logo

దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని

అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు.

Published : 05 May 2024 02:52 IST

అవనిగడ్డ: అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. మానవ జాతి వికాసంలో నదీ తీరాలు ప్రత్యేక పాత్ర పోషించాయన్నారు. మహాబలేశ్వరంలో పుట్టిన కృష్ణా నది కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద సాగరంలో కలుస్తుందని చెప్పారు. దివిసీమ తెలుగు జాతి చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుందని, ఆంధ్రుల ప్రథమ రాజధాని ఘంటసాల మండలం శ్రీకాకుళం అని, ఆముక్తమాల్యద రచనకు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకారం చుట్టింది ఇక్కడేనని చెప్పారు. కూచిపూడి నాట్యం ఇక్కడే ఆవిర్భవించిందన్నారు. నృత్య రత్నావళి రచించిన జాయపసేనాని దివిసీమ తొలి పాలకుడని చెప్పారు. తెలుగు బాషా వికాసానికి, సాహిత్య వైభవానికి, సాంస్కృతికి పునర్జీవానికి, జాతీయ భావ వ్యాప్తికి దివిప్రాంతం వైతాళిక గీతాలు పాడి తెలుగు జాతిని మేల్కొలిపిందని చెప్పారు. పింగళి వెంకయ్య, తోట నరసయ్యనాయుడు, దివిసీమవారేనని చెప్పారు. కృష్ణా పత్రిక ద్వారా జాతీయ భావ వ్యాప్తి చేసిన ముట్నూరి కృష్ణారావు దివిసీమవారని గుర్తు చేశారు. చెరుకువాడ నరసింహం, గొట్టిపాటి బ్రహ్మయ్య, చండ్ర రాజేశ్వరరావు, మండలి వెంకటకృష్ణారావు వంటి స్వతంత్ర సమరయోధులకు జన్మనిచ్చిన సీమ దివిసీమ అని కొనియాడారు. సుసర్ల దక్షిణామూర్తి, వేటూరి సుందరరామమూర్తి, ప్రభాకరశాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య వంటి ప్రముఖులు జన్మించింది ఈ గడ్డపైనే అన్నారు. గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి మండలి బుద్ధ ప్రసాద్‌, వల్లభనేని బాలశౌరీలకు గెలిపించాలని కోరారు. బాలశౌరి, బుద్ధప్రసాద్‌, కొనకళ్ల నారాయణరావు, మండలి రాజేష్‌  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని