logo

ఒక్క పరిశ్రమనైనా తెచ్చావా జగన్‌

ఉమ్మడి అనంత జిల్లాలో జగన్‌ సర్కార్‌ దెబ్బకు పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారు.

Updated : 16 Apr 2024 06:36 IST

ఐదేళ్ల పాలనలో అటకెక్కిన ఎంఎస్‌ఎంఈ పార్కులు 
ఔత్సాహికులకు ప్రోత్సాహం కరవు

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ఉమ్మడి అనంత జిల్లాలో జగన్‌ సర్కార్‌ దెబ్బకు పరిశ్రమలు విలవిల్లాడుతున్నాయి. నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేశారు. పరిశ్రమలు స్థాపిస్తే ప్రోత్సాహకాలు, రాయితీలు కల్పిస్తామంటూ నమ్మించి నట్టేట ముంచారు. ఐదేళ్ల కాలంలో ఒకటి రెండుసార్లు అడపాదడపా రాయితీలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మూడేళ్లుగా పైసా కూడా రాయితీ, ప్రోత్సాహక సొమ్ము ఇవ్వకుండా దగా చేశారు. పరిశ్రమల స్థాపనతో సంపదను సృష్టించి.. ప్రభుత్వానికి సాయపడాలన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనను మొగ్గలోనే తుంచేశారు. ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క పరిశ్రమనూ స్థాపించకపోగా... ఉన్నవాటిని సైతం మూతపడే దిశగా తీసుకెళ్లడం విశేషం. అంతేకాదు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కుల పరిస్థితి మరీ దయనీయం. ఈ పార్కులు పేరుకే.. ఇక్కడ ప్ల్లాంట్లన్నీ ఖాళీనే. కనీస సదుపాయాలు కల్పించలేని దుస్థితి. ఎస్సీ, ఎస్టీ వర్గాల యువత ‘బడుగు వికాసం’ పథకం కింద చిన్న తరహా పరిశ్రమలు, ఉత్పత్తి, సేవా, రవాణా రంగాల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయారు. 2021 సెప్టెంబరు నుంచి పైసా కూడా రాయితీ సొమ్ము రాలేదు. బడుగు వికాసానికే కాదు.. ఎంఎస్‌ఎంఈ కింద ప్రోత్సాహకాలు కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

రాయదుర్గం పారిశ్రామికవాడలో మూతపడిన యూనిట్‌

రాయితీ సొమ్ము గోవిందా

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాయితీ సొమ్ము దాదాపు రూ.130 కోట్లపైగా రావాల్సి ఉంది. ఒక్క అనంత జిల్లాలోనే రూ.51 కోట్లు దాకా రావాలి. 500 మందికిపైగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆ సొమ్ము దక్కాలి. విద్యుత్తు, భూమి కొనుగోలు, పెట్టుబడి, వడ్డీ, స్టాంపు డ్యూటీ, పన్నులు.. ఇలా పలు రూపాల్లో రాయితీలు రావాల్సి ఉంది. ఈ తరహాలోనే వెయ్యికిపైగా రాయితీల క్లెయిమ్‌లు పెండింగ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

కనిపించని పురోగతి

ఉమ్మడి జిల్లాలో ఏపీఐసీసీ ద్వారా నెలకొల్పిన ఎంఎస్‌ఎంఈ పార్కులు ఉత్సవ విగ్రహాల్లా మారాయి. చాలాచోట్లా వందలాది గదులు, షెడ్లు నిరూపయోగంగా మారాయి. రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లి, ఆర్‌.అనంతపురం, మడకశిర, కప్పలబండ, పరిగి వంటి ప్రాంతాల్లో పార్కులు ధైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కూడేరు, రాయదుర్గం, గుత్తి, వంటి చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్నా కార్యరూపం దాల్చలేదు. భూసేకరణకే పరిమితమయ్యారు. రాప్తాడు మండలంలోని ఎంఎస్‌ఎంఈ పార్కులో దాదాపు వంద దాకా ప్లాట్లు ఉంటే.. కేవలం పది మాత్రమే భర్తీ అయ్యాయి. ఇక్కడ తాగునీటి సదుపాయం లేదు. యజమానులే బోర్లు వేసుకుని కాలం గడుపుతున్నారు. ఆర్‌.అనంతపురం, కప్పలబండ పార్కులు దయనీయ దుస్థితిలో ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో ఎక్కడా పురోగతి కానరాలేదు.

ఔత్సాహికులకు మొండిచెయ్యి

హిందూపురం అర్బన్‌: పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనే ఔత్సాహికులకు తెదేపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్సీలకు 25 శాతం, బీసీలకు 20 శాతం, ఓసీలకు 15 శాతం రాయితీ అందించేది. దీంతో అప్పట్లో హిందూపురం సమీపంలోని తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామికవాడల్లో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి అనేకమంది ఔత్సాహికులు ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఇలా రెండు పారిశ్రామికవాడల్లో దాదాపు 185 చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్న దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలకు అందాల్సిన రూ.కోట్ల రాయితీలు నేటికీ చెల్లించలేదు. తూముకుంట పారిశ్రామికవాడలో ఒక్క పరిశ్రమ యజమానికే రూ.46 లక్షలు రాయితీ అందాల్సి ఉండగా ఇప్పటికీ ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తూనే ఉన్నారు. రాయితీ బకాయిలు చెల్లించకకపోవడంతో ఐదేళ్లలో దాదాపు 15 పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పారిశ్రామికవాడలో ఒక్క ప్లాటు విక్రయం కాలేదు.

హిందూపురం సమీపంలోని తూముకుంట పారిశ్రామికవాడ

జాకీని తరిమేశారు..

వైకాపా ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న వాటినీ తరిమేశారు. అప్పటి తెదేపా ప్రభుత్వం ప్రముఖ టెక్స్‌టైల్స్‌ కంపెనీ జాకీతో రాప్తాడు సమీపంలో యూనిట్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. జాతీయ రహదారికి ఆనుకుని 27 ఎకరాలు కేటాయించింది. రూ.129 కోట్ల పెట్టుబడితో ఏటా 32.4 మిలియన్ల దుస్తులు తయారుచేసేలా కర్మాగారాన్ని నిర్మించాలనేది ప్రణాళిక. తద్వారా నేరుగా 6 వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టారు. ఇంతలో వైకాపా అధికారంలోకి వచ్చింది. స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి రూ.20 కోట్లు కమీషన్‌ డిమాండ్‌ చేయడంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. ఒత్తిళ్లు రోజురోజుకు పెరిగిపోవడంతో కంపెనీ తెలంగాణకు తరలివెళ్లింది. దీనిపై విమర్శలు రావడంతో స్థానిక ప్రజాప్రతినిధి జాకీని తలదన్నే టెక్స్‌టైల్‌ కంపెనీలను తీసుకొస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పటివరకు అతీగతీ లేదు.


రూ.కోట్ల వ్యయం.. ఉపాధి దూరం
ఏపీఐఐసీ ఛైర్మన్‌ ఇలాఖాలో నిరుద్యోగుల వలసబాట

టెక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు
కాకపోవడంతో ఖాళీగా స్థలం

రాయదుర్గం, న్యూస్‌టుడే: పట్టణ సమీపంలోని 74.ఉడేగోళం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్‌ పార్కులో రూ.కోట్లు వ్యయం చేసి వసతులు కల్పించినా పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటం, పరిశ్రమలశాఖ, బ్యాంకర్ల ప్రోత్సాహం కరవై ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఎంపికైనప్పుడు టెక్స్‌టైల్‌ పార్కుకు మహర్దశ పడుతుందని భావించినా చివరకు నిరాశే మిగిలింది. స్థానికంగా ఉపాధి లభించకపోవడంతో నిరుద్యోగులు బెంగళూరు, ముంబయి, చెన్నై తదితర నగరాలకు వలస వెళుతున్నారు.

సౌకర్యాలు కల్పించకపోవడంతో..

టెక్స్‌టైల్‌ పార్కులో అంతర్జాతీయ మార్కెట్‌ స్థాయికి దీటుగా దుస్తులు నాణ్యంగా తయారు చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి వేలాదిమందికి ఉపాధి కల్పించాలని రాయదుర్గం వద్ద 15 ఎకరాల్లో రూ.4 కోట్లతో టెక్స్‌టైల్‌ పార్కును ప్రారంభించారు. పరిశ్రమల ఏర్పాటుకు 2006లో పారిశ్రామికవేత్తలకు 55 ప్లాట్లు కేటాయించినా కేవలం 8 మంది మాత్రమే ఏర్పాటు చేశారు. 46 మంది ప్లాట్లు వదులుకోకపోగా యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. ఐదేళ్లలో యూనిట్లను ప్రారంభించకపోతే వాటిని రద్దు చేస్తామని చేనేత జౌళిశాఖ అధికారుల నామమాత్రపు హెచ్చరించినా.. సౌకర్యాలు కల్పించకపోవడంతో పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు.

  రెండు యూనిట్లు మాత్రమే

టెక్స్‌టైల్‌ పార్కులో ప్రారంభమైన 8 యూనిట్లలో కేవలం రెండు మాత్రమే నడుస్తున్నాయి. 6 మూతపడ్డాయి. అన్ని యూనిట్లు నడుస్తున్నప్పుడు 600 మందికి ఉపాధి లభించగా ప్రస్తుతం 150 మందికి మాత్రమే పని దొరుకుతోంది. ఉన్న యూనిట్లలో కార్మికులకు ఉచిత శిక్షణ, రవాణా సౌకర్యంతో పాటు మధ్యాహ్న భోజనం, వేతనాలు అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని