logo

జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజం

సివిల్‌ సర్వీస్‌లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు.

Published : 25 Apr 2024 05:42 IST

విజయవాడకు వన్నె తెచ్చిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి

కానూరు, విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: సివిల్‌ సర్వీస్‌లో ఎంపికవడమే కాదు.. అక్కడ ఇచ్చిన శిక్షణలో కూడా రాణించి బంగారు పతకాలు అందుకున్నారు. తన ప్రతిభతో వృత్తిపరమైన శిక్షణ కోర్సులో ఏడు పతకాలు సాధించి జాతీయ స్థాయిలో తెలుగువారి సత్తా చాటారు విజయవాడకు చెందిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి అబ్దుల్‌ రవూఫ్‌ నగరానికి చెందిన అబ్దుల్‌రవూఫ్‌ షేక్‌ చిన్ననాటి నుంచి చదువులో దిట్ట. ఆయన తండ్రి మహమ్మద్‌ ఇక్బాల్‌ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్‌ కాగా.. తల్లి డాక్టర్‌ గౌసియాభేగం అగ్రికల్చర్‌ విభాగంలో జేడీగా పనిచేస్తున్నారు. అబ్దుల్‌ రవూఫ్‌ నగరంలోని ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్‌ స్కూల్‌లో సీబీఎస్‌ఈలో 10వ తరగతిలో టాపర్‌గా నిలిచారు. అనంతరం నారాయణలో ఇంటర్‌ పూర్తిచేసి, ఐఐటీ ముంబయిలో సివిల్‌ విభాగంలో సీటు సాధించారు. యూఎస్‌లో ఎంఎస్‌ పూర్తి చేశారు. చదువు పూర్తి చేసిన అనంతరం నాబార్డులో మేనేజర్‌గా రెండేళ్లు విధులు నిర్వహించారు. అనంతరం సివిల్స్‌పై దృష్టి సారించారు. శిక్షణ తీసుకోగా.. మూడో ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌(ఇండియన్‌ ఫారెస్టు సర్వీసులో) ఆల్‌ ఇండియా స్థాయిలో 30వ ర్యాంకు సాధించారు.

శిక్షణలోనూ ప్రతిభ : 2022-24 వరకు రెండేళ్లు డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్టు అకాడమీ ద్వారా శిక్షణ తీసుకున్నారు. ఆ కాలంలోనూ అత్యంత ప్రతిభ కనబర్చారు. శిక్షణ పూర్తయి ఇండియన్‌ ఫారెస్టు సర్వీస్‌ ఆఫీసర్సు-2022 బ్యాచ్‌ కాన్వోకేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. వృత్తిపరమైన శిక్షణ కోర్సులో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు ఏడు విభాగాల్లో టాపర్‌గా నిలిచి బంగారు పతకాలు అందుకున్నారు. బుధవారం డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి, ప్రజలకు తాను చక్కని సేవలందించడమే లక్ష్యమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని