logo

బొండా ఉమాపై మైక్‌లో అసత్య ప్రచారం.. అజిత్‌సింగ్‌ నగర్‌లో ఉద్రిక్తత

ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న సెంట్రల్‌ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు.. ఎన్డీయే కూటమి సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుపై వ్యక్తిగత ఆరోపణలతో మైక్‌ ప్రచారం ప్రారంభించారు.

Updated : 08 May 2024 07:51 IST

అజిత్‌సింగ్‌నగర్‌ (మధురానగర్‌), న్యూస్‌టుడే : ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్న సెంట్రల్‌ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు.. ఎన్డీయే కూటమి సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుపై వ్యక్తిగత ఆరోపణలతో మైక్‌ ప్రచారం ప్రారంభించారు. అసత్య ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. వైకాపా ప్రచార వాహనాలను అజిత్‌సింగ్‌నగర్‌ పరిసరాల్లో తిప్పుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చేస్తున్న ప్రచారాన్ని మంగళవారం తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది.

కూటమి అభ్యర్థే లక్ష్యంగా...

ఎన్డీయే కూటమి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరావును లక్ష్యంగా చేసుకుని ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మంగళవారం ఉదయం నుంచి వైకాపా ప్రచార వాహనాలు మైక్‌లో ప్రచారం చేయడం ప్రారంభించాయి. అజిత్‌సింగ్‌నగర్‌ ఎంకే బేగ్‌ స్కూలు పరిసరాల్లో ఒక వాహనాన్ని స్థానిక నాయకులు అడ్డుకున్నారు. మరో వాహనాన్ని నూజివీడు రోడ్డులో సాయిబాబా గుడి వద్ద తెదేపా నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొంత మంది వ్యక్తులు ప్రచార వాహనంలో మైక్‌సెట్‌కు ఉన్న పెన్‌డ్రైవ్‌ తీసుకుని పరారయ్యారు. లాక్కుని వెళ్లింది ఎవరనేది వాహన డ్రైవర్‌ కూడా చెప్పలేకపోతున్నారు. ఈ ఘటనతో వైకాపా నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అజిత్‌సింగ్‌నగర్‌ సీఐ గురుప్రకాశ్‌ వచ్చి వైకాపా నాయకులతో మాట్లాడారు. వ్యాన్‌ డ్రైవర్‌తో మాట్లాడితే.. కారులో వచ్చిన వారెవరో పెన్‌డ్రైవ్‌ లాక్కుపోయారని చెబుతున్నారు. ఆ పెన్‌డ్రైవ్‌తో బొండా ఉమాను వ్యక్తిగతంగా దూషిస్తూ.. మైక్‌లో ప్రచారం చేస్తున్నారని, దానిపైనే తాము ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వాహనాన్ని నిలువరించామని తెదేపా నాయకులు చెబుతున్నారు. పెన్‌డ్రైవ్‌లో కంటెంట్‌ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. దాని వివరాలు తెలిస్తే.. చర్యలు తీసుకునేందుకు వీలుంటుందని చెబుతున్నారు. పెన్‌డ్రైవ్‌లో వివరాలు బయటకు తెలిస్తే తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్న భయంతో వైకాపా నాయకులు నాటకం ఆడుతున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.  

  • నూజివీడు రోడ్డులో తెదేపా నాయకులు గరిమెళ్ల చిన్న, దాసరి ఉదయశ్రీలు తనను అడ్డగించి, చేతులతో కొట్టి, డబ్బులు, పెన్‌డ్రైవ్‌ లాక్కున్నారంటూ వ్యాన్‌ డ్రైవర్‌ అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • ఎం.కె.బేగ్‌ పాఠశాల వద్ద సగ్గుర్తి రవీంద్రబాబు అనే ఆటోడ్రైవర్‌ బొండా సిద్ధార్థ, జాన్‌వలీ, గరిమెళ్ల చిన్న, నవనీతం సాంబశివరావు, బంగారునాయుడు, వేల్పుల రాజేష్‌, నెలటూరి ఇందిర మరికొంత మంది దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
  • ఎం.కె.బేగ్‌ పాఠశాల వద్ద గోగుల విజయ్‌, హఫీజుల్లా, అమిత్‌, రమేష్‌రెడ్డి మరికొందరు తనను చేతులతో కొట్టి, బెదిరించి కులం పేరుతో దూషించారంటూ వేల్పుల రాజేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు