logo

సర్దు‘బాట’కు వేళాయె!

ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదిగా ఉద్యోగోన్నతులు చేపట్టక పోవడం, డీఎస్సీ ద్వారా నియమాకాలు లేకపోవడం, ఉద్యోగ విరమణ, అకాల మరణాలతో ఏర్పడిన ఖాళీ  పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలో సెకండరీ గ్రేడ్‌, పాఠశాల సహాయకుల్లో 1,500 పోస్టుల కొరత ఏర్పడింది.

Updated : 03 Dec 2022 05:14 IST

జిల్లాలో మిగులు టీచర్లు 1000 మంది
ఇంకా 1,500 మంది అవసరం

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదిగా ఉద్యోగోన్నతులు చేపట్టక పోవడం, డీఎస్సీ ద్వారా నియమాకాలు లేకపోవడం, ఉద్యోగ విరమణ, అకాల మరణాలతో ఏర్పడిన ఖాళీ  పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలో సెకండరీ గ్రేడ్‌, పాఠశాల సహాయకుల్లో 1,500 పోస్టుల కొరత ఏర్పడింది.. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం అన్ని జిల్లాలో సబ్జెక్టు టీచర్ల కొరత లేకుండా ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయుడిని నియమించేందుకు మిగులు టీచర్లను గుర్తించి అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు.. దీన్ని శనివారం(ఈ నెల 3)లోగా పూర్తి చేయాలని పేర్కొనడం గమనార్హం.

జిల్లాలో 3,4,5 తరగతులు విలీనమైన ఉన్నత పాఠశాలల్లో తప్పనిసరిగా సబ్జెక్టు టీచర్లుగా పాఠశాల సహాయకులు బోధించాలని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ఈ మేరకు.. జిల్లా విద్యాశాఖ పాఠశాలల వారీగా మిగులు ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారో గుర్తించే ప్రక్రియలో నిమగ్నమైంది. దాదాపు వెయ్యికి పైగా పోస్టులు ఎస్జీటీ, పాఠశాల సహాయకులు మిగలనున్నారని అధికారులు అంచనా వేశారు. దీని పూర్తి వివరాలు శనివారం సాయంత్రానికి తెలియనున్నాయి.

‘పది’ విద్యార్థులే లక్ష్యంగా.. రానున్న మార్చి/ఏప్రిల్‌లో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను గుర్తించి సంబంధిత పాఠశాలల్లో సర్దుబాటు పేరుతో కేటాయింపునకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వివిధ కారణాలతో పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలను పూర్తిస్థాయిలో సబ్జెక్టు టీచర్లను నియమించడానికి, పదో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాలు పూర్తిచేసి పబ్లిక్‌ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఈ సర్దుబాటు ప్రక్రియ ఉపయోగపడనుంది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి  సబ్జెక్టు టీచర్‌ లేకుండానే పరీక్షలు జరుగుతుండటం గమనార్హం.

3, 4, 5 తరగతులకు సబ్జెక్టు  టీచర్‌తో బోధన

జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ఉన్నత పాఠశాలకు కి.మీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలల్లోని మూడు, నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులను హైస్కూల్‌లో విలీనం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆ తరగతులకు పాఠశాల సహాయకులచే బోధిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మిగులు ఉపాధ్యాయులను గుర్తించి అవసరమైన పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారు. ఒకటి, రెండు తరగతుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న సంబంధిత పాఠశాలలు సైతం మిగులు ఎస్జీటీలతో సర్దుబాటు చేస్తారు.  


విశ్రాంత ఉద్యోగులకు జమకాని పింఛన్లు
టీచర్లకు మినహా మిగిలిన వారికి వేతనాలు

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రెండో తేదీ దాటినా విశ్రాంత ఉద్యోగుల ఖాతాల్లోకి పింఛను, ఉపాధ్యాయులకు వేతనాలు జమ కాలేదని సమాచారం. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు, వైద్య ఆరోగ్య, మండల పరిషత్‌, సచివాలయ సిబ్బందికి మాత్రం నవంబరు వేతనాలు జమ అయినట్లు  తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఉద్యోగులకు వేతనాల చెల్లింపు ఆలస్యమెనా.. విశ్రాంత ఉద్యోగులకు మాత్రం ముందుగా ఇచ్చిన పరిస్థితి. ఈ నెలలో మాత్రం విశ్రాంత ఉద్యోగులకు రెండో తేదీ గడుస్తున్నా పింఛను జమ కాలేదు. వివిధ అరియర్స్‌ కోసం పోరాటాలు చేసే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు.. ఇప్పుడు ఒకటో తేదీన చెల్లింపులపై మాట్లాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండో తేదీన పలువురు ఉపాధ్యాయులు వేతనాలు జమ అయ్యాయా.. అని తమ ఖాతాలు పరిశీలించుకుంటు న్నారు. వేతన బిల్లులు గ్రీన్‌ఛానెల్‌లో క్లియర్‌ అయినట్లు కనిపిస్తున్నా.. సీఎఫ్‌ఎంఎస్‌లో చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని