logo

ఎన్నికల వేళ.. ఇన్‌ఛార్జులు ఎలా?

గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరులో కొన్నాళ్లుగా రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేరు. డిప్యూటీ తహసీల్దార్‌కే ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

Updated : 16 Apr 2024 05:43 IST

ఏఈఆర్వోలుగా జిల్లాకు చెందినవారు
నియమావళికి తూట్లు

గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరులో కొన్నాళ్లుగా రెగ్యులర్‌ తహసీల్దార్‌ లేరు. డిప్యూటీ తహసీల్దార్‌కే ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయనే ఏఈఆర్వోగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ఈయనకు జిల్లా అధికారు లు.. ఏఈఆర్వో బాధ్యతలు ఎలా అప్పగిస్తారని  ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లాలో తహసీల్దార్ల కొరత ఉంటే.. కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌ హోదాలో ఉన్నవారిని చిల్లకూరులో నియమించి, వారికి ఏఈఆర్వో విధులు అప్పగించే వీలున్నా..  ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదు. అలా కాకుంటే పౌర సరఫరాల శాఖలో ఉన్న వారినైనా నియమించొచ్చు.

సూళ్లూరుపేట: సార్వత్రిక ఎన్నికలు ఇన్‌ఛార్జులతోనే నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. పలుచోట్ల సొంత జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్లనే ఏఈఆర్వోలుగా నియమించి, ఎన్నికల పనులు చేయిస్తున్నారు. దీంతోపాటు కీలకమైన ఎన్నికల విభాగంలో ఇన్‌ఛార్జుల పాలన కొనసాగుతోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు తూట్లు పొడిచారన్న ఆరోపణలున్నాయి.

సార్వత్రిక ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులను లోక్‌సభ నియోజకవర్గం ప్రతిపాదికన బదిలీ చేయాల్సి ఉంది. వారెవరూ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకేచోట మూడేళ్లు సర్వీసు పూర్తి చేసి ఉండకూడదు. దాంతోపాటు సొంత జిల్లాలో విధులు నిర్వహించకూడదు. ఒకవేళ అలా ఉంటే ఆ అధికారులను నియమావళి మేరకు బదిలీ చేయాలి.  ఒకే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వేర్వేరు జిల్లాలకు చేసిన బదిలీలు చెల్లవు. ఈ మేరకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనల మేరకు బదిలీలు రెవెన్యూ, పోలీసు శాఖలో జరగలేదన్న విమర్శలున్నాయి.

ఎన్నికల డీటీలూ వారే..: జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో రెగ్యులర్‌ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు లేరు. సూళ్లూరుపేట, సత్యవేడు, శ్రీకాళహస్తి, గూడూరు నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులతోనూ, డిప్యుటేషన్‌పై కొందర్ని నియమించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లోనూ రెగ్యులర్‌ డిప్యూటీ తహసీల్దార్లు, ఎంఆర్‌ఐలు లేరు. కొన్నిచోట్ల ఏళ్ల తరబడి ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

నాడు తహసీల్దార్లు.. నేడు డీటీలు : జిల్లాలోని ఏడు మండలాల్లో ఫిబ్రవరి వరకు అక్కడి డీటీలు ఇన్‌ఛార్జి తహసీలార్లుగా పనిచేస్తున్నారు. రెండున్నరేళ్లపాటు వారే అన్ని మండలాల్లో చేసిన వీరు వైకాపా నేతలకు నాలుకలా తయారయ్యారు. ఎన్నికల నేపథ్యంలో పొరుగు జిల్లాల నుంచి తహసీల్దార్లు రావడంతో ఇన్‌ఛార్జుల స్థానంలో రెగ్యులర్‌ వారిని కొందర్ని నియమించారు. అప్పటిదాకా ఇన్‌ఛార్జి తహసీల్దార్లుగా ఉండిన వారు ప్రస్తుతం అక్కడే డీటీలుగా ఉంటున్నారు. వీరు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి. కనీసం వారిని పక్క నియోజకవర్గాల్లో అయినా నియమించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని