logo

బడిలో గుప్పు.. పాలకులదే తప్పు!

ఐదేళ్ల జగన్‌ పాలనలో విద్యావ్యవస్థ మూలాల్లోకి గంజాయి మత్తు చొచ్చుకెళ్లింది. పాఠశాల, కళాశాల, యువతలో.. చాలా మందిని గంజాయి మత్తు కమ్మేసింది. ఎనిమిదో తరగతి నుంచే పిల్లల చేతుల్లోకి గంజాయి ప్యాకెట్లు చేరుతున్నాయి.

Updated : 15 Apr 2024 04:46 IST

పాఠశాలలు, కాలేజీలను కమ్మేసిన మత్తు
విద్యార్థులతోనే విక్రయాలు.. అడ్డొస్తే దాడులు
అయిదేళ్ల జగన్‌ ఏలుబడి.. భావితరానికి గొడ్డలిపెట్టు
ఈనాడు, అమరావతి - విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే

ఐదేళ్ల జగన్‌ పాలనలో విద్యావ్యవస్థ మూలాల్లోకి గంజాయి మత్తు చొచ్చుకెళ్లింది. పాఠశాల, కళాశాల, యువతలో.. చాలా మందిని గంజాయి మత్తు కమ్మేసింది. ఎనిమిదో తరగతి నుంచే పిల్లల చేతుల్లోకి గంజాయి ప్యాకెట్లు చేరుతున్నాయి. కళాశాలల్లో గంజాయి ఊడలు.. బాగా వెళ్లాయి. చివరకు తమకు గంజాయి కావాలంటే.. వేరొకరికి విక్రయించాలని.. సరఫరాదారులు చెబితే దానికీ సిద్ధమైపోతున్నారు. కొందరు గంజాయి మత్తులో.. చోరీలు, బెట్టింగ్‌లు, జూదానికి అలవాటు పడ్డారు. కళాశాలల్లో చేరాక ఒకరి నుంచి మరొకరికి పాకుతోంది. విద్యార్థులను మత్తు బారినపడకుండా కాపాడుకోవడం తల్లిదండ్రులకు సాధ్యం కాని అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.

పాఠశాలల్లో..: విజయవాడ శివారులో.. కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చే ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థి బ్లాక్‌ బోర్డ్‌ వైపు చూస్తూ మగతగా నిద్రలోకి జారుకున్నాడు. ఉపాధ్యాయులు పలుమార్లు గుర్తించారు. ఇలాగే మరికొందరిని గుర్తించారు. వీరి కదలికలపై నిఘా వేశారు. విశ్రాంత సమయంలో పాఠశాల ప్రహరీ అవతల వీళ్లంతా చేరి.. గంజాయి పీలుస్తున్నట్టు గుర్తించారు. వీరి బ్యాగులు చూడగా ఇద్దరి వద్ద చిన్న గంజాయి పొట్లాలు దొరికాయి. విజయవాడ శివారులో ఓ కార్పొరేట్‌ పాఠశాల ప్రహరీ పైనుంచి చిన్న పొట్లాలు లోపల పడటాన్ని సిబ్బంది గుర్తించారు. ఇవి గంజాయి అని తేలినా విషయం దాచేసి.. పోలీసుల సహకారంతో చుట్టూ నిఘా పెట్టారు.

కళాశాలల్లో..

విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కొన్నాళ్ల కిందట గంజాయి తరలిస్తున్న, విక్రయిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లంతా ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్యార్థులని తేలింది. గంజాయిని చిన్న ప్యాకెట్లలో తోటి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు తేలింది. కొందరు విద్యార్థులనే విక్రయదారులుగా మార్చి.. గంజాయి అలవాటు చేస్తున్న విషయం బట్టబయలైంది.

యువత పార్టీల్లో

విజయవాడలో ఓ యువకుడు గంజాయి తాగి బైక్‌పై వెళుతూ ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయమవగా ఆసుపత్రికి తరలించారు. అతని ఫోన్‌ నంబర్ల ఆధారంగా స్నేహితుల గురించి పోలీసులు విచారిస్తే.. చాలామందికి గంజాయి అలవాటుందని గుర్తించారు. వారిని విచారణకు పిలుద్దామంటే.. అందరూ నగరంలో ‘పెద్దల’ పిల్లలే. కేసు కూడా పెట్టలేదు. ఇలాగే కొండపల్లిలో కొందరు యువకులు పుట్టినరోజు వేడుకల్లో గంజాయి పీలుస్తూ దొరికారు. మైలవరంలోనూ ఇద్దరు యువకులు పుట్టినరోజు వేడుకలకు గంజాయి తెస్తూ దొరికారు.’

అధికార పార్టీ అండదండలు పుష్కలం

విజయవాడ, మచిలీపట్నం నగరాలు సహా పట్టణాల్లో రైల్వేస్టేషన్‌, బస్టేషన్‌, నగర శివార్లలో గంజాయి దొరకని చోటే లేదు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీటర్లకు గంజాయి ప్రధాన ఆదాయ వనరు. వీరికి వైకాపా అండ పుష్కలం. కొందరు రౌడీషీటర్లు గంజాయి బ్యాచ్‌ నడుపుతున్నారు. కొన్ని మురికివాడలూ గంజాయి విక్రయ కేంద్రాలే. ఏజెన్సీ నుంచి గంజాయి అక్రమంగా టన్నుల్లో విజయవాడ చేరుతోంది. విజయవాడ పశ్చిమలో ఓ వైకాపా మహిళా నేత భర్తపై రౌడీషీట్‌ ఉంది. మరో నాయకురాలి భర్తపై సస్పెక్ట్‌ షీట్‌ ఉంది. వీళ్లు గంజాయి విక్రయాల్లో కీలకం.

నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న 510 గ్రాముల ద్రవరూప గంజాయి (పాతచిత్రం)

తల్లిదండ్రుల క్షోభ

విజయవాడలో గంజాయి కేసులో దొరికిన పిల్లల.. తల్లిదండ్రులను పిలిపించి పోలీసులు విషయం చెప్పగానే.. వాళ్లంతా తల్లడిల్లారు. తమ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసి.. భయంతో వణికిపోయారు. వారి భవిత ఏమవుతుందోనని ఏడ్చారు. కేసులు నమోదు చేయొద్దని వేడుకున్నారు. వీరంతా సామాన్య కుటుంబాల పిల్లలే.’

మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నా..

‘ఇంటర్‌ చదివే మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకుంటున్నా. ప్రస్తుతం ఎటు చూసినా గంజాయే. ఉద్యోగం నిమిత్తం పక్క జిల్లా నుంచి వచ్చా. ప్రశాంతతకు పేరైన మా పల్లెలోనూ నేడు కుర్రాళ్ల చేతిలో గంజాయి ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఎటుపోతోందో అర్థం కావడం లేదని’ విజయవాడలో ఓ పోలీస్‌ అధికారి వాపోయారు. ‘విద్యా సంస్థలను గంజాయి మత్తు తాకింది. పిల్లల పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. బానిసలైపోతున్నారని’ హెచ్చరించారు. ఓ పోలీసు అధికారే ఇలా అన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

ఫిర్యాదు చేస్తే దాడులు..

చాలా కళాశాలల్లో గంజాయి అమ్మే వారి వివరాలు విద్యార్థులకు తెలిసినా.. వాళ్లు ధైర్యంగా ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడులు చేసి వేధిస్తున్నారు. మూడేళ్లలోనే విజయవాడ పాతప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో వ్యసన విముక్తి కేంద్రానికి 1401 మంది గంజాయి మత్తుకు బానిసలైన వారిని చికిత్స కోసం తీసుకొచ్చారంటే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ పరిధిలో ఐదేళ్లలోనే.. 8.7 టన్నుల గంజాయి పట్టుకున్నారు. ప్రస్తుతం ద్రవరూప గంజాయిని విజయవాడకు తెస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని