logo

తెదేపా కార్యకర్తలపై ‘బైండోవర్‌’ వేధింపులు

తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పెట్టిన కేసు కొట్టేసినా.. ఇప్పుడు బైండోవర్‌ పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

Published : 28 Mar 2024 03:06 IST

కేసు కొట్టేసినా స్టేషన్‌కు రమ్మంటున్నారని ఆవేదన

 అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో తెదేపా కార్యకర్తలు

తిరుపతి(నేరవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పెట్టిన కేసు కొట్టేసినా.. ఇప్పుడు బైండోవర్‌ పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కార్యకర్తలతోపాటు వారి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి స్టేషన్‌కు రావాలని.. తహశీల్దారు వద్ద రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని గదమాయిస్తున్నారు. దీంతో తెదేపా నాయకులు, కార్యకర్తలకు బైండోవర్‌ భయం పట్టుకుంది. అలిపిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 45వ డివిజన్‌లో తిరుపతి పార్లమెంట్‌ ఉపఎన్నిక సందర్భంగా కార్యకర్త వరలక్ష్మి ప్రచారం చేశారు. ఆ సమయంలో వైకాపా నాయకులు అడ్డుకుని దాడి చేయడంతో ఆమె గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తెదేపా కార్యకర్తలు తమపై దాడి చేశారని వైకాపా ఫిర్యాదుతో 2021 ఏప్రిల్‌లో కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం అదే సంవత్సరం డిసెంబర్‌లో లోక్‌అదాలత్‌ వేదికగా కేసు కొట్టేశారు. ఘటనకు సంబంధించి డివిజన్‌ అధ్యక్షులు లోకేష్‌ యాదవ్‌, బత్తుల రవీంద్ర, గోళ్ల లోకేష్‌నాయుడు, సుజాతమ్మ, పురుషోత్తం, డిష్‌ హరికి పదిరోజులుగా అలిపిరి పోలీసులు ఫోన్‌చేసి స్టేషన్‌కు పిలిపించారు. కేసు కొట్టేశారని చెప్పినా వినకుండా పిలిపించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఏడుగురినీ అర్బన్‌ తహశీల్దారు ఎదుట హాజరుపరిచారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవరోధాలు సృష్టించబోమని రూ.లక్ష పూచీకత్తుతో వారు బయటకు వచ్చారు. అదేసమయంలో వైకాపా నాయకులపై కేసులున్నా పట్టించుకోలేదని తెదేపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని