logo

అందరితో మమేకమవుతూ.. అన్ని వర్గాలకు భరోసానిస్తూ

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. నిత్యం అంతర్గత, బహిరంగ సమావేశాలతో ఓట్ల వేటలో వేగం పెంచారు.

Updated : 16 Apr 2024 05:39 IST

ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన కూటమి అభ్యర్థులు
ఇంటింటికీ వెళ్లి ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలపై ప్రచారం

ఈనాడు డిజిటల్‌, పుట్టపర్తి: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. నిత్యం అంతర్గత, బహిరంగ సమావేశాలతో ఓట్ల వేటలో వేగం పెంచారు. ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో జరిగిన విధ్వంసాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు చేసే బాధ్యత తీసుకుంటూ గ్యారంటీ బాండ్లపై సంతకాలు చేసి ఇస్తున్నారు. జిల్లాను అభివృద్ధి చేసుకోవాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమిని గెలిపించాలని కోరుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రజాగళం, లోకేశ్‌ శంఖారావం సభలతో కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మరోవైపు పలుచోట్ల వైకాపా నాయకులు, కార్యకర్తల తెదేపా తీర్థం పుచ్చుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో జోరుగా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి.

వైకాపా అరాచకాలు వివరిస్తూ..

అభ్యర్థులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం చేస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు, స్థానిక ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడుతున్నారు. నిత్యావసర ధరలు, పన్నుల పెంపుపై వివరిస్తున్నారు. అర్హత ఉన్నా పథకాలు రావడం లేదని చెబుతున్న ప్రజలకు ధైర్యం కల్పిస్తున్నారు. తెదేపా ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తామంటూ భరోసా ఇస్తున్నారు. నెలకు రూ.1500, ఉచితంగా గ్యాస్‌ సిలిండర్ల హామీపై గ్రామాల్లోని మహిళల నుంచి ఆదరణ లభిస్తోంది.

వెనుకబడిన కులాలకు జగన్‌ ఏ విధంగా అన్యాయం చేశారనేది స్పష్టంగా వివరిస్తున్నారు. పేరుకు పదవులు ఇచ్చినా పెత్తనం మాత్రం సొంత సామాజికవర్గం నాయకుల చేతుల్లోనే ఉంచారనే విషయాన్ని బాధిత వర్గాలే ఎదురేగి చెబుతున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించి అన్యాయం చేశారనే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు అందిస్తామని చెబుతుండటంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జగన్‌ జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మోసపోయిన యువత తెదేపాకు మద్దతు ప్రకటిస్తున్నారు.

జనసేన, భాజపా సమన్వయంతో..

ఉమ్మడి జిల్లాలోని 13 స్థానాల్లో తెదేపా, ఒక స్థానంలో భాజపా అభ్యర్థులు బరిలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో తెదేపా అభ్యర్థులు భాజపా, జనసేన నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలను కైవసం చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించుకుంటున్నారు. ఇటీవలే అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో మూడు పార్టీల నాయకులతో సమన్వయ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. సమాలోచనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని