఉన్న వల్లభనేని బాలశౌరి వ్యాస్‌ను కలిశారు. వ్యాస్‌ తెలిపిన సమస్యలపై రెండు రోజుల్లో పార్టీ అధిష్ఠానాలతో మాట్లాడతానంటూ మాట ఇచ్చిన బాలశౌరి శనివారం చంద్రబాబుతో భేటీ అయ్యేలా చేశారు. వ్యాస్‌ రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు తగు భరోసా ఇవ్వడంతో ఆదివారం కూటమి నాయకులు వ్యాస్‌ ఇంటికి వెళ్లి మాట్లాడారు. ఇకపై అందరూ కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేస్తామని ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యాస్‌కు అన్ని విషయాల్లో తమ సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటుందని బాలశౌరి, కొనకళ్ల, రవీంద్రలు తెలిపారు. కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తానని వ్యాస్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని