logo

Rayalaseema: జగన్‌.. ఇదేనా సీమకష్టం తెలియడమంటే?

‘నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం నాది. నా సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా అన్నదాతల కష్టాలు చూశా. కరవుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని నేను.

Updated : 02 Mar 2024 09:18 IST

హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాలువ కింద దుస్థితి
ఒక్క ఎకరాకూ నీరివ్వని జగన్‌ సర్కార్‌
58 నెలల్లో రూ.75 కోట్లు ఇచ్చి ఉంటే పనులు పూర్తి

‘నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వం నాది. నా సుదీర్ఘ పాదయాత్రలో స్వయంగా అన్నదాతల కష్టాలు చూశా. కరవుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని నేను.

 - రాయలసీమలో పర్యటించిన ప్రతిసారీ ముఖ్యమంత్రి జగన్‌ చెప్పే మాటలివి.


ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకుంటుందని, కరవు సీమలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని రైతాంగం సంబరపడింది. హంద్రీ- నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రధాన, నీవా బ్రాంచి కాలువ పరిధిలోని అన్నదాతల ఆనందానికి అంతే లేదు. అందరి నమ్మకాన్ని శ్రీశైలం బ్యాలెన్సింగ్‌ జలాశయంలో జగన్‌ ముంచేశారు. ప్రాజెక్టు పెండింగ్‌ పనులు అటకెక్కించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు జగన్‌ జిల్లాకు వచ్చి ఏం మేలు చేశారని ఓట్లు అడుగుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఈనాడు, చిత్తూరు: తరచూ తాగు, సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజానీకాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌- రెండో దశ కింద కాలువ నిర్మించాలని నిర్ణయించారు. తెదేపా హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. భూసేకరణ, నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సమీక్షల్లో అధికారులను ఆదేశించారు. రెండు దశాబ్దాల క్రితం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2కు పునాది రాయి పడగా 2019 నాటికి 80 శాతం పనులు పూర్తి చేశారు. ఇది అందుబాటులోకి వస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్య ఉండదు. ఆయా ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి కూడా తగ్గుతుంది.

పులిచెర్ల:ఆర్‌.కురవపల్లి సమీపంలో నిరుపయోగంగా  పంప్‌హౌస్‌

కనీసం రూ.60 కోట్లు ఇవ్వాలని కోరినా..

కాలువలోని పెండింగ్‌ పనులు పూర్తికి రూ.75 కోట్లు విడుదల చేయాలని పలుమార్లు జిల్లా అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. కనీసం రూ.60 కోట్లు ఇచ్చినా సరిపోతుందని అడిగినా జగన్‌ సర్కార్‌ స్పందించలేదు. గత ప్రభుత్వాలు రూ.341 కోట్లు ఖర్చు చేయగా.. సీమ బిడ్డను అని చెప్పుకొనే ముఖ్యమంత్రికి రూ.75 కోట్లు ఇవ్వడానికి మనసు ఒప్పలేదు. ఫలితంగానే 58 నెలల వైకాపా పాలనలో ప్రధాన కాలువ పరిధిలో ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేకపోయారు.

కాంక్రీటు పనులు చేపట్టనందునే..

ప్రస్తుత సీఎం జగన్‌.. ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను పూర్తి చేసి చిత్తూరు జిల్లా నుంచి దుర్భిక్షాన్ని తరిమేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక కూడా మాటలు చెప్పడం మినహా నిధులు ఇవ్వలేదు. ఫలితంగా ఉమ్మడి కడప జిల్లాలోని చిన్నమండ్యం మండలంలోని 21వ ప్యాకేజీలో ప్రధాన కాలువకు సంబంధించి బ్లాస్టింగ్‌ పనులు నిలిచిపోయాయి. భూములు కోల్పోయే రైతులకు రూ.2 కోట్ల వరకు పరిహారం చెల్లించలేదు. కలకడ మండలం దొడ్డిపల్లి వద్ద మూడు కాంక్రీటు నిర్మాణాలూ జరగాలి. శ్రీనివాసపురం జలాశయం నిర్మాణంతో ముంపునకు గురయ్యే రెండు గ్రామాల ప్రజలకూ పరిహారం అందించలేదు. నీవా బ్రాంచి పరిధిలోని పీలేరు, కేవీపల్లె మండలాల్లోనూ స్ట్రక్చర్లు అసంపూర్తిగా ఉన్నాయి. 30వ ప్యాకేజీ కింద వచ్చే పాకాల, పులిచెర్ల మండలాల్లోనూ ఇదే పరిస్థితి. పలుచోట్ల వంకల ప్రవాహానికి ఇబ్బంది కలగకుండా కొంత ఎత్తులో కాలువ నిర్మించాల్సి ఉన్నా వాటినీ గాలికి వదిలేశారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో..
హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాలువ పరిధిలో ప్రతిపాదిత ఆయకట్టు: 1.40 లక్షల ఎకరాలు
గత ప్రభుత్వాలు చేసిన ఖర్చు: రూ.341 కోట్లు
ప్రస్తుతం అవసరమైన నిధులు: రూ.75 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని