logo

ప్రణాళికలు ఘనం.. అమలు అంతంతే

ప్రముఖ వ్యాపార, వాణిజ్య కూడలిగా ఎదిగిన విజయవాడ నగరం.. ఆ స్థాయిలో మౌలిక వసతులు లేవు. పెరుగుతున్న అవసరాలు, జనాభాకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలతో

Published : 28 Jan 2022 02:08 IST

నగరం ఎదుర్కొంటున్న సమస్యలు ఎన్నో

కొత్త కమిషనర్‌ ముందు సవాళ్లు

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ నగరపాలక సంస్థ

ప్రముఖ వ్యాపార, వాణిజ్య కూడలిగా ఎదిగిన విజయవాడ నగరం.. ఆ స్థాయిలో మౌలిక వసతులు లేవు. పెరుగుతున్న అవసరాలు, జనాభాకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలతో ముందుకు సాగితేనే నివాసయోగ్య నగరంగా మారుతుంది. నగర పాలక సంస్థ నూతన కమిషనర్‌గా రంజిత్‌ బాషా గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రాజెక్టులు, నిధుల సాధన, తదితర వాటిపై చొరవ చూపితేనే నగరం అభివృద్ధిలో ముందుంటుంది.
  నిధులు రాబట్టాలి
010 పద్దు అమలు ద్వారా జీతాలు చెల్లిస్తుండడంతో.. ఏడాదికి రూ. 120 కోట్ల వరకు కార్పొరేషన్‌కున మిగులు కనిపిస్తోంది. నగరపాలక సంస్థకు వాటాగా రావాల్సిన గ్రాంట్లు ఆశాజనకమైన రీతిన లేకపోవడంతో నగరంలో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోంది. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల కింద నగరానికి రూ. వంద కోట్లు రావాల్సి ఉంది. వీటి నుంచి ఇప్పటికే రూ. 20 కోట్ల మేరకు అభివృద్ధి పనులు చేపట్టారు. అయినా వాటికి సంబంధించి బిల్లులు విడుదల కాలేదు. దీంతో మిగిలిన పనులు చేపట్టేందుకు గుత్తేదార్లు ఆసక్తి చూపించడం లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.340 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. పనులు చేసిన గుత్తేదారులకు సుమారు రూ. 20 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రభావం 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులపై పడింది. ఫలితంగా రూ.120 కోట్లతో చేపట్టాల్సిన 55 పనులకు మూడుసార్లు టెండర్లు పిలవాల్సి వచ్చింది. అయినా 6 పనులకే స్పందన వచ్చింది.
  గతి తప్పిన పట్టణ ప్రణాళిక
నగరంలో అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొందరు ప్రజాప్రతిధులు వాటిని తమ ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని పట్టణ ప్రణాళికా అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. దీంతో నగరంలోని అక్రమ కట్టడాలను అడ్డుకోవడంలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల నుంచి స్పందన కొరవడింది. ఫలితంగా నగరపాలక సంస్థకు రావాల్సిన రూ.కోట్ల ఆదాయం అడుగంటిపోతోంది. దీంతో పాటు అపరాధ రుసుముల కింద రాబడికి కూడా గండిపడుతోంది. నగరంలో దాదాపు 1,856 అక్రమకట్టడాలు జరిగినట్లు గత  ఏడాది గుర్తించారు. ప్రస్తుతం వీటి సంఖ్య 2,500లకు పైగానే ఉన్నట్లు అంచనా.
  పీపీపీ ప్రాజెక్టులు అంతేనా?
* విజయవాడ నగరవాసులకు వినోదం కొరవడింది. చెప్పుకోదగ్గ పార్కులు కానీ ఆహ్లాదం పంచే ప్రదేశాలు లేవు. దీనిని భర్తీ చేసేందుకు వీఎంసీ వినోద పార్కుకు శ్రీకారం చుట్టింది. టెండర్లు పూర్తి అయ్యాయి. భవానీపురంలోని లారీ స్టాండులో వినోద పార్కును నిర్మించాలని తలపెట్టారు. పీపీపీ తరహాలో మొత్తం 3.5 ఎకరాలలో ‘అర్బన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అమ్యూజ్‌మెంట్‌ థీమ్‌ పార్కు’గా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందుకు గాను రూ. 10 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనికి ఇంకా ఆమోదం లభించలేదు.

* అవసరాలకు తగ్గట్లుగా నగరంలో ఆధునిక జంతు వధశాలను పీపీపీ విధానంలో నిర్మాణానికి వీఎంసీ ప్రతిపాదించింది. విద్యాధరపురంలో ప్రస్తుతం ఉన్న కబేళా నిర్వహణ కొరవడి శిథిలావస్థకు చేరింది.ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ కొత్తగా రూ. 40 కోట్లతో ప్రతిపాదించిన కబేళాను నగరానికి దూరంగా నిర్మించనున్నారు. ఇందుకు సింగ్‌నగర్‌ ప్రాంతంలోని డిస్నీల్యాండ్‌లో 4 ఎకరాలను కేటాయించారు. ఉపఉత్పత్తులకు విలువ జోడింపు, నాణ్యమైన మాంసాన్ని ఎగుమతి చేసేందుకు ఈ కేంద్రం ద్వారా వీలు కలగనుంది. ఈ దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.


ఏటా తప్పని ముంపు

నగరానికి ముంపు సమస్య వర్షపు నీటి మళ్లింపు ప్రాజెక్టు పూర్తి అయితేనే సాధ్యం. పనులు చేస్తున్న ఎల్‌ అండ్‌ టి కంపెనీకి ప్రభుత్వం బకాయిలు చెల్లించక పోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. రూ. 362.43 కోట్లతో 2017, ఏప్రిల్‌లో మొదలైన పనులు ఆగస్టు, 2019 నాటికి పూర్తి కావాల్సి ఉంది. మొత్తం 443.75 కి.మీ మేర మురుగునీటి కాలువలను నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు మేజరు డ్రెయిన్లు.. 62 కి.మీ, మైనర్‌ డ్రెయిన్లు.. 197 కి.మీ చొప్పున 252.14 కి.మీ మాత్రమే పూర్తి చేయగలిగారు. పూర్వ కమిషనర్‌ అభ్యర్థన మేరకు పనులను ఎల్‌ అండ్‌ టి నుంచి తప్పించారు. పురోగతిలో ఉన్న పనుల వరకు పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల కొంత వరకు పనులు జరిగినా.. మళ్లీ ఆగిపోయాయి. మిగిలిన పనులు ఎవరు చేయాలన్న దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తమ ఆధీనంలోని పనులకు సంబంధించి ఎల్‌ అండ్‌ టి నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అసలు మొదలు కాని పనులకు సంబంధించి ఇంకా తేలలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని