logo

లిక్కర్‌ కాంట్రాక్టులన్నీ ఉప ముఖ్యమంత్రి బినామీలవే

లిక్కర్‌ కాంట్రాక్టులన్నీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బినామీలవేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

Published : 16 Apr 2024 01:52 IST

న్యాయయాత్రలో షర్మిల ఘాటు విమర్శలు
పలమనేరు ఎమ్మెల్యేను మళ్లీ గెలిపిస్తే ప్రజల్ని మాయం చేస్తారు

పలమనేరులో ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల

కార్వేటినగరం, పలమనేరు, న్యూస్‌టుడే: లిక్కర్‌ కాంట్రాక్టులన్నీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బినామీలవేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. న్యాయయాత్రలో భాగంగా ఆమె కార్వేటినగరం, పలమనేరుల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి అంబేడ్కర్‌ శిష్యుడినని చెప్పుకొంటారని, ఆయన ఆశయాలను నిలబెట్టడమంటే కల్తీ మద్యం అమ్మడమా అని ప్రశ్నించారు. స్పెషల్‌ స్టేటస్‌, క్యాపిటల్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, డీఎస్సీ మద్యం బ్రాండ్లన్నీ ఆయనవేనని, ఇతర బ్రాండ్లు అమ్మనీయకుండా బాగా సంపాదించారని విమర్శించారు. నాసిరకం మద్యం తాగడంతో ఇతర రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో 25 శాతం ఎక్కువ మంది కిడ్నీ, లివర్‌ పాడై మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ఒకవైపు బటన్‌ నొక్కుతూ మరోవైపు నిత్యావసర ధరలు, ఇసుక దోపీడీ, మద్యం, విద్యుత్తు ఛార్జీలు, గ్యాస్‌ ధరలు పెంచి ప్రజలను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో మూతపడ్డ చక్కెర కర్మాగారాలను కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. జీడీనెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రమేష్‌బాబును ఆమె పరిచయం చేశారు. పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్‌, పీసీసీ అధికార ప్రతినిధి గోవర్ధన్‌ రెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, బుల్లెట్‌ రవి, చంద్రబాబు, దినకర్‌, గౌతంరాజు, చందురాణి, దినకర్‌, రాజేశ్వరమ్మ పాల్గొన్నారు.

కౌండిన్య ఇసుక కొల్లగొట్టి..

పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఐదేళ్లలో కౌండిన్య ఇసుకంతా మాయం చేశారంట కదా.. మళ్లీ గెలిపిస్తే ప్రజలను కూడా ఆయన మాయం చేస్తారని షర్మిల వ్యాఖ్యానించారు. ఆయన గెలిచిన తరువాత పలమనేరులో కనిపించ లేదట కదా.. ఓట్లేసి గెలిపిస్తే నెత్తిమీద టోపీ పెట్టాడంట.. మాఫియాతో ఇసుక, మట్టి తరలించేసి కౌండిన్య నదిని ఖాళీ చేశాడంట.. అని ఆరోపణలు గుప్పించారు. కౌండిన్య ప్రాజెక్టును వైఎస్‌ఆర్‌ నిర్మించారు.. నది పొడవునా ఇసుక తోడేసి ప్రస్తుత పాలకులు చుక్క నీరు నిల్వ లేకుండా చేశారన్నారని.. ఇలాంటి ఎమ్మెల్యే అవసరమా అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్‌ పట్టు రైతులకు ప్రోత్సాహక నగదు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి శివకుమార్‌ను  ఆమె ప్రజలకు పరిచయం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని