logo

హామీ ఇచ్చారు.. నిర్మాణం మరిచారు

అవనిగడ్డ మండలంలోని లంక గ్రామమైన పాత ఎడ్లంకకు రాకపోకలు సాగించేందుకు వీలుగా కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మరుగున పడింది.

Published : 17 Apr 2024 04:41 IST

పాత ఎడ్లంకకు వంతెన లేక అవస్థలు
నెరవేరని సీఎం, ఎమ్మెల్యేల హామీ
న్యూస్‌టుడే, అవనిగడ్డ గ్రామీణం

వరద నీటిలో పడవపై వెళ్తున్న గ్రామస్థులు (పాత చిత్రం)

వనిగడ్డ మండలంలోని లంక గ్రామమైన పాత ఎడ్లంకకు రాకపోకలు సాగించేందుకు వీలుగా కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీ మరుగున పడింది. 2022,  అక్టోబరు 20న సీఎం జగన్‌ అవనిగడ్డ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు పాత ఎడ్లంకకు వంతెన నిర్మాణం అవశ్యకతను వివరించారు. దీంతో రూ.8 కోట్లు మంజూరు చేస్తూ సీఎం ప్రకటన చేశారు. అదే నెల 22న పాత ఎడ్లంక ఎంపీటీసీ సభ్యురాలు జెరూసా రాణి ఆధ్వర్యంలో కొందరు గ్రామస్థులు, వైకాపా అభిమానులు తమ చిరకాల స్వప్నం నెరవేరబోతోందని పాత ఎడ్లంక నుంచి అవనిగడ్డలోని వైకాపా కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసి వంతెన వచ్చేస్తోందనే భ్రమలో బతుకులీడుస్తున్నారు. కానీ ఇంతవరకూ సీఎం ప్రకటన ఆచరణకు నోచుకోకపోవడంతో గ్రామస్థుల్లో మళ్లీ కలవరం మొదలైంది. హామీ ఇచ్చి 18 నెలలు గడిచినా నెరవేర్చలేదు. సంబంధిత అధికారులు వంతెన నిర్మాణానికి సంబంధించిన పనులు ఏ ఒక్కటీ చేపట్టలేదు. కనీసం మట్టి నమూనా పరీక్షలు కూడా చేయకపోవడంపై లంక గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవనిగడ్డ రావాల్సిందే...

ఈ గ్రామం చుట్టూ కృష్ణానది ప్రవహిస్తూ ఉంటోంది. పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉండే ఆ పల్లెకు రాకపోకలు సాగించడం కష్టసాధ్యమవుతోంది. కృష్ణమ్మ వరదలకు పాత ఎడ్లంకకు వెళ్లే ప్రధాన ఏకైక మార్గం కాజ్‌వే మూడేళ్ల కిందట కొట్టుకుపోయింది. నాటి నుంచి వారికి రాకపోకలు ప్రధాన సమస్యగా మారింది. వరదొస్తే గ్రామస్థులకు అధికారులు అవనిగడ్డలో పునరావాసం కల్పించడం.. తర్వాత తిరిగి పంపడం పరిపాటిగా మారింది. ఇక్కడ నివాసం ఉంటున్నవారంతా రెక్కాడితేగాని డొక్కాడని శ్రమ జీవులే. పొట్ట పోషణ కోసం నిత్యం అవనిగడ్డకు రావాల్సిందే. రహదారి సౌకర్యం లేక, వంతెన నిర్మాణానికి నోచుకోకపోవడంతో పాలకుల వైఖరిపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరదల సమయంలో నాటు పడవలపై ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు.

పంచాయతీ పేరు : పాత ఎడ్లంక
శివారు గ్రామాలు : తూర్పు పల్లెపాలెం, ఎస్సీకాలనీ
కుటుంబాలు : 250  ఓటర్లు : 450


మా కష్టాలు తీరలేదు
- దోవా ఏసు, పాత ఎడ్లంక

ముఖ్యమంత్రి స్వయం గా హామీ ఇచ్చారు. వంతె న నిర్మాణానికి రూ.8 కోట్లు ఇస్తున్నట్లు అవనిగడ్డ బహిరంగ సభా ముఖంగా ప్రకటించారు. దీంతో మా కష్టాలు తీరుతాయని అనుకున్నాం. ఇచ్చిన హామీ ఆయనే నిలబెట్టుకోలేకపోయారు. మా కష్టాలు ఎప్పుడు తీరుతాయో అర్ధం కావడం లేదు.


ఇంతవరకు అతీగతీ లేదు
- పి.రజిని, పాత ఎడ్లంక

మా గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామని చెప్పారు. ఆశగా ఎదురు చూసాం. ఇంతవరకు అతీగతీ లేదు. వరద వస్తే పడవలే మాకు దిక్కు. మళ్లీ ఓట్లు వచ్చేశాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని