logo

YS Jagan: బస్సు దిగలేదు.. ప్రజలను కలవలేదు..!

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి తిరుపతి జిల్లాకు చేరుకున్నారు. సాయంత్రం పూతలపట్టులో మేమంతా సిద్ధం సభ నిర్వహించిన అనంతరం ఆయన నేండ్రగుంట, గాదంకి, చంద్రగిరి, తిరుపతి బైపాస్‌ మీదుగా రేణిగుంట వద్ద ఉన్న గురవరాజుపల్లెకు రాత్రి 9.05 గంటలకు చేరుకున్నారు.

Updated : 04 Apr 2024 07:09 IST

బస్సులోంచే అభివాదం

ఈనాడు - తిరుపతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి తిరుపతి జిల్లాకు చేరుకున్నారు. సాయంత్రం పూతలపట్టులో మేమంతా సిద్ధం సభ నిర్వహించిన అనంతరం ఆయన నేండ్రగుంట, గాదంకి, చంద్రగిరి, తిరుపతి బైపాస్‌ మీదుగా రేణిగుంట వద్ద ఉన్న గురవరాజుపల్లెకు రాత్రి 9.05 గంటలకు చేరుకున్నారు. సీఎం ఎక్కువ సమయం బస్సులో కూర్చుని అభివాదం చేసుకుంటూ వచ్చారు. ఎక్కడా ఆయన బస్సు దిగి నేరుగా ప్రజలను కలుసుకోలేదు. కేవలం దామలచెరువుకు ముందు చల్లాకూరమ్మగుడి వద్ద నుంచి 250 మీటర్లు మాత్రమే బస్సుపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. ఆ తర్వాత మొత్తం ఆయన బస్సులో ఉండి కిందకు దిగలేదు. సీఎం బస్సు యాత్ర సందర్భంగా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. చంద్రగిరి దాటిన తర్వాత జాతీయ రహదారి నుంచి శ్రీనివాసమంగాపురం వెళ్లే మార్గం వద్ద దాదాపు 15 నిమిషాలు వాహనాలు నిలిపివేశారు. సీఎం తిరుపతి దాటి వెళ్లే వరకు వాహనాలను వదలలేదు. దీంతో కొందరు తమ బంధువుల ఇళ్లలో వివాహ మహోత్సవానికి వెళ్లాల్సి ఉందని పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదు. ్యరేణిగుంట కూడలి వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రేణిగుంట-తూకివాకం, శ్రీకాళహస్తి ప్రధాన రహదారి, రేణిగుంట చెక్‌పోస్టు కూడలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. ఇదే సమయంలో ఒక ఆటో డ్రైవర్‌ హారన్‌ కొట్టడంతో మఫ్టీలో ఉన్న పోలీస్‌ అతనిపై చేయి చేసుకునే యత్నం చేశారు. అతను కడప మార్గంవైపు వెళ్లాలని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.

పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

పాకాల, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బస్సుయాత్ర పదిపుట్లబైలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లి వద్ద జిల్లాలోకి ప్రవేశించింది.  దామలచెరువు హైస్కూల్‌గేటు ప్రధాన సెంటర్‌లో మండుటెండలో ప్రజలు చెమటలు కక్కుకుంటూ ఎదురు చూస్తున్నా జగన్‌ ఏసీ బస్సులోకి వెళ్లిపోవడంతో వారు నిరాశకు గురయ్యారు. జనం ఎండలో ఉంటే జగన్‌ బస్సులోకి వెళ్లడమేంటా అంటూ నిట్టూర్చారు. జిల్లాలో ఎక్కడా బస్సు ఆపడం కానీ, పలకరించకపోవడంతో జనం అసంతృప్తికి లోనయ్యారు.

విద్యార్థులను ఇళ్లకు పంపిన ఉపాధ్యాయులు

బస్సు యాత్ర నేపథ్యంలో దామలచెరువు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉదయం 11 గంటలకే ఇంటికి పంపేయడం చర్చనీయాంశంగా మారింది. విషయం మీడియాకు చేరడంతో వారు దీనిపై ఆరా తీయగా ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లిపోతున్న వారిని వెనక్కు రప్పించే యత్నం చేశారు.

అభిమానిని పక్కకు లాగుతుండగా జరిగిన తొక్కిసలాట


అడ్డం పడిన అభిమానిని లాక్కెళ్లిన పోలీసులు

చంద్రగిరి వద్ద జగన్‌ అభిమాని ఒకరు ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు బస్సుకు అడ్డుగా పడుకున్నారు. అక్కడే ఉన్న రోప్‌ పార్టీ ఆయనను లాక్కెళ్లారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. అందులో సుకన్య అనే మహిళ కింద పడింది.  జిల్లాలో ఎక్కడైనా సీఎం మాట్లాడతారని వైకాపా కార్యకర్తలు భావించగా ఆయన మాత్రం అభివాదం చేసుకుంటూ రేణిగుంట మండలం గురవరాజుపల్లెలోని బస కేంద్రానికి చేరుకున్నారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై రాత్రి సైతం వాహనాలు నిలిపేసి చుక్కలు చూపించారు. సదుం, పులిచెర్ల మండలాల్లో రోడ్డు పక్కన కొందరు తమ సమస్యలు చెప్పుకొనేందుకు యత్నించగా  బస్సు ఆపి విన్నారు. ఆయన బస్సు రావడానికి ముందే వారితో వైకాపా నేతలు మాట్లాడటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని