Andhra News: ఆ ఐదుగురి మరణానికి ఉడతే కారణమట.. నివేదిక ఇవ్వరట!

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద నిన్న ఉదయం విద్యుత్త తీగ తెగి ఆటోపై పడిన దుర్ఘటనలో ఐదుగురు బుగ్గిపాలైన విషయం

Updated : 01 Jul 2022 20:09 IST

తాడిమర్రి: శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద నిన్న ఉదయం విద్యుత్త తీగ తెగి ఆటోపై పడిన దుర్ఘటనలో ఐదుగురు బుగ్గిపాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి ఓ ఉడత కారణమని విద్యుత్తుశాఖ అధికారులు చెప్పడంతో ... తాడిమర్రి పశువైద్యశాలలో శుక్రవారం ఉడుత కళేబరానికి పశువైద్యులు పరీక్షలు పూర్తి చేశారు. అయితే, మీడియాకు వివరాలు తెలియకుండా నివేదికను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఉడత పరీక్ష వివరాలు మీడియాకు ఇవ్వొద్దని  పోలీసులు చెప్పారని పశువైద్యులు చెబుతున్నారు. ఘటన జరిగిన చిల్లకొండయ్యపల్లిలో విద్యుత్తు స్తంభాన్ని అధికారులు పరిశీలించారు. 

ఉడతపై నెపం

కరెంటు స్తంభం పైకి ఉడత ఎక్కినప్పుడు ఇన్సులేటర్‌ నుంచి కండక్టర్‌కు షార్ట్‌సర్క్యూట్‌ అయి మధ్యలో తీగ తెగి అదే సమయంలో అటుగా వస్తున్న ఆటోపై పడిందని ఎస్పీడీసీఎల్‌ అధికారులు పేర్కొంటున్నారు. అయితే స్థానిక రైతులు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. తీగలు, బుడ్డీలు (ఇన్సులేటర్లు) నాసిరకంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. గ్రామ పరిధిలోని పొలాల్లో 6నెలల కిందటే 11 కేవీ లైను ఏర్పాటు చేశారు. ఇందులో ఎల్టీ (లోటెన్షన్‌) తీగలు వాడారని చెబుతున్నారు. పాత విద్యుత్తు తీగలు లాగుతుండటంపై గుత్తేదారులను ప్రశ్నించినా లెక్క చేయలేదని వాపోతున్నారు. నాసిరకం తీగలను మార్చాలని విద్యుత్తు అధికారులు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరిస్తున్నారు. అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రమాదానికి ఉడతే కారణమని చెబుతున్నారని విమర్శిస్తున్నారు.

నిపుణులేం చెబుతున్నారంటే? 

విద్యుత్తు స్తంభాలపై పక్షులు వాలటం, ఉడత, తొండలాంటి ప్రాణులు ఎక్కటం సాధారణమే. ఉడతలాంటివి తీగలపైకి ఎక్కినప్పుడు షార్ట్‌సర్క్యూట్‌ అయితే సంబంధిత సబ్‌స్టేషన్‌లో ట్రిప్‌ అయి సరఫరా నిలిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తీగ తెగిపడినా ట్రిప్‌ అవుతుందని, ఇందుకోసం ప్రతి ఫీడర్‌లో ప్రత్యేకంగా బ్రేకర్లను ఏర్పాటుచేస్తారని పేర్కొంటున్నారు. అయితే చిల్లకొండయ్యపల్లి ప్రమాద సంఘటనలో ఉడత కారణంగా షార్ట్‌సర్క్యూట్‌ అయి తీగ తెగింది. ట్రిప్‌ అయి సరఫరా నిలిచిపోలేదు. తీగ తెగినప్పుడు కరెంటు పోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇన్సులేటర్లు, కండక్టర్లు, తీగలు నాసిరకంగా ఉండటం వల్లే ట్రిప్‌ అవ్వలేదని అభిప్రాయపడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని