logo

ప్రాణాలు పోతున్నాయి జగన్‌...

జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు.

Updated : 02 May 2024 05:57 IST

ఈహెచ్‌ఎస్‌లో దంతాలు, నేత్రాలకే వైద్యం
ఆర్టీసీ ఉద్యోగులకు మొండిచేయి
వైద్య సేవలకు ‘బ్రేక్‌’ వేసిన వైకాపా సర్కార్‌

  • చిత్తూరుకు డిపోకు చెందిన ఓ డ్రైవర్‌ ఐదేళ్ల కిత్రం బెంగళూరుకు విధుల నిమిత్తం వెళ్లాడు. అక్కడకు వెళ్లాక అతడికి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో విచారణ కోసం వచ్చిన అనంతపురం రీజనల్‌ మేనేజరు ఎంత ఖర్చయినా పర్వాలేదు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. దీంతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడికి వైద్యం కోసం రూ.7 లక్షలు ఖర్చు చేశారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బతికి బయటపడటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 

  • గుడిపాలకు చెందిన ఓ మెకానిక్‌ చిత్తూరు గ్యారేజ్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 15 రోజుల కిత్రం అతడు విధులకు వస్తుండగా ప్రమాదం జరిగింది. అతడిని వేలూరు సీఎంసీకి తరలించగా రూ.10 లక్షలు అవుతుందని చెప్పారు. దాన్ని భరించే స్థోమత లేకపోవడంతో తిరుపతి స్విమ్స్‌కు తెచ్చారు. అక్కడ రూ.5 లక్షలు అవుతుందని చెప్పారు. పుదుచ్చేరిలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈహెచ్‌ఎస్‌ కార్డు ఉన్నా అతడికి ఆ ప్రయోజనం ఒనగూరలేదు.

  •  జగన్‌ అనే నేను మాట ఇస్తే తప్పను.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని మాట ఇచ్చాను. ఆపై ప్రభుత్వంలో విలీనం చేసి మాట నిలబెట్టుకున్నానని గొప్పలు చెప్పాడు. ఉద్యోగులు సైతం సీఎం మాయమాటలు నమ్మారు. తీరా విలీనం చేశాక వారికి అప్పటివరకు అందుతున్న వైద్య సేవల పరిస్థితి తారుమారైంది. తమ పరిస్థితి కార్పొరేషన్‌లో ఉన్నప్పుడే బాగుడేందని, ప్రభుత్వంలో విలీనం చేశాక తమ ఆరోగ్యంపై భరోసా కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

న్యూస్‌టుడే, పుత్తూరు, చిత్తూరు(కొంగారెడ్డిపల్లె): జిల్లాలో ఆర్టీసీలో సుమారు 5వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏదైనా ఆరోగ్యం బాగోలేక పోతే చిత్తూరులోని డిస్పెన్సరీలో పరీక్షలు నిర్వహించుకుంటుంటారు. అక్కడ రక్తపోటు, మధుమేహం, జ్వరం, తలనొప్పి వంటి వాటికి చికిత్స అందిస్తారు. అత్యవసర చికిత్స పొందాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని తార్నాక ఆస్పత్రికి వెళ్లి వైద్యసేవలు పొందేవారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడలో ఆస్పత్రి ఏర్పాటు చేశారు. అయితే తార్నాకలో అందిస్తున్నట్లు ఇక్కడ సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో 2020లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులు, సిబ్బందికి ఈహెచ్‌ఎస్‌ కార్డులు అందజేశారు. వీటి ద్వారా సేవలకు ప్రతి నెలా రూ.225 ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించుకుంటున్నారు. అయితే ఆ మేరకు సేవలు అందించడం లేదు. ఈహెచ్‌ఎస్‌కు సంబంధించి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఆస్పత్రులలో మాత్రమే సేవలు పొందాలి. లేదంటే ఉద్యోగే.. ఆ మొత్తాన్ని భరించాలి. ఈ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలు పొందాలంటే ఉద్యోగులు, సిబ్బంది చేతి చమురు వదులుతోంది. ఈహెచ్‌ఎస్‌కు సంబంధించి ప్రభుత్వం సక్రమంగా బిల్లులు చెల్లించక పోవడంతో ప్రభుత్వం ఎంపిక చేసిన ఆస్పత్రులలో సైతం కంటి, పంటికి మాత్రమే వైద్యం అందిస్తుండటం గమనార్హం.

మెరుగపడాల్సిన సేవల్లో కోత..

ప్రభుత్వంలో విలీనం కాక ముందు ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యుల్లో ఎవరికి అనారోగ్య సమస్యలు ఉన్నా ఎలాంటి నిబంధనలు లేకుండా చికిత్స పొందే వెసులుబాటు ఉండేది. విలీనమయ్యాక ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యులకు సంబంధించి మరింత మెరుగైన సేవలు అందించాల్సి ఉన్నా అందులో కోత విధించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈహెచ్‌ఎస్‌ కింద పరీక్షలకు సైతం ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు తీసుకునేవారు కాదు. ఇప్పుడు పూర్తిగా పరీక్షలకు నగదు చెల్లించాల్సి వస్తోంది.

ఈహెచ్‌ఎస్‌తో నష్టపోతున్నాం..

కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు అత్యవసర వైద్యం కోసం ఎంత ఖర్చయినా సేవలు అందించేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఈహెచ్‌ఎస్‌ వల్ల బాగా నష్టపోతున్నాం. ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించక పోవడంతోనే ఈ పరిస్థితి. సకాలంలో బిల్లులు చెల్లిస్తే ఫర్వాలేదు. బిల్లులు ఆలస్యం అవుతుండటంతో అక్కడకు వెళ్లిన వెంటనే ఈ వైద్య సేవలు పొందాలంటే ఈహెచ్‌ఎస్‌ వర్తించదని చెప్పేస్తున్నారు. చేసేది లేక నగదు కట్టి సేవలు పొందుతున్నా.

శివ, ఆర్టీసీ ఉద్యోగి

ప్రభుత్వం మాటల గారడీతో..

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే అన్ని సౌకర్యాలు వర్తింపజేస్తాం. ఆర్టీసీ కుటుంబాలు బాగుపడతాయని నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. దీంతో అందరం సంబర పడ్డాం. తీరా ప్రస్తుతం అందుతున్న సేవలు చూస్తే ప్రభుత్వం గారడీ చేసిందని అర్థమైంది. ఉద్యోగులు, సిబ్బంది కుటుంబసభ్యుల ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకునేలా జీవోలు ఇవ్వాలి.

దానవేంద్ర, ఆర్టీసీ ఉద్యోగి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని