logo

రూ.వెయ్యి, మద్యం.. డబ్బులిచ్చి జగన్‌ బస్సుయాత్రకు జనాల తరలింపు

వైకాపా అధినేత, సీఎం జగన్‌ చేపట్టిన బస్సుయాత్ర సోమవారం శ్రీసత్యసాయి జిల్లాలో కొనసాగింది. బత్తలపల్లి మండలం సంజీవపురం నుంచి మొదలై బత్తలపల్లి, ముదిగుబ్బ, మలకవేముల క్రాస్‌ మీదుగా సాయంత్రం 6 గంటలకు కదిరి చేరుకుంది. బస్సుయాత్ర కోసం స్థానిక వైకాపా నాయకులు జనాలను తరలించడం కోసం నానాఅవస్థలు పడ్డారు

Published : 02 Apr 2024 08:30 IST

 

కదిరి పట్టణంలో జగన్‌ రోడ్‌షో..

ఈనాడు డిజిటల్‌, అనంతపురం-బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి, కదిరి, కదిరి గ్రామీణం,  తనకల్లు: వైకాపా అధినేత, సీఎం జగన్‌ చేపట్టిన బస్సుయాత్ర సోమవారం శ్రీసత్యసాయి జిల్లాలో కొనసాగింది. బత్తలపల్లి మండలం సంజీవపురం నుంచి మొదలై బత్తలపల్లి, ముదిగుబ్బ, మలకవేముల క్రాస్‌ మీదుగా సాయంత్రం 6 గంటలకు కదిరి చేరుకుంది. బస్సుయాత్ర కోసం స్థానిక వైకాపా నాయకులు జనాలను తరలించడం కోసం నానాఅవస్థలు పడ్డారు. గ్రామాల నుంచి వచ్చేవారికి రూ.వెయ్యి చొప్పున ఇచ్చి యాత్రకు తీసుకొచ్చారు. వైకాపా జెండాలు మోసినవారికి మద్యం పంపిణీ చేశారు. బత్తలపల్లి, ముదిగుబ్బ ప్రాంతాల్లో కొందరు రోడ్డుపైనే మద్యం తాగారు. అనంతరం జగన్‌ పాటలకు డ్యాన్సులు వేయించారు. జగన్‌ బస్సుయాత్ర సందర్భంగా అనంతపురం-కదిరి జాతీయ రహదారిని అష్టదిగ్బంధనం చేశారు. ముదిగుబ్బ నుంచి రెండు వరసల రహదారే కావడంతో బస్సుయాత్ర కదిరి చేరేంత వరకు వాహనాలను వదల్లేదు. ఇటు కదిరి నుంచి అనంతపురం వెళ్లాల్సిన వాహనాలను కూడా 2 గంటల పాటు నిలిపేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకపోవడంతో అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణపై శ్రద్ధ పెట్టకపోవడంతో వాహనదారుల కష్టాలు రెట్టింపయ్యాయి.

20 సర్వీసులు రద్దు

జగన్‌ బస్సుయాత్ర సందర్భంగా ఆర్టీసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కదిరి-అనంతపురం వెళ్లాల్సిన బస్సు సర్వీసులను రద్దు చేశారు. రాత్రి 9 వరకు సర్వీసులను పునరుద్ధరించలేదు. సుమారు 20 సర్వీసుల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అనంతపురం వెళ్లడానికి వచ్చిన ప్రయాణికులు గంటలకొద్దీ బస్సుల కోసం ఎదురుచూశారు. చాలామంది ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. సర్వీసులు నిలిపివేయడంతో కదిరి డిపోకు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించడంలో విఫలం కావడంతో చిత్తూరు నుంచి కదిరి, అనంతపురం వెళ్లాల్సిన బస్సులు 4 గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుకున్నాయి.

12 గంటలపాటు..

జగన్‌ బస్సు యాత్ర సోమవారం ఉదయం 11 గంటలకు మొదలైంది. అయితే అధికారులు ఉదయం 8 గంటలకే బస్సుయాత్ర మార్గంలోని గ్రామాలు, మండల కేంద్రాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేశారు. ముఖ్యమంత్రి వెళ్లిపోయిన తర్వాత కూడా సరఫరాను పునరుద్ధరించలేదు. ముదిగుబ్బలో రాత్రి 8 గంటలకు తరువాత ఇచ్చారు. దాదాపు 12 గంటల పాటు ప్రజలు పడరాని పాట్లు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని