logo

వాల్మీకుల గొంతు కోసిన జగన్‌: కాలవ

వాల్మీకుల గొంతు కోసిన వ్యక్తి జగన్‌ అని, దాన్ని అడ్డుకోకుండా వాల్మీకి అయిన రంగయ్య చేతకాని వారిలా ఉండిపోయారని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 16 Apr 2024 03:15 IST

వేదికపై కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు, అంబికా లక్ష్మీనారాయణ జనసేన నాయకులు

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: వాల్మీకుల గొంతు కోసిన వ్యక్తి జగన్‌ అని, దాన్ని అడ్డుకోకుండా వాల్మీకి అయిన రంగయ్య చేతకాని వారిలా ఉండిపోయారని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద సోమవారం వాల్మీకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కాలవతోపాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య, నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజేశ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేలా తాను ఎంపీగా ఉన్న సమయంలో దిల్లీ వరకు తీసుకెళ్లానని గుర్తు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత వాల్మీకులు బాగానే ఉన్న వారంటూ తప్పుడు నివేదికలు తయారు చేసి ఎస్టీలుగా గుర్తించేందుకు అడ్డుకొన్నారని ఆరోపించారు. రంగయ్య ఎంపీగా ఉంటూ ఐదేళ్లలో ఏం ఒరగబెట్టారని, ఇప్పుడు వాల్మీకుల ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. వాల్మీకుల కోరిక మేరకు వాల్మీకి కాంస్య విగ్రహం అందజేస్తానన్నారు.

సభకు హాజరైన వాల్మీకులు

అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వాల్మీకి ఫెడరేషన్‌ ద్వారా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ముగ్గురు అభ్యర్థులను వాల్మీకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వాల్మీకీ సంఘ నాయకులు వై.పి.రమేశ్‌, గోళ్ల వెంకటేశులు, డి.ఎన్‌.మూర్తి, వాల్మీకి ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని