logo

జగనన్న.. కన్నీటి ప్రాజెక్టులు

జిల్లాలోని చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టుల్లేవు. ఈ నేపథ్యంలో రైతులకు సాగుకు వర్షాధారమే దిక్కు.. లేదంటే వలస వెళ్లాల్సిందే.. ఉన్న సాగునీటి వనరులు ఒడిసిపట్టాలన్నా ప్రభుత్వం నిధుల మంజూరులో అలక్ష్యం వహిస్తోంది.

Updated : 16 Apr 2024 05:43 IST

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి తూర్పు మండలాల్లో సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు లేకుండా చూస్తాం. అన్నదాతల కళ్లలో వెలుగులు నింపుతాం.

సీఎం జగన్‌ ఇచ్చిన హామీ

గాలేరు-నగరి ప్రాజెక్టులో భాగంగా నగరి నియోజకవర్గ పరిధిలో వేణుగోపాల్‌సాగర్‌, వేపగుంట, అడవికొత్తూరు రిజర్వాయర్లు నిర్మించాలి. వేపగుంట 60శాతం, అడవికొత్తూరు70 శాతం పనులు చేసి వదిలేశారు. తెదేపా హయాంలో వేణుగోపాల్‌సాగర్‌ పనులు 15శాతం చేశారు. ఐదేళ్లలో ఒక పార మట్టి తీయకపోవడం గమనార్హం.   

ఇదీ ప్రస్తుత దుస్థితి

పలమనేరులోని కౌండిన్య ప్రాజెక్టు కాలువపై దెబ్బతిన్న చెక్‌డ్యాం (పాత చిత్రం)

పుత్తూరు, చిత్తూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: జిల్లాలోని చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టుల్లేవు. ఈ నేపథ్యంలో రైతులకు సాగుకు వర్షాధారమే దిక్కు.. లేదంటే వలస వెళ్లాల్సిందే.. ఉన్న సాగునీటి వనరులు ఒడిసిపట్టాలన్నా ప్రభుత్వం నిధుల మంజూరులో అలక్ష్యం వహిస్తోంది. ఈ నేపథ్యంలో వర్షపు నీరు సముద్రం పాలువుతోంది. పెనుమూరు ఎన్టీఆర్‌ జలాశయం, కార్వేటినగరం కృష్ణాపురం రిజర్వాయర్లే జిల్లాలోని ఆ ప్రాంత రైతులకు దిక్కు.. పశ్చిమ నియోజకవర్గాల్లో హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులు పూర్తయినా సాగునీటికి ఇబ్బందులే.. తూర్పు మండలాల్లో గాలేరు-నగరి ప్రాజెక్టు పనులు అసలే సాగలేదు.. దీంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయి.. నగరి వద్ద సత్రవాడ వద్ద గొలుసుకట్టు చెరువులకు నీరు మళ్లించే చెక్‌ డ్యామ్‌ కొట్టుకుపోయింది.. ఐదేళ్లలో ఈ పనుల ఊసే లేదు.

విస్తరణ లేదు... లైనింగ్‌ లేదు

పుంగనూరు, పలమనేరు: తెదేపా హయాంలో ఐదేళ్ల కిందట పుంగనూరును తాకిన కృష్ణా జలాలు.. వైకాపా పాలనలో ఒక్క దఫా కూడా రాలేదు. రూ. 2,906 కోట్లతో నిర్మించిన అనంతపురం నుంచి ములకలచెరువు, పీటీఎం, అంగళ్లు, మదనపల్లె మీదుగా సాగే పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ (పీబీసీ)కు 2019లోనే నీరు ఇచ్చారు. ఆ తర్వాత వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం కుప్పానికి నీరు తరలిస్తున్నా.. ఇక్కడి చెరువులు, కుంటలకు మళ్లించలేదు. వైకాపా ప్రభుత్వం ప్రకటించిన జలయజ్ఞంలో కాలువ విస్తరణ, లైనింగ్‌ పనులు చేయాలి. పీబీసీ ప్రవాహ సామర్థ్యం 380 క్యూసెక్కులు కాగా.. పూర్తి స్థాయిలో నీరు ఇవ్వాలంటే లైనింగ్‌ చేపట్టాలి. 2019లో 300 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. లైనింగ్‌ లేక పోవడంతో నీరంతా వృథా అయింది. హెచ్‌ఎన్‌ఎస్‌ ఆశయం నెరవేరాలంటే కాలువ వెడల్పు, లైనింగ్‌ పనులు చేయాల్సి ఉంది. ఆ పనులు పూర్తయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,80,450 ఎకరాలకు సాగు నీరందుతోంది.

పుంగనూరు వద్ద ఒట్టిపోయిన హంద్రీ - నీవా కాలువ

మరమ్మతులకు నోచుకోని కౌండిన్య..

పెద్దపంజాణి, పలమనేరు ప్రాంతంలో ప్రవహించే కౌండిన్య ప్రాజెక్టు ద్వారా ఎంతో మంది రైతులు పంటలు సాగుచేసుకుంటున్నారు. దీని కింద వర్షాలు సమృద్ధిగా పడితే 70వేల ఎకరాలు సాగువుతాయి. గత ప్రభుత్వాల హయాంలో కౌండిన్య ప్రాజెక్టుపై 11 చెక్‌డ్యామ్‌లు నిర్మించి నీటిని నిలువరించారు. కాలక్రమంలో అవి భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. దీంతో వర్షపు నీరు తమిళనాడు ద్వారా సముద్రం పాలవుతోంది. పలుమార్లు అక్కడి రైతులు మరమ్మతులకు గురైన కల్వర్టులు బాగు చేయాలని కోరుతున్నా ప్రజాప్రతినిధుల చెవికి ఎక్కడంలేదు. దీంతో రైతులు పంటల సాగుకు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. పాలారు నదిపై ప్రాజెక్టు నిర్మిస్తే ఆ ప్రాంత రైతులకు కొంత ఆదరవుగా ఉంటుంది. ఎన్నికల సమయంలో నేతలు హామీలు ఇచ్చి అనంతరం వాటిని మరుస్తున్నారు.

జిల్లాలో ఇలా..

జిల్లాలో మొత్తం చెరువులు 8,063 వరకు ఉన్నాయి. అయితే ఒక్క చెరువులో ఒక తట్ట మట్టి ఎత్తిన దాఖలాల్లేవు. ఏటా చెరువులో పూడిక తీత, మరమ్మతులు చేపట్టాలి. అయితే ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయలేదు. దీంతో వర్షాకాలంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి.

అటకెక్కిన చామంతిపురం ప్రాజెక్టు..

పూతలపట్టు-ఐరాల మండలాల మధ్యలోని కొండల్లో చామంతిపురం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూతలపట్టు, చిత్తూరు నియోజవర్గాల్లో సాగు, తాగునీరు ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం ఈ ప్రాజెక్టు ఊసే మరిచారు.


కుప్పం బ్రాంచి కెనాల్‌

పుôగనూరు, పలమనేరు, కుప్పం, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల్లో 1.80 లక్షల ఎకరాలకు సాగు, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, కుప్పం పట్టణాలకు తాగునీరు అందించాలని హంద్రీ-నీవా ప్రాజెక్టు రూపొందించారు. తెదేపా హయాంలో 87 శాతం పనులు చేశారు. వైకాపా వచ్చాక రూ.90కోట్లు ఖర్చు చేసి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా 110 చెరువులు నింపనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 26 ముఖ్యమంత్రి జగన్‌ ఆర్భాటంగా కాలువకు నీరు విడుదల చేశారు. రెండు చెరువులు కూడా నింపడం కష్టతరమైంది.


పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం మిగులు జలాలను చెరువుల అనుసంధానం పనులు అటకెక్కాయి. ఈ చెరకు అనుసంధానికి రూ.194 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. భూసేకరణ జరిగినా పనుల ఊసే లేదు. ఐదేళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు అడుగు ముందుకు పడలేదు. పెనుమూరు, జీడీనెల్లూరు మండలాల్లోని 32చెరువులకు అనుసంధాన పనులు ఆదిలోనే హంస పాదు అన్నట్లు నిలిచాయి.


కాలువ దుస్థితి

కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం రిజర్వాయర్‌ పునరుద్ధరణకు జైకా సంస్థ రూ.26కోట్లు ఇచ్చింది. రూ.13కోట్లతో పనులు చేపట్టారు. మిగిలిన రూ.13 కోట్ల విలువచేసే పనులు చేపట్టలేదు. గుత్తేదారులకు బిల్లులు               చెల్లించకపోవడంతో పనులు నిలిచాయి.


పాలారు ఆన‘కట్ట’లేదు.. ‘హంద్రీ- నీవా’ పారలేదు

సీఎం జగన్‌ సాగునీరు విడుదల చేసిన ప్రాంతం

కుప్పం, న్యూస్‌టుడే:  చంద్రబాబు చేయలేని జలయజ్ఞం పనుల్ని పూర్తి చేశామంటూ ముఖ్యమంత్రి జగన్‌ గొప్పలు చెప్పుకున్నారు. ఆఖరికి .. ‘హంద్రీ- నీవా’ ప్రాజెక్టు ఘనత తమదేనని ఊదరగొట్టిన ఆయన  కాలువలో సాగు నీరు పారించడంలో ఘోరంగా విఫలమై.. అభాసుపాలయ్యారు. కుప్పం బ్రాంచి కాలువలో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 110 చెరువులు నింపడం తోపాటు శాంతిపురం మండలంలోని మాదనపల్లె, గుడుపల్లె పరిధిలోని యామగానిపల్లె వద్ద రిజర్వాయర్లు నిర్మించి ఒక్క టీఎంసీ నీటి నిల్వలతో సాగు.. తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని రెండేళ్ల కిందట జగన్‌ చేసిన వాగ్దానాలు నెరవేరలేదు. ఈఏడాది ఫిబ్రవరి 26న రామకుప్పం మండలంలోని పూజలు చేసి.. బటన్‌ నొక్కినా.. నీళ్లు ప్రవహించలేదు. ఒక్క చెరువూ నిండలేదు. పాలారు జలాల సద్వినియోగానికి ప్రాజెక్టు నిర్మిస్తామన్న వాగ్ధానం నెరవేరలేదు. నాలుగు మండలాల్లో దాదాపు 550 చెరువులు, పాలారుపై 35 చెక్‌డ్యాంలు ఉన్నాయి. వాటికి కనీస మరమ్మతులు చేపట్టలేదు.

పాదయాత్ర చేశారు..

గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి రోజా పాదయాత్ర చేశారు. ఐదేళ్లలో ఒక తట్ట మట్టి తీయలేదు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కించారు. రైతులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సాగునీరు లేకుంటే భవిష్యత్తులో రైతులకు అంధకారమే.

అమరనాథ్‌, తిమ్మరాజు కండ్రిగ, పుత్తూరు మండలం


ప్రాజెక్టులకు నిధులేవీ..?

జిల్లా వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు కేటాయింలేదు. హంద్రీ-నీవా ప్రాజెక్టు పూర్తి చేశామని గొప్పలు చెప్పుకోవడానికి అక్కడ ఓ కార్యక్రమం పెట్టి చెరువులకు నీళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. కేవలం 2 చెరువులకు నీళ్లు వచ్చారు. అక్కడి రైతులు ముఖ్యమంత్రి డ్రామాను చూసి నివ్వెరపోవడం వారి వంతైంది.

సిద్ధయ్య, రైతు, పుత్తూరు మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని