logo

‘ఆర్వోబీ నిర్మాణంలో పాలకులు విఫలం’

వాంబేకాలనీ, దేవీనగర్‌ మధ్య ఆర్వోబీ నిర్మాణంలో పాలకులు విఫలమయ్యారని సెంట్రల్‌ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌.బాబూరావు విమర్శించారు.

Published : 16 Apr 2024 05:25 IST

వాంబేకాలనీ-దేవీనగర్‌ రైల్వేట్రాక్‌ వద్ద సీపీఎం నాయకుల నిరసన

మధురానగర్‌, న్యూస్‌టుడే : వాంబేకాలనీ, దేవీనగర్‌ మధ్య ఆర్వోబీ నిర్మాణంలో పాలకులు విఫలమయ్యారని సెంట్రల్‌ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్‌.బాబూరావు విమర్శించారు. సోమవారం ఆర్వోబీ నిర్మాణం జరిగే ప్రాంతం వద్ద సీపీఎం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో మోదీ, జగన్‌ ప్రభుత్వాలు ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా, తెదేపాల దూషణలతో సెంట్రల్‌ నియోజకవర్గంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలపై విద్యుత్తు భారాలు మోపి.. అదానీకి దోచి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపన్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాల చేతిలో విద్యుత్తు నియంత్రణ మండలి పావుగా మారిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఒప్పందానికి అనుమతులు తగవని స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం సేకరించకుండా ఏకపక్ష ఒప్పందం తగదని, ఈ అంశం హైకోర్టులో ఉండగా హడావుడిగా అనుమతులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మోదీ, జగన్‌ కుమ్మక్కుకు ఇది నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే ఈ విద్యుత్తు దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందం రద్దుకు ప్రజలు ఉద్యమించాలని, కమ్యూనిస్టులు సాగించే పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కె.శ్రీదేవి, కె.దుర్గారావు, రమణారావు, పీరూ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని