logo

వివరాలు రాలేదని ఓటు వేయనీయలేదు

పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగంలో తలెత్తిన సమస్యలతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మచిలీపట్నంలోని చిలకలపూడి మున్సిపల్‌ పాండురంగ ఉన్నతపాఠశాలలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు.

Published : 07 May 2024 05:43 IST

మచిలీపట్నం(గొడుగుపేట),న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వినియోగంలో తలెత్తిన సమస్యలతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మచిలీపట్నంలోని చిలకలపూడి మున్సిపల్‌ పాండురంగ ఉన్నతపాఠశాలలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఎంతో ఆశతో ఓటు వేసేందుకు వచ్చిన వారిలో కొంతమంది ఉద్యోగుల వివరాలు రాలేదన్న కారణంతో ఓటుహక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేదని అధికారులు అన్నారు. దీంతో వారంతా అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాల వద్ద వివరాలు ఇచ్చామని చెప్పినా, తమకు వచ్చిన పత్రంలో వివరాలు లేకుంటే అవకాశం ఇవ్వలేమని వారు సమాధానమిచ్చారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు ఉన్నవారు అధికారులనుంచి సరైన సమాచారం లేక ఈనెల 4వ తేదీన కూడా చాలామంది వచ్చి వెనుదిరిగి వెళ్లారు. మళ్లీ ఈ సమస్య తలెత్తడంతో పలువురు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో రెండు రోజులు అవకాశం: కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ డీకె బాలాజీ కేంద్రాన్ని సందర్శించి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా వివిధ కారణాలతో ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకోలేని వారికోసం ఎన్నికల సంఘం మరో రెండు రోజులు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.అలాంటి వారు ఈనెల 7,8 తేదీల్లో ఆ ప్రాంత ఆర్వో కార్యాలయానికి వెళ్లి అక్కడే ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు. పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సాధారణ సెలవు కూడా మంజూరు చేసిందన్నారు.ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు హెల్ప్‌డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.చంద్రశేఖరరావు, పోస్టల్‌ బ్యాలట్‌ నోడల్‌ అధికారి షాహిద్‌బాబు, నగరపాలక సంస్థ కమిషనర్‌ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని