logo

ఆకాశమే హద్దు!

ఆకాశమే హద్దుగా ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. చంద్రయాన్‌-3ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన ఇస్రో పలు కీలక, భారీ ప్రయోగాలు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది.

Updated : 26 Jul 2023 05:35 IST

కీలక ప్రాజెక్టులపై ఇస్రో దృష్టి
ముందున్న ఆరు భారీ ప్రయోగాలు
2024లోగా పూర్తిచేసేలా అడుగులు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: ఆకాశమే హద్దుగా ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. చంద్రయాన్‌-3ని విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన ఇస్రో పలు కీలక, భారీ ప్రయోగాలు వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. కీలకమైన ఆదిత్య-ఎల్‌1ను ఆగస్టులో ప్రయోగించనుండగా వచ్చే ఏడాదిలో నిసార్‌, స్పాడెక్స్‌, మంగళయాన్‌-2, గగన్‌యాన్‌ తోడు శుక్రయాన్‌-1 ప్రయోగం చేపట్టడంపైనా దృష్టి కేంద్రీకరించారు. ఎప్పటికప్పుడు వాణిజ్య ప్రయోగాలు నిర్వహిస్తూనే కీలకమైన వీటి కోసం శాస్త్రవేత్తలు అహరం శ్రమించనున్నారు.


ఆదిత్య-ఎల్‌1

వచ్చేనెలలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.378 కోట్లు. ఆదిత్య-ఎల్‌1 సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరి-క్లాస్‌ ఇండియన్‌ సోలార్‌ మిషన్‌. అంతరిక్ష నౌకను భూమికి 1.5 మిలియన్‌ కి.మీ. దూరంలోని సూర్య-భూమి వ్యవస్థలోని లాంగ్రేజియన్‌ పాయింట్‌1 (ఎల్‌1) చుట్టూ హ్యాలో కక్ష్యలో ఉంచడానికి ప్రణాళికలు చేశారు. ఈ కక్ష్యలో ఉంచిన ఉపగ్రహం ఎటువంటి గ్రహణం లేకుండా సూర్యుడిని నిరంతరం వీక్షించే వీలుంది. ఇది సౌర కార్యకలాపాలను నిరంతరం గమనిస్తూ అధిక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆదిత్య-ఎల్‌1లోని నాలుగు పేలోడ్‌లు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన మూడు పేలోడ్‌లు ఎల్‌1 వద్ద కణాలు, క్షేత్రాల అధ్యయనాలు నిర్వహిస్తాయి.


స్పాడెక్స్‌

2024 మూడో త్రైమాసికంలో ప్రయోగించే వీలున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.124 కోట్లు. స్పాడెక్స్‌ లేదా స్పేస్‌ డాకింగ్‌ ప్రయోగం.. మానవ అంతరిక్ష యానం, అంతరిక్షంలో ఉపగ్రహ సేవలు, ఇతర ప్రాక్సిమ్‌ కార్యకలాపాలతో అనువర్తనాల పరిధితో ఆర్బిటల్‌ రెండెజౌస్‌, డాకింగ్‌, ఫార్మేషన్‌ ఫ్లయింగ్‌, ఇతర సామీప్య కార్యకలాపాలకు సంబంధించిన సాంకేతికతలకు ఇస్రో అభివృద్ధి చేసిన జంట అంతరిక్ష నౌక మిషన్‌. ఇందులో రెండు ఐఎంఎస్‌ తరగతి (200 కిలోలు) ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి ఛేజర్‌, మరోటి టార్గెట్‌. రెండు అంతరిక్ష నౌకలనూ కొద్దిగా భిన్నమైన కక్ష్యలోకి చొప్పించనున్నారు.


గగన్‌యాన్‌

ప్రాజెక్టుకు రూ.9,023 కోట్లు కేటాయించారు. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ 2024లో చేపట్టనున్నారు. ముందుగా మానవ రహిత ‘జీ1 మిషన్‌’ 2023 నాలుగో త్రైమాసికంలో పూర్తిచేయనున్నారు. రెండో మానవ రహిత ‘జీ2 మిషన్‌’ 2024 రెండో త్రైమాసికంలో చేపట్టనున్నారు. ‘హెచ్‌1 మిషన్‌’గా పిలిచే మానవ అంతరిక్ష యానాన్ని 2024 నాలుగో త్రైమాసికంలో చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.


మంగళయాన్‌-2

2024 రెండో త్రైమాసికంలో ప్రయోగించే ఈ కీలక ప్రాజెక్టుకు రూ.600 కోట్లకు పైగా ఖర్చుకానుంది. మంగళయాన్‌-2 మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ భారతదేశానికి చెందిన రెండో మిషన్‌. ఇందులో హైపర్‌ స్పెక్ట్రల్‌ కెమెరా, హై-రిజల్యూషన్‌ ప్యాం క్రోమాటిక్‌ కెమెరా, ప్రారంభ మార్టిన్‌ క్రస్ట్‌, ఇటీవలి బసాల్ట్‌లు, బౌల్డర్‌ ఫాల్స్‌ను అర్థం చేసుకోవడానికి రాడార్‌ ఉంటాయి.


శుక్రయాన్‌-1

ఈ ప్రయోగానికి రూ.వెయ్యి కోట్ల వరకు అవసరమని ఇస్రో నివేదించింది. శుక్రయాన్‌-1గా పిలిచే ఇస్రోకు చెందిన వీనస్‌ మిషన్‌ 2024 డిసెంబరులో ప్రయోగించేలా ప్రణాళికలు రూపొందించారు. భూమి నుంచి శుక్రుడికి సరైన లాంచ్‌ విండోలు ప్రతి 19 నెలలకోసారి మాత్రమే అందుబాటులో ఉంటాయి. లిఫ్ట్‌ఆఫ్‌లో అవసరమైన ఇంధనం మరింత తగ్గించే అవకాశమున్న లాంచ్‌ విండోలు ప్రతి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈ మిషన్‌ ప్రయోగానికి అవసరమైన అధికారిక ఆమోదం కోసం శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు.


నాసా-ఇస్రోల నిసార్‌

ఈ ఉపగ్రహానికి రూ.12,296 కోట్లు కేటాయించారు. 2024 జనవరిలో ప్రయోగించే వీలుంది. నాసా, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న లో-ఎర్త్‌ ఆర్బిట్‌ అబ్జర్వేటరీ ఇది. షార్‌ నుంచి ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా కక్ష్యలోకి పంపనున్నారు. ఇది 12 రోజుల్లోనే మొత్తం భూగోళాన్ని మ్యాప్‌ చేస్తుంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూపర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్ష సంపద, జీవపదార్థం, సముద్రమట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల్లో మార్పులను అర్థం చేసుకోవడానికి ప్రాదేశికంగా, తాత్కాలికంగా స్థిరమైన డేటాను అందించనుంది. నాసా ఎల్‌-బ్యాండ్‌ పేలోడ్‌ను, ఇస్రో ఎస్‌-బ్యాండ్‌ సార్‌ పేలోడ్‌ను సమకూరుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని