logo

రద్దు ఏ వారంలో జగనన్నా?

పురాణాల్లో సీతాదేవిని మభ్య పెట్టేందుకు రావణుడు సాధువు రూపంలో వచ్చినట్లు.. 2019 ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్‌ జగన్‌.. అమ్మా, అయ్యా! సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ తీయని మాటలు చెప్పి.. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు పొందారు.. 

Published : 16 Apr 2024 09:19 IST

ఐదేళ్లయినా సీపీఎస్‌ విస్మరణ
ఉద్యోగులు ఏం నష్టపోతున్నారన్నది సీఎంకు తెలుసా?

పురాణాల్లో సీతాదేవిని మభ్య పెట్టేందుకు రావణుడు సాధువు రూపంలో వచ్చినట్లు.. 2019 ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్‌ జగన్‌.. అమ్మా, అయ్యా! సీపీఎస్‌ను రద్దు చేస్తామంటూ తీయని మాటలు చెప్పి.. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు పొందారు..  ఎన్నికల్లో గెలిచాక తన విశ్వరూపాన్ని చూపారు.. ఎన్నికలకు ముందు వారంలో సీపీఎస్‌ను తీయించేద్దామన్న జగన్‌.. సీఎం కుర్చీలో ఐదేళ్లున్నా ఏ వారంలోనూ దీనిపై దృష్టిపెట్టలేదు.  2019లో జగన్‌.. వారంలో అన్నారు..! గానీ, ఏ వారమో చెప్పలేదుగా!. వారానికి ఏడు రోజులు.. సీపీఎస్‌ రద్దుకు ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు కాకుండా కొత్తగా ఏదైనా వారాన్ని కనిపెట్టి ఇస్తారేమో మరి అంటూ ఆ సార్‌..!

కలెక్టరేట్‌ ఎదుట సీపీఎస్‌ ఉద్యోగుల నిరసన

న్నికల్లో గెలిచాక సీపీఎస్‌ రద్దుపై మాట్లాడదామంటే ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ లేదు. ప్రభుత్వం కొలువు దీరిన తొలి రెండేళ్లు మౌనంగా ఉన్న ఉద్యోగులు తర్వాత ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగుల ఉద్యమాన్ని సహించకుండా అడుగడుగునా అణచివేతకు పాల్పడ్డారు. గళం వినిపించకుండా గృహనిర్బంధాలు చేయించారు. అయినా వెరవక ఉద్యోగులు పోరాటాన్ని కొనసాగించారు. చివరకు ప్రభుత్వం చర్చలకు పిలిచి జీపీఎస్‌ గురించి చెప్పింది. ఇది కూడా తమను మోసం చేసేదేనంటూ ఉద్యోగులు మళ్లీ తమ ఆందోళనల్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

ఉద్యోగుల్ని క్షోభ పెట్టారు..

హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగులపై పరోక్ష రూపంలో క్షోభ పెట్టింది ప్రభుత్వం. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తారీఖు అంటే జీతం వస్తోందని.. అన్ని అవసరాలను సర్దుబాటు చేయవచ్చనే భావన ఉండేది. ఇప్పడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిని కల్పించింది ప్రభుత్వం. 

జిల్లాలోని సీపీఎస్‌ ఉద్యోగులు 10,435మంది

ఓపీఎస్‌: పాత పింఛను స్కీం(ఓపీఎస్‌)లో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ నాటికి బేసిక్‌ పే, డీఏలో లెక్కలో తీసుకుని పింఛను ఇస్తారు. చివరగా రూ.50 వేల వేతనం ఉంటే పింఛనుగా రూ.25 వేలు ప్రతినెలా దక్కుతుంది.
8సీపీఎస్‌: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) అంటే ఉద్యోగుల బేసిక్‌ పే, డీఏతో సంబంధం ఉండదు. ఉద్యోగులు పొదుపు చేసిన ధనాన్ని పెట్టుబడిగా ఉంచి.. ప్రతి నెలా పింఛను ఇచ్చే స్కీం. ఉద్యోగ విరమణ నాటికి రూ.10 లక్షలు ఖాతాలో ఉంటే, 60 శాతాన్ని ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌గా విత్‌డ్రా చేసుకోవచ్చు. పింఛను కావాలంటే మిగిలిన 40 శాతం పెట్టుబడిగా ఉండాల్సిందే. ఈ 40 శాతం పెట్టుబడి ఉన్న నగదు నుంచి పింఛనుగా వచ్చే మొత్తం సామాజిక పింఛన్ల కన్నా తక్కువే. ఒకవేళ దురదృష్టవశాత్తూ సీపీఎస్‌ ఉద్యోగి మరణిస్తే.. రూ.10 వేలు మట్టి ఖర్చులకు ఇస్తారు. షేర్‌లో పొదుపు చేసిన నగదు పూర్తిగా విత్‌డ్రా చేసుకుంటే పింఛను వర్తించదు.

జీపీఎస్‌: గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీం(జీపీఎస్‌) పేరిట ఉద్యోగులకు వైకాపా ప్రభుత్వం వేసిన వల ఇది. ఉద్యోగ విరమణ తర్వాత బెనిఫిట్స్‌ ఏమీ ఉండవు. పింఛను కావాలంటే నగదు వంద శాతం మొత్తమూ పొదుపులో ఉండాల్సిందే.

ఉద్యోగుల ఆవేదన ఇలా..

20-30 ఏళ్లు సర్వీసు చేసి ఉద్యోగ విరమణ చెందే వారికి ఆ తర్వాత ఎలాంటి ప్రయోజనాలు లేకపోవడం బాధాకరమని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సామాజిక పెన్షనర్‌ కన్నా తక్కువ వచ్చేలా సీపీఎస్‌ ఉందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.


నమ్మి మోసపోయాం

అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తామన్న మాట నమ్మి మోసపోయాం. సీపీఎస్‌తో ఉద్యోగుల భద్రతకు ముప్పు. సీపీఎస్‌లో ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగి పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఉద్యోగుల సర్వీసుకి గుర్తింపు లేకపోవడం బాధాకరం. 

పి.సుధాకర్‌, గౌరవాధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం


రద్దు చేస్తే మేలు..

సీపీఎస్‌ రద్దు చేస్తే జిల్లాలోని వేలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పింఛను రూ.వెయ్యి నుంచి రూ.1,500 వేల లోపే ఉంటుంది. ఇన్నేళ్లు సర్వీసు చేసిన ఉద్యోగులకు ఇదేనా న్యాయం.

సమీర్‌, జిల్లా అధ్యక్షుడు, ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం


ఉద్యోగుల పరిస్థితి ఆలోచించండి..

ఐదేళ్లు పనిచేసే ప్రజాప్రతినిధులు.. మాజీలైతే ఆ తర్వాత కాలానికి పింఛను ఇస్తున్నారు. మరి 20 నుంచి 30 ఏళ్లు సర్వీసు చేసే ఉద్యోగులకు మాత్రం పింఛను ఇవ్వరా? ఇదేం న్యాయం. ఉద్యోగులకు అన్యాయం చేస్తే సహించం.

శ్రీనివాస్‌, సలహాదారు, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం


పింఛను భిక్ష కాదు..

పింఛను అనేది పాలకవర్గాలు పెట్టే భిక్ష కాదు. ఉద్యోగి హక్కు. రాష్ట్రంలో సీపీఎస్‌ వద్దని మొత్తుకుంటున్నా.. పెనం మీద నుంచి పొయ్యిలోకి తీసేసినట్లు జీపీఎస్‌ తీసుకురావడం దురదృష్టకరం. 

గంటా మోహన్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు, ఎస్టీయూ


ఇబ్బందులు వర్ణనాతీతం.. 

టి.నరసింహులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు, పలమనేరు

పలమనేరు: వారంలో సీపీఎస్‌ విధానం రద్దు చేస్తానని మోసం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు చెప్పనలవికావు.  జీవితాంతం ఉద్యోగం చేసి పదవి విరమణ తరువాత కుటుంబ పోషణ గురించి భయపడాల్సిన పరిస్థితి. సీపీఎస్‌ రద్దు.. ఓపీఎస్‌ పునరుద్దరిస్తామన్న ప్రభుత్వం.. ఉద్యోగులను నమ్మించి జీపీఎస్‌ తెచ్చింది. ఓపీఎస్‌ హామీ వాడుకుని గత ఎన్నికల్లో ఓట్లు దండుకున్నారు. ఈ దఫా సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించే వారికి మద్దతు తెలపడానికి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సుముఖంగా ఉన్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌, విద్య, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని