logo

తెదేపా కార్యకర్తలపై రెచ్చిపోయిన వైకాపా మూకలు

ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 06 May 2024 04:27 IST

ప్రచారానికి అడ్డొస్తావా అని బీసీ యువకుడిపై దాడి

కూచిపూడి, న్యూస్‌టుడే: ప్రశాతంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న తెదేపా కార్యకర్తలపై వైకాపా నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తెదేపా, జనసేన, భాజాపా నాయకులు, కార్యకర్తలు కోసూరులో మూడు రోజులుగా ఇంటింటికీ తిరుగుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా వర్ల కుమర్‌రాజాను సైకిల్‌ గుర్తుపై, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరికి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఆదివారం రాత్రి శాసనసభ్యుడు, వైకాపా అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌ అదే గ్రామంలో ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు ఎదురెదురుగా రావడంతో వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఉభయ వర్గాల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఒక బీసీ యువకుడు ప్రచారం తిలకిస్తున్నాడు. మా ప్రచారానికి ఎదురుగా వస్తావా అంటూ వైకాపా మూకలు జెండా కర్రతో దాడి చేయడంతోపాటు చెంపపై కొట్టారు. తెదేపా కార్యకర్తలు ప్రతిఘటించటంతో వైకాపా శ్రేణులు వెళ్లిపోయారు. వైకాపా, తెదేపా నాయకుల ప్రచారాలు ఎదురు పడకుండా, గొడవలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. అలాంటి చర్యలు తీసుకోవడంలో విఫలమైన కూచిపూడి పోలీసులపై పలువురు విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని