logo

సూపర్‌-6లో సంక్షేమం కొత్త పుంతలు

ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా.

Published : 05 May 2024 03:19 IST

డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణం
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌
బడికి వెళ్లే విద్యార్థికి రూ.15 వేలు
ప్రతి రైతుకు రూ. 20వేలు
అర్హులైన మహిళలకు నెలకు రూ.1500
‘ న్యూస్‌టుడే’తో మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర

ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర వెల్లడించారు. సూపర్‌-6 పథకాల ద్వారా నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలను కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు. మచిలీపట్నానికి గతానికి మించిన వైభవం తీసుకురావాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని అంటున్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టే సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలను  ఆయన ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..

మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే


ప్రతి ఇంటికీ ఉచితంగా 3 సిలిండర్లు

  • అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్య తరగతి వర్గాల జీవన స్థితిగతులు దెబ్బతిన్నాయి. మార్కెటింగ్‌ శాఖ ద్వారా ధరలను నియంత్రిచేలా చర్యలు చేపడతాం.
  • గతంలో రాజుపేటలో అదనంగా ఏర్పాటు చేసిన రైతుబజారు నిర్వహణ గాలికొదిలేశారు. దాన్ని పునరుద్ధరిస్తాం.
  • ఏటా ఉచితంగా ప్రతి ఇంటికీ మూడు గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం. నియోజకవర్గంలో సుమారు 25 వేల కుటుంబాలకు ఇవి అందుతాయి.
  • చౌక ధరల దుకాణాల ద్వారా కేవలం బియ్యమే కాకుండా సబ్సిడీ ధరపై ఇతర నిత్యావసరాలు పంపిణీ చేయిస్తాం. విద్యుత్తు ధరల పెంపు ఉండదు. నగర వాసులకు అదనపు భారంగా ఉన్న చెత్తపన్నును తొలగిస్తాం. మొత్తం మీద నియోజకవర్గ పరిధిలో పేద, మధ్య తరగతికి చెందిన దాదాపు 45 వేల కుటుంబాలకు ఆర్థికభారం నుంచి వెసులుబాటు కల్పిస్తాం.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  •  పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారిత కోసం కృషి చేసిన ఏకైక పార్టీ తెదేపానే. కూటమి మ్యానిఫెస్టో ప్రకారం నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 అందజేస్తాం. ¨
  • ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రూ.10 లక్షలు రుణంగా సమకూరుస్తాం. ఈ పథకాల ద్వారా నగరంతో పాటు మండల పరిధిలోని దాదాపు లక్ష మంది మహిళలకు ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. ¨
  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలూ ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలిగిస్తాయి.విద్యార్థినుల చదువులకు అవసరమైన రుణాలు ఇప్పిస్తాం.

యువతకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి

  • నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి యువకుడికి నెలకు రూ.3వేలు నిరుద్యోగభృతి కల్పిస్తాం.
  • సింగిల్‌ విండో ద్వారా అనుమతులు జారీ చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తాం. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
  • నియోజకవర్గంలో కలంకారీ, చేనేత, రోల్డ్‌గోల్డ్‌, ఆక్వా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అన్ని వసతులు ఉన్నాయి. వాటిని ఏర్పాటు చేసి సుమారు 20 వేలమంది వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించవచ్చు. 
  • సాల్ట్‌ పరిశ్రమను పునరుద్ధరించేలా చేయడంతో పాటు రోల్డ్‌గోల్ట్‌ పరిశ్రమను మరింత వృద్ధి చేసి ఉపాధి అవకాశాలు చేరువ చేస్తాం.

పింఛను నెలకు రూ.4 వేలు .. ఏప్రిల్‌ నుంచి వర్తింపు

  • ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎటువంటి షరతులు లేకుండా సామాజిక పింఛన్లు వర్తింపచేస్తాం. అర్హత ఉండి పింఛను పొందలేకపోతున్న వారికి పార్టీ పరంగా నగదు సాయం అందజేస్తున్నాం.
  • అధికారం చేపట్టిన నెల నుంచే ఎటువంటి కుంటిసాకులు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నెలకు రూ.4,000 చొప్పున పింఛను ఇంటికే అందజేస్తాం.
  • 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ ఎస్టీలకు పింఛను ఇవ్వడంతో పాటు కుటుంబంలో అర్హులుంటే రెండో పింఛను కూడా మంజూరు చేస్తాం. ఫలితంగా నియోజకవర్గ పరిధిలో అదనంగా మరో 50 వేల మంది వరకు ఫించను ప్రయోజనం కల్పించే అవకాశం ఉంది.

పోర్టుకు పూర్వ వైభవం తీసుకువస్తాం

  • రాష్ట్రానికే ఎంతో ప్రయోజనకరంగా ఉండే మచిలీపట్నం పోర్టు విషయంలో నాకు పూర్తి స్పష్టత  ఉంది. అందుకు తగ్గ విధంగా బందరు పోర్టుకు పూర్వ వైభవం తీసుకువస్తాం.
  • దేశంలోనే మిగిలిన పోర్టుల కన్నా మిన్నగా ఉండేలా తీర్చిదిద్దుతాం. ఇందుకు అవసరమైన పరిపూర్ణమైన హంగులు కల్పిచడంతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌

  • నియోజకవర్గంలో ఉన్న మైనార్టీల్లో ఎక్కువ శాతం మంది పేదరికంలోనే ఉన్నారు. వారు మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా అందాల్సిన సబ్సిడీ రుణాలతో పాటు దుల్హాన్‌, రంజాన్‌తోఫా వంటి ప్రయోజనాలకు దూరమయ్యారు. వాటిని పునరుద్ధరించడంతో పాటు మైనార్టీ హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటా.  
  • మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5 లక్షల వరకూ వడ్డీ లేని రుణం అందజేయడం, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు ద్వారా పలువురికి ప్రయోజనం చేకూరుస్తాం. 
  •   ప్రతి నెలా ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు రూ.5వేల గౌరవ వేతనం అందజేస్తాం.
  • నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి మసీదు నిర్వహణకు నెలకు రూ.5000 చెల్లించడంతో పాటు రాజుపేట ఇతర ప్రాంతాల్లో ఉన్న ఖబర్‌స్థాన్‌ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తాం. హజ్‌యాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు రూ.లక్ష అందజేస్తాం.

భూహక్కు చట్టాన్ని రద్దు చేస్తాం

  • ల్యాండ్‌ టైటిలింగ్‌ అనే చీకటి చట్టాన్ని మేం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తాం. ఈ విషయాన్ని మా అధినేత చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు కూడా ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందవద్దు.
  • పట్టిసీమను సద్వినియోగం చేసుకోవడం ద్వారా సాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. అన్ని కాల్వలు, డ్రెయిన్లకు యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తాం.
  • రైతులకు సాగు పట్ల తగు భరోసా కల్పించేందుకు ఏటా రైతులకు రూ. 20 వేలు అందజేస్తాం. నియోజకవర్గంలో సుమారు 7వేలమంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.
  • దయనీయ స్ధితిలో ఉన్న రామరాజుపాలెం ఛానల్‌, ఏడో నెంబరు కాల్వ, శివగంగ, తాళ్లపాలెం డ్రెయిన్లను బాగు చేయిస్తాం.తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తాం.

మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థికసాయం

  • తెదేపా ప్రభుత్వ హయాంలో సబ్సిడీ రుణాల ద్వారా యూనిట్లు మంజూరు చేయించడం ద్వారా వేలాది మందికి మెరుగైన జీవనోపాధి కల్పించాం. అరకొరగా ఇచ్చే వేట నిషేధ పరిహారం మినహా మత్సకారులకు ఏఒక్క ప్రయోజనం దక్కడం లేదు.
  • ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని కార్పొరేషన్లకు జవసత్వాలు కల్పించి నిరుద్యోగ యువత, చేతివృత్తుల వారికి అండగా నిలుస్తాం.
  • వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.20వేలకు పెంచడం, ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల ఆర్థిక సాయం అందచేస్తాం. దీని ద్వారా ద్వారా నియోజకవర్గంలో సుమారు 25 వేల మందికి ప్రయోజనం చేకూరుతుంది.

తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

  • నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో ప్రత్యేక చొరవ తీసుకుని నగరంలో తొమ్మిది రిజర్వాయర్లకు నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాం. అయినా ప్రస్తుతం మూడు రోజులకు ఒకసారి నీరు ఇచ్చే దుస్థితి నెలకొని ఉంది. 
  • తాగునీరు, మురుగు సమస్య పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి అవగాహన ఉంది. అందుకు తగినవిధంగా నగరానికి ఉత్తర, దక్షిణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతంలో కొత్తగా 100 ఎకరాల విస్తీర్ణంతో కూడిన స్టోరేజి ట్యాంకులు ఏర్పాటు చేస్తాం.
  • చిన్నాపురంలో స్టోరేజి ట్యాంకు కోసం గతంలో 30 ఎకరాలు సమీకరించాం. మిగిలిన భూములు తీసుకుని వెంటనే పనులు చేపడతాం. మురుగు సమస్యకు కూడా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటాం.

ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు

  • ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు అందిస్తాం. వారి ప్రయోజనాలు, వారి ఆత్మగౌరవం కాపాడేందుకు  మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. రూ.వేల కోట్లలో పేరుకుపోయిన వారి బకాయిల విషయంలో సత్వరం న్యాయం దక్కేలా నావంతు కృషి చేస్తా. ‌
  • మెరుగైన పీఆర్సీ అమలు చేయడంతో పాటు ఒకటో తేదీనే పింఛన్లు అందజేస్తాం. తక్కువ జీతాలు పొందే ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్‌ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తాం.
  • ప్రధానంగా పింఛనుదారుల సమస్యలు పరిష్కరించేందుకు పింఛనర్ల కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో కూడా ప్రకటించాం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని