logo

తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీపై ఫిర్యాదు

తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి జనన ధ్రువపత్రం మంజూరు చేసిన వీఆర్వోపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్‌ వెంకటరమణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని మల్లమీదపల్లికి చెందిన రామాంజులమ్మ బెంగళూరులోని ఓ కంపెనీలో ప

Published : 21 Jan 2022 06:24 IST

ఫోర్జరీ సంతకం చేసిన ధ్రువపత్రం

 

గాండ్లపెంట, న్యూస్‌టుడే: తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి జనన ధ్రువపత్రం మంజూరు చేసిన వీఆర్వోపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహసీల్దార్‌ వెంకటరమణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని మల్లమీదపల్లికి చెందిన రామాంజులమ్మ బెంగళూరులోని ఓ కంపెనీలో పనిచేస్తోంది. ఈమె పనిచేస్తున్న కంపెనీ నుంచి అందాల్సిన ప్రావిడెంట్‌ ఫండ్‌ను పొందేందుకు జనన ధ్రువపత్రం సమర్పించాల్సి వచ్చింది. దీంతో రామాంజులమ్మ గ్రామ వీఆర్వోకు దరఖాస్తు చేసుకుంది. ఈ ధ్రువపత్రాన్ని సుబహాన్‌ అనేవ్యక్తి బెంగళూరుకు వెళ్లి ఇచ్చివచ్చారు. ధ్రువపత్రం కొన్నేళ్ల కిందట పనిచేసిన తహసీల్దార్‌ సంతకం పెట్టి, గతేడాది నవంబరు 21 తేదీ జారీ చేసినట్లు నమోదు చేశారు. ఆ ధ్రువపత్రాన్ని కంపెనీ తిరస్కరించింది. అదే ధ్రువపత్రం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఈ విషయం ప్రస్తుతం పనిచేస్తున్న తహసీల్దార్‌ వెంకటరమణ దృష్టికి వచ్చింది. పరిశీలించగా గతంలో ఎప్పుడో పనిచేసి పదవీ విరమణ పొందిన తహసీల్దార్‌ సంతకంగా గుర్తించారు. ఇందుకు స్పందించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సంతకం ఫోర్జరీ చేశారని అభియోగం ఎదుర్కొంటున్న వీఆర్వో శబరియాత్రలో ఉన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీఆర్వో అందుబాటులోకి వచ్చిన తర్వాత విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు. ఈ విషయంపై వీఆర్వో నరసింహులును ‘న్యూస్‌టుడే’ చరవాణిలో వివరణ కోరగా సదరు ధ్రువపత్రం జారీలో తనకు సంబంధం లేదని, సుబహాన్‌, మరోవ్యక్తి తనను ఇరికించేందుకు ఆరోపణలు చేశారని తెలిపారు. గ్రామానికి వచ్చిన తర్వాత అన్ని వివరాలు ఉన్నతాధికారులకు వివరిస్తానని తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని