logo

మత్తు.. చిత్తు

ఎన్నికల వేళ ప్రజలను మత్తులో ముంచేందుకు రాజకీయ పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత భారీగా పొరుగు మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు.

Published : 28 Mar 2024 03:21 IST

విచ్చలవిడిగా గంజాయి వినియోగం

భారీగా పట్టుబడుతున్న మద్యం, సారా

పుంగనూరులో ఇటీవల స్వాధీనం చేసుకున్న వాహనం, మద్యాన్ని చూపుతున్న పోలీసులు

 పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఎన్నికల వేళ ప్రజలను మత్తులో ముంచేందుకు రాజకీయ పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత భారీగా పొరుగు మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. పట్టణాలతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ గంజాయి గప్పుమంటోంది. నాటు సారా విక్రయాలు సైతం జోరందకున్నట్లు సెబ్‌ తనిఖీల్లో వెల్లడవుతూనే ఉంది. వీటి బారిన పడి యువత చిత్తవుతున్నారు.

 ఎన్నికలకు ముందు భారీగా.. ఈ ఏడాది ఎన్నికలు జరగుతుండటంతో అప్రమత్తమైన అక్రమార్కులు భారీగా మద్యం దిగుమతి చేసుకుని నిల్వకు యత్నించారు. దీంతో పాటు నాటు సారా తయారీ చేశారు. ఈ గత మూడు నెలల గణాంకాలు చూస్తే ఈ విషయం తెలస్తుంది. జిల్లాలోని వివిధ స్టేషన్ల పరిధిలో 541 కేసులు నమోదు చేసి 436 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి కర్ణాటక మద్యం 5,989.71 లీటర్లు, నాటు సారా, బెల్లం ఊట కలిపి 2,440 లీటర్లు స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టింది. మద్య నిషేదం అమలు చేస్తామని చెబుతూ ధరలు విపరీతంగా పెంచేసింది. దీంతో పొరుగు చూపులు చూస్తున్నట్లు వివిధ శాఖల అధికారులే అభిప్రాయపడుతున్నారు.

మంత్రి నియోజకవర్గంలో అధికం..

జిల్లా కేంద్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లో ఈ జాఢ్యం అధికంగా కనిపిస్తుంది. సులువుగా రవాణాకు ఆస్కారముండటంతో కార్లు, చక్రవాహనాల్లో కర్ణాటక మద్యం తెచ్చి.. కుటిర పరిశ్రమగా చిన్న, చిన్న దుకాణాలకు సైతం సరఫరా చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల దాడుల్లో తెలిసిన విషయం. మరి కొందరు అదనపు సంపాదన కోసం ఇందులో దిగుతున్నారు. వైకాపా సర్కార్‌ నాసిరకం మద్యం విక్రయిస్తుండటంతో.. పొరుగు వైపు చూస్తున్నారు. వైకాపా సర్కార్‌లో కీలకమైన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు పట్టణంలోనూ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. పట్టణంలో ప్రధానంగా ఎన్‌ఎస్‌ పేట, ఈస్టుపేట, ఏటిగడ్డపాళ్యం, భగత్‌సింగ్‌ కాలనీల్లో అధికంగా ఉంది. ఎస్‌ఈబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సారా, కర్ణాటక మద్యాన్ని నిలువరించలేక పోయారనే విమర్శలున్నాయి.
దాడులు చేస్తాం.. మాదకద్రవ్యాలు, పొరుగు మద్యం, సారా విక్రయాలపై నిఘా వేశాం. దీనిపై ఎవరికైనా సమాచారం తెలిస్తే.. మాకు తెలియజేయాలి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఎన్నికల నేపథ్యంలో దాడులు, తనిఖీలు పెంచి నివారించడానికి చర్యలు చేపడుతాం.  
- ఏవీ సుబ్బరాజు సెబ్‌ ఏఎస్పీ, చిత్తూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని