logo

మూడేళ్లు.. 2,103 ప్రమాదాలు

జిల్లాలో జాతీయ.. రాష్ట్ర రహదారులు విస్తరించాయని సంబరపడినా రోడ్డు ప్రమాదాలు  తగ్గడం లేదు. అందులోనూ బ్లాక్‌స్పాట్స్‌, హాట్‌స్పాట్స్‌గా గుర్తించిన ప్రాంతాల్లోనే అధికమవుతున్నాయి.

Published : 06 Feb 2023 02:32 IST

కారణాలు గుర్తించినా చర్యలేవీ..
ప్రతిపాదనలకే రవాణా, పోలీసు శాఖల సర్వే
న్యూస్‌టుడే, చిత్తూరు(నేరవార్తలు)

పూతలపట్టు: ప్రమాదాల కూడలి రంగంపేట క్రాస్‌

జిల్లాలో జాతీయ.. రాష్ట్ర రహదారులు విస్తరించాయని సంబరపడినా రోడ్డు ప్రమాదాలు  తగ్గడం లేదు. అందులోనూ బ్లాక్‌స్పాట్స్‌, హాట్‌స్పాట్స్‌గా గుర్తించిన ప్రాంతాల్లోనే అధికమవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో రవాణా, పోలీసు శాఖ అధికారులు కలిసి సర్వే చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకు సుమారు రూ.45 లక్షల వరకు ఖర్చవుతుందని లెక్కలు కూడా తేల్చారు. నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


25 బ్లాక్‌ స్పాట్లు

మూడేళ్లలో కనీసం ఐదు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను అధికారులు బ్లాక్‌స్పాట్స్‌గా సూచిస్తూ.. జిల్లాలో 25 ప్రాంతాలను గుర్తించారు. అందుకు కారణాలను కూడా గుర్తించి నివేదిక సిద్ధం చేశారు. అందులో.. ప్రధానంగా స్టాపర్స్‌, బ్లింకింగ్‌ లైట్లు, జీబ్రా లైన్లు లేవని గుర్తించారు. వీటితో పాటు స్పీడ్‌ బ్రేకర్లు, స్పీడ్‌ లిమిట్‌ బోర్డులు, సూచిక బోర్డులు అవసరమని నిర్ధారించారు.


తొమ్మిది హాట్‌స్పాట్లు

జిల్లాలో అధికారులు సర్వే చేపట్టి.. తొమ్మిది ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. గత మూడేళ్లలో ఈ ప్రాంతాల్లో  118 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు తేల్చారు. అందులో.. కేజీ సత్రం, చీలాపల్లి, మొగిలిఘాట్‌, కుప్పం - విజలాపురం మలుపు, పలమనేరు - జగమర్ల మలుపు, యాదమరి వరిగిపల్లి కూడలి, చిత్తూరు నగరం మురం కబట్టు కూడలి, ఆళ్ల   కుప్పంలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణాలు కూడా తేల్చి.. నివేదిక సిద్ధం చేశారు. ప్రధానంగా కూడళ్లు ప్రమాదకరంగా ఉండడం.. వాహనాల రద్దీ పెరగడం, రహదారి పక్కనే కల్వర్టు, పెట్రోలు బంక్‌లు ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు         నిర్ధారించారు.


ఎక్కడె క్కడంటే..

చిత్తూరు: మురకంబట్టులో సమీపంలో బ్లాక్‌స్పాట్‌ వద్ద బారికేడ్‌ ఏర్పాటు చేస్తున్న పోలీసులు

వణంపల్లెలోని తెల్లగుండ్లపల్లి గ్రామం, చిత్తూరు హైరోడ్డు, మురకంబట్టు కూడలి, కల్లూరులోని కోమిరెడ్డిపల్లి, గుడిపాలలోని కిల్లారపల్లి కూడలి, చిత్తూరు గంగాసాగరం, మొగిలిఘాట్‌, గంగవరంలోని పొన్నమకుపలపల్లి మలుపు, ఆళ్లకుప్పం, కుప్పంలోని కేసీ ఆసుపత్రి, రాళ్లబుదుగూరులోని కడపల్లి గ్రామ మార్గం, నాయనపల్లి పెట్రోలు బంకు మార్గం, వి.కోట జావినిపల్లి మలుపు, కుమ్మరమడుగుమలుపు, కృష్ణాపురం మలుపు, అన్నవరం మలుపు, బైరెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద, కుటలవంక మలుపు, పుంగనూరులోని వర్షాదాబా, సుగాలిమిట్ట మలుపు, తోపుమట్టం, రొంపిచెర్లలోని మట్లోల్లపల్లి, నగరిలోని ఏరియా ఆస్పత్రి మార్గం, గంగాధరనెల్లూరులో   ఠానా కూడలి, కార్వేటినగరంలోని తురకమిట్టమలుపు.


కనిపించని ప్రణాళిక

రోడ్డు ప్రమాదాలకు కారణాలు, బ్లాక్‌, హాట్‌స్పాట్‌లను గుర్తించినా.. వాటి నివారణకు అధికారుల యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయలేకపోతున్నారు. ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులు స్థానికంగా సర్వే చేపట్టి, ప్రమాదాలకు కారణాలను గుర్తిస్తూ.. పాలనాధికారి, ఎస్పీ, డీటీసీలకు నివేదికలు పంపించి మిన్నకుండిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అధికారులు సర్వే చేపట్టి ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించినా ఆయా ప్రాంతాల్లో నేటికీ ఎలాంటి అడుగులు పడలేదు.


నిధులు రాగానే.. బసిరెడ్డి, డీటీసీ

పోలీసు శాఖతో కలసి బ్లాక్‌స్పాట్లు ఉన్న ప్రాంతాలను పరిశీలించాం. స్థానికంగా  ఎలాంటి చర్యలు తీసుకోవాలో రూ.45 లక్షలతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే అన్ని ఏర్పాట్లు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని