icon icon icon
icon icon icon

Congress: డబ్బుల్లేవ్‌.. పోటీ చేయను: టికెట్‌ వెనక్కి ఇచ్చిన కాంగ్రెస్‌ నాయకురాలు

Congress: కాంగ్రెస్‌కు మరో షాక్‌ తగిలింది. పార్టీ నిధులు ఇవ్వడం లేదని, తన వద్ద డబ్బుల్లేవని ఒడిశాలో ఓ అభ్యర్థి పోటీకి నిరాకరించారు. తన టికెట్‌ వెనక్కి ఇచ్చేశారు.

Published : 04 May 2024 12:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల వేళ అభ్యర్థుల నుంచి కాంగ్రెస్‌ (Congress)కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే సూరత్‌, ఇందౌర్‌లో ఆ పార్టీకి షాక్‌ తగలగా తాజాగా ఒడిశా (Odisha)లోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యేలా కన్పిస్తోంది. పూరీ (Puri) లోక్‌సభ అభ్యర్థి సుచరిత మొహంతీ (Sucharita Mohanty) తన టికెట్‌ను వెనక్కి ఇచ్చేశారు. ప్రచారం కోసం పార్టీ నుంచి తనకు నిధులు అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. సొంతంగా ఖర్చులను భరించే స్తోమత తనకు లేకపోవడంతో, పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు.

‘‘పార్టీ నిధులు ఇవ్వకపోవడంతో పూరీలో మా ప్రచారానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇదే విషయం ఏఐసీసీ ఒడిశా ఇన్‌ఛార్జ్‌కి చెబితే.. నన్నే డబ్బులు పెట్టుకోమని చెప్పారు. నేను వేతనం మీద ఆధారపడే జర్నలిస్టును. 10ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. ప్రచారం కోసం నా దగ్గర ఉన్నదంతా పెట్టా. క్రౌడ్‌ ఫండింగ్‌తో ప్రజల నుంచి విరాళాలు కోరినా పెద్దగా ఫలితం కన్పించలేదు. ఇక నా దగ్గర ఏమీ మిగల్లేదు. పార్టీ నుంచి నిధులు రాకపోతే నేను ప్రచారం చేయలేని పరిస్థితి. అందుకే నా టికెట్‌ను వెనక్కి ఇచ్చేస్తున్నా’’ అని సుచరిత తన లేఖలో పేర్కొన్నారు. కేవలం నిధుల కొరత కారణంగానే పూరీలో పోటీ నుంచి వైదొలగినట్టు తెలిపారు.

10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్‌ హడావుడి

పూరీ లోక్‌సభ స్థానానికి ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్ల సమర్పణకు మే 6 ఆఖరు తేదీ. సుచరిత ఇప్పటివరకు నామినేషన్‌ దాఖలు చేయలేదు. నామినేషన్ల గడువు మరో రెండు రోజుల్లో ముగియనున్న వేళ ఆమె టికెట్‌ వెనక్కి ఇవ్వడంతో పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. మరోవైపు ఈ స్థానం నుంచి ఇప్పటికే భాజపా తరఫున సాంబిత్‌ పాత్రా, బిజు జనతా దళ్‌ అభ్యర్థి అరూప్‌ పట్నాయక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

కాగా.. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించడంతో అక్కడ భాజపా అభ్యర్థి గెలుపు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. అటు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్‌ ఉపసంహరించుకుని భాజపాలో చేరారు. దీంతో అక్కడ హస్తం పోటీలో లేకుండా పోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img