logo

బందరు సాక్షిగా జగన్‌ అబద్ధాలు

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బందరు వచ్చిన సీఎం జగన్‌... సభ సాక్షిగా అభివృద్ధి, సంక్షేమాలపై మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా ఈసీ నిష్పక్షపాత చర్యలను సైతం ప్రతిపక్ష నేత చంద్రబాబుపైకి నెట్టేస్తూ తన కుట్రలను కప్పిపుచ్చుకున్నారు.

Updated : 07 May 2024 08:33 IST

కోనేరుసెంటరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బందరు వచ్చిన సీఎం జగన్‌... సభ సాక్షిగా అభివృద్ధి, సంక్షేమాలపై మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా ఈసీ నిష్పక్షపాత చర్యలను సైతం ప్రతిపక్ష నేత చంద్రబాబుపైకి నెట్టేస్తూ తన కుట్రలను కప్పిపుచ్చుకున్నారు. రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన జగన్‌ ఉపన్యాసం పేలవంగా సాగింది. దాదాపు అరగంట ప్రసంగించిన ఆయన ప్రతి ఒక్కరినీ కలవరపర్చేలా చేస్తున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను సమర్థించుకునేందుకే ఎక్కువ సమయం కేటాయించారు.  కొందరు జగన్‌ రాకకు ముందే వెళ్లిపోగా మరికొందరు సీఎం మాట్లాడే వేళ వెనుదిరిగారు.

అంతా తానే చేశారట...

చర్రితలో ఎవరూ చేయలేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత తనదే అని చెప్పుకొన్న జగన్‌ బందరు అభివృద్ధిని ప్రస్తావిస్తూ పోర్టు, హార్బర్‌, వైద్యకళాశాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేశారు.  బందరు పోర్టుతో పాటు గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌కు ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అవసరమైన అడుగులు పడుతూనే ఉన్నాయి. జగన్‌ అధికారం చేపట్టే నాటికే నవయుగ సంస్థ పోర్టు పనులు ప్రారంభించగా, హార్బర్‌కు నిధులు మంజూరయ్యాయి. తమ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోర్టు పనులను వేగంగా పూర్తిచేసి మళ్లీ ఎన్నికల లోపు ఓడను తీసుకువస్తామని హామీ ఇచ్చిన జగన్‌ రమారమి ఏడాది కిందట వరకూ పోర్టు పనుల వైపు కన్నెత్తి చూడలేదు. 2023 మేలో సీఎం స్వహస్తాలతో పోర్టు పనులకు శ్రీకారం చుట్టినా ఇప్పటి వరకూ పురోగతి లేదు. ఇదే తీరున పనులు కొనసాగితే పోర్టు రెండు దశల పనులు పూర్తికావాలంటే మరో ఐదేళ్లూ చాలదు. ఏనాటి నుంచో ప్రతిపాదనల దశలో ఉన్న వైద్య కళాశాల, హార్బర్‌లకు రెండేళ్ల కిందట కేంద్రం అనుమతులు ఇచ్చింది. వీటికి కేంద్రం సమకూర్చాల్సిన 50 శాతం నిధుల విడుదల కూడా ఎంపీ బాలశౌరి చొరవతో దరి చేరగా పనులు ప్రారంభించారు. వైద్య కళాశాలకు భూముల కొనుగోలు విషయంలో రూ.6 కోట్ల అవినీతి జరిగిందన్న కాగ్‌ నివేదిక నేపథ్యంలో ఎట్టకేలకు పనులు చేపట్టారు. వైద్య విద్యార్థుల తొలి ఏడాది తరగతుల నిర్వహణకు అనువుగా పనులు పూర్తి చేసినా, ఇంకా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. హార్బర్‌ విషయంలోనూ ఏళ్లు గడిచినా  పురోగతి అంతంతే. వాస్తవం ఇలా ఉంటే రూ.వేల కోట్ల అంచనాలని పోర్టు, హార్బర్‌, వైద్యకళాశాల కేవలం తన వల్లే సాధ్యపడినట్లు జగన్‌ చెప్పుకొచ్చారు.

ప్రజలకు తప్పని అవస్థలు

మధ్యాహ్నం నుంచే రేవతి సెంటరు నుంచి కోనేరుసెంటరు వరకూ రెండు వరుసల రహదారిపై రాకపోకలను నిలిపివేశారు. అనుసంధాన దారులకు బారికేడ్లను అడ్డుగా పెట్టడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్రఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలను నియంత్రించారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలనూ మూయించి వేశారు. పోలీసుల అత్యుత్సాహంతో నాలుగు గంటల చుక్కలు చూపారు.

సొమ్మసిల్లిన మహిళలు..

నగరంలో ప్రతి డివిజన్‌, గ్రామాల నుంచి కార్పొరేటర్లు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లు ఆటోలుపెట్టి కొందరికి రూ.300 ఇచ్చి సభకు జనాలను తీసుకువచ్చారు. విపరీతమైన ఉక్కపోతతో పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. ఆరో వార్డు మహిళ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీస్‌ వాహనంలో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉక్కపోత తట్టుకోలేక సభకు ముందే కొందరు వెళ్లిపోయారు. జగన్‌ రాకముందు పేర్ని నాని, కిట్టూ ప్రసంగిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని