logo

కబ్జా కోరల్లో అనంత కార్పొరేషన్‌ స్థలాలు: సీపీఐ

అనంతపురం నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నా పట్టణ ప్రణాళిక అధికారులు చోద్యం చూస్తున్నారని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు ఆరోపించారు.

Published : 04 Feb 2023 04:00 IST

మాట్లాడుతున్న సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకులు

ఆజాద్‌నగర్‌, న్యూస్‌టుడే: అనంతపురం నగరంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నా పట్టణ ప్రణాళిక అధికారులు చోద్యం చూస్తున్నారని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు ఆరోపించారు. సహాయ కార్యదర్శులు అల్లీపీరా, రమణయ్యతో కలిసి ఆయన నగరంలోని నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని సెంట్రల్‌ పార్కు, శ్రీనగర్‌ కాలనీల్లో ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే ఆక్రమణలు జరుగుతున్నాయని విమర్శించారు. సెంట్రల్‌ పార్కులో ఏడెకరాల భూమిలో ఒకటిన్నర ఎకరా వైకాపా నాయకుల కబంధహస్తాల్లోకి వెళ్లిందన్నారు. గత కొన్నేళ్లుగా సీపీఐ పోరాటాలు చేస్తున్నా తూతూ మంత్రంగా సర్వే నిర్వహించారని, సదరు రిపోర్టును అధికారులు బయటపెట్టకుండా గోప్యంగా ఉంచారన్నారు. శ్రీనివాసనగర్‌లో కార్పొరేషన్‌ స్థలం కబ్జాకు గురవుతోందని, ఖాజనగర్‌లో మున్సిపల్‌ స్థలానికి పట్టా తెచ్చుకున్న నేపథ్యంలో సీపీఐ ఆందోళన చేసిందన్నారు. కార్పొరేషన్‌ స్థలాల చుట్టూ కంచె వేయించి బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎల్‌పీ నెంబరు 42/2000, సర్వే నెంబరు 353లో ఉన్న 67సెంట్ల స్థలంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డి 8 సెంట్లను కబ్జా చేసి షెడ్డు నిర్మించుకున్నా.. కమిషనర్‌, మేయర్‌, ఎమ్మెల్యే స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సంబంధిత అధికారులు స్థలాలు కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని