logo

నిఘా లేని ఘాట్‌!

గతనెల 29న కోలారుకు చెందిన 13 మంది భక్తులు శ్రీవారి దర్శనానంతరం టెంపోలో మొదటి ఘాట్‌రోడ్డులో తిరుపతికి వస్తూ 6వ మలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు.

Published : 13 Jun 2023 04:46 IST

ప్రమాదాలు పట్టని రవాణా శాఖ
ఖాళీగా తిరుమల ఎంవీఐ పోస్టు
న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం), తిరుమల

మోకాళ్ల మెట్టు నుంచి తిరుపతికి వస్తున్న వాహనాలు

గతనెల 29న కోలారుకు చెందిన 13 మంది భక్తులు శ్రీవారి దర్శనానంతరం టెంపోలో మొదటి ఘాట్‌రోడ్డులో తిరుపతికి వస్తూ 6వ మలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు. డ్రైవరుకు విశ్రాంతి లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిజానికి 8 గంటలకు మించి వాహనం నడపకూడదని ఎంవీఐ చట్టం చెబుతోంది. కోలారు నుంచి ఒకే డ్రైవరు తిరుమల వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో అలసిపోయి ప్రమాదం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లు ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లగలరా.. లేదా అనే నిఘా పెట్టే యంత్రాంగం లేదు.


గతనెల 31న తిరుమల మొదటిఘాట్‌ చివరి మలుపు వద్ద జీపు బారికేడ్లను ఢీ కొట్టింది. ఎవరికీ గాయాలు కాకపోయినా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. డ్రైవరు వాహన చోదక అనుమతి కలిగి ఉన్నారా.. వాహన సామర్థ్యం ఏ మేరకు ఉంది.. నిర్ణయించిన సమయానికి లోబడి వాహనం నడుపుతున్నారా..  లేదా అని పరిశీలించే వ్యవస్థ లోపించింది.


దూర ప్రాంత వాహనదారులకు తిరుమల ఘాట్‌రోడ్లపై అవగాహనలేమి.. కాలం చెల్లిన ట్యాక్సీల అతివేగం.. నిష్ణాతులైన చోదకులు తగ్గిపోవడం వంటి కారణాలతో ఇటీవల తిరుపతి- తిరుమల ఘాట్‌రోడ్లలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సొంత వాహనదారులకు చోదక అనుమతులు (డీఎల్‌) ఉన్నప్పటికీ ఘాట్‌రోడ్డుపై అవగాహనలేక డివైడర్‌ను ఢీ కొడుతున్నారు. ఘాట్‌ ప్రమాద ఘటనలపై నిత్యం నిఘా పెట్టాల్సిన రవాణా శాఖ పట్టించుకోవడం లేదు. ఐదేళ్లుగా తిరుమల ఎంవీఐ అధికారి లేకపోవడంతో నిఘా కొరవడింది.

అవన్నీ బుట్టదాఖలు: ఐదేళ్ల కిందట ఘాట్‌రోడ్డులో ప్రమాదాల నివారణకు పలు విభాగాల అధికారులతో కూడిన కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఘాట్‌లోని రక్షణ గోడ పటిష్ఠ పరచడం, రోడ్డు రీ డివిజన్‌ చేయడం, ప్రమాదకర ప్రాంతాల్లో క్రాస్‌ బ్యారియర్స్‌, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు అవశ్యమని సూచించింది. మోకాళ్ల పర్వతం వద్ద రోడ్డుపై నడిచి వెళ్లే వారికి వారధి, రాత్రుల్లో తగినంత వెలుతురు మెరుగు పరచాలని కమిటీ పేర్కొంది. ఇవేమీ అమలు కావడం లేదు.

కాల వ్యవధి కొలిచేదెవరు?

ఇది వరకు నిర్ణయించిన 40 నిమిషాల ప్రయాణ కాల వ్యవధిని పట్టించుకోవడం లేదు. అతివేగం.. ముందు వాహనాలను అధిగమించే క్రమంలో అదుపు తప్పుతున్నాయి. అలాగే ప్రయాణ కాలవ్యవధిని తప్పించుకునేందుకు తిరుమల నుంచి వేగంగా వచ్చి దివ్యారామం వద్ద, అలాగే తిరుమలలో జీఎన్‌సీ టోల్‌గేట్‌ వద్ద వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. కాల వ్యవధిని గురించి ఆర్టీఏ, తితిదే విజిలెన్స్‌ పట్టించుకోనందున అతివేగం ఎక్కువైంది.

ఘాట్‌లో నిర్ణీత వేగం ఎంత?

తిరుమల ఘాట్‌రోడ్డులో ఎంత వేగంగా వాహనాలు ప్రయాణించాలనే నిర్ణయం ఇంత వరకు జరగలేదు. రెండు మార్గాల్లో స్పీడ్‌ గన్స్‌ అందుబాటులోకి తెస్తే అతివేగం.. వాహనాలను అధిగమించడం తగ్గుతుంది.

మరుగున పడిన ప్రతిపాదన

15 ఏళ్లు దాటిన వాహనాలను స్వాధీనం చేసుకుని.. వాటి స్థానంలో కొత్తవి   అందజేసి నెలవారీ రికవరీ చేసుకునే ప్రతిపాదనతో ఓ మోటారు కంపెనీ తితిదేకి గతంలో ప్రతిపాదన పంపగా మరుగున పడింది.

అవగాహన  లేమి: డీఎల్‌ అనుమతి ఉన్న సొంత వాహనదారులు, ఇతర ప్రాంతాల డ్రైవర్లు అలిపిరికి వస్తే ఘాట్‌రోడ్డులోకి అనుమతిస్తున్నారు. అసలు ఘాట్‌రోడ్డుపై వారికి అవగాహన ఎంత మేరకు ఉందనే విషయాన్ని గుర్తించడం లేదు. డ్రైవరు ఎంత దూరం నుంచి వాహనాన్ని నడుపుతూ వచ్చారు. ఘాట్‌లోకి అనుమతిస్తే అప్రమత్తంగా ఉండగలరా లేదా అనే విషయమై నిఘా పెట్టాల్సి ఉంది.


ప్రమాదాలకు కారణాలివే..

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం, అతివేగం, అటవీ జంతువులను చూసి అకస్మాత్తుగా వాహనాలు ఆపడం, సెల్ఫీల కోసం వాహనాలు నిలపడం, బ్రేక్‌ ఫెయిల్‌ కావడం, పరిమితికి మించి భక్తులను తీసుకెళ్లడం.


30కి పైగా ఘటనలు

ఆరునెలల వ్యవధిలో ఘాట్‌ రోడ్లలో 30కి పైగా ప్రమాదాలు జరిగాయి. 40 మంది వరకు గాయపడ్డారు. ఇద్దరు భక్తులు మృతి చెందారు.


సంయుక్తంగా తనిఖీలు ప్రారంభించాం
- కె.సీతారామిరెడ్డి, డీటీవో, తిరుపతి

ఘాట్‌రోడ్లలో తితిదే విజిలెన్స్‌, తిరుమల పోలీసు, ఆర్టీఏ శాఖల అధికారులు సంయుక్తంగా దిగువ ఘాట్‌లోకి వచ్చే వాహనాలను తనిఖీ చేశాం. ఇకపై కొనసాగిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని