logo

పరిశ్రమలపై పగ.. ఔత్సాహికులకు దగా

Published : 02 May 2024 05:39 IST

జిల్లావ్యాప్తంగా బకాయిలు రూ.100 కోట్లు  
20 నెలలుగా ‘జగన్నా’టకం

సీఎం జగన్‌ మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదు. పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కడా లేనంత వేగంగా అనుమతులు ఇస్తున్నామని డప్పు కొట్టుకుంటోంది. ఎవరూ ఇవ్వనంతగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం జగన్‌కే చెల్లింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ముఖ్యమంత్రి మాటలు ఒట్టి డొల్లేనని స్పష్టమవుతోంది. వైకాపా ప్రభుత్వ అసమర్థ విధానాలు, అరాచక పాలనకు భయపడి భారీ, మెగా పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. ప్రభుత్వం నుంచి రాయితీలు అందకపోవడంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)లు మూతపడుతున్నాయి. జగన్‌ సర్కార్‌ మూలంగా అయిదేళ్లుగా పారిశ్రామిక రంగంలో వెనుకపడిందే తప్ప ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయింది.  


పలమనేరు నియోజకవర్గానికి చెందిన ఓ పారిశ్రామికవేత్త రూ.50 లక్షలతో నూలు సంచుల తయారీ పరిశ్రమ నెలకొల్పారు. పెట్టుబడి రాయితీ కింద ఏడాదిన్నర గడిచినా ఆయనకు రూ.15 లక్షలు, విద్యుత్తు, వడ్డీ రాయితీ రూపంలో రూ.4 లక్షలకుపైగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు రాలేదు. విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోవడంతో పరిశ్రమ నడపడం ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. బకాయిలు రాకుంటే పరిశ్రమ మూసేయాల్సిందేనని అంటున్నారు.


జిల్లాలోని ఏపీఐఐసీ పార్కులో ఉత్పాదక రంగానికి సంబంధించిన యూనిట్‌ను రూ.కోటితో ఏర్పాటు చేశారు. రాయితీల రూపంలోనే ఆయనకు రూ.40 లక్షలు రావాలి. వైకాపా అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పరిశ్రమ స్థాపించగా ఇంకా రాయితీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.


ఈనాడు, చిత్తూరు: పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వాలు ఔత్సాహికులకు రాయితీలు ఇస్తుంటాయి. అదే సమయంలో మనుగడులో ఉన్న కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తాయి. తద్వారా ఎక్కువమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.జగన్‌ ప్రభుత్వానికి పెట్టుబడులన్నా, పారిశ్రామికవేత్తలన్నా చిన్నచూపే. ఫలితంగానే అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఆయన ఏమాత్రం దృష్టి పెట్టలేదు.

రీస్టార్ట్‌ అన్నారు.. విస్మరించారు

కొవిడ్‌ మహమ్మారి మొదలైనప్పుడు ఎంఎస్‌ఎంఈలు చాలావరకు మూతపడ్డాయి. పరిస్థితులు కుదుటపడ్డాక కొన్ని సంస్థలు ఉత్పత్తులను పునః ప్రారంభించాయి. అలాంటి వాటికి రీస్టార్ట్‌ పేరుతో మూడు నెలల స్థిర డిమాండ్‌ విద్యుత్తు ఛార్జీలు రద్దు చేస్తామని జగన్‌ ప్రకటించారు. నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. జిల్లావ్యాప్తంగా రూ.4 కోట్లు ప్రభుత్వం బకాయిలు ఉంది.

దళిత, గిరిజనులనూ మోసగించి..

దళితులు, గిరిజనులు శ్రామికులుగా ఉండే రోజులు పోవాలని.. ఇతర వర్గాలకు తీసిపోని రీతిలో పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అభినవ అంబేడ్కర్‌లా సీఎం జగన్‌ మాటలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వాల్లో వారికి ప్రకటించిన రాయితీలనే అమలు చేస్తూ పేరును మాత్రం వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం పథకం అని పెట్టారు. సేవా రంగంలో 45 శాతంతో రూ.75 లక్షల వరకు, ఉత్పత్తి రంగంలో రూ.కోటి వరకు గరిష్ఠ రాయితీ అందిస్తామని ప్రకటించారు. ఇవి కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.5 కోట్ల వరకు జగన్‌ సర్కార్‌ చెల్లించాల్సి ఉంది.

ఆగస్టు పోయి.. ఫిబ్రవరి వచ్చే  

మౌలిక సదుపాయాలకు నోచని గంగాధరనెల్లూరులోని పారిశ్రామికవాడ

వైకాపా అధికారంలోకి వచ్చాక రెండు పారిశ్రామిక పాలసీలను తెచ్చింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించే వారి చేయి పట్టుకుని నడిపిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. భూముల కొనుగోలు, పెట్టుబడి వ్యయంలో రాయితీ ఇచ్చి ఒక్కొక్కరు వందలాది మందికి ఉపాధి కల్పించేలా చూస్తానన్నారు. ఈ మేరకు 2020, 2021 సంవత్సరాల్లో మాత్రమే రాయితీలు విడుదల చేశారు. తర్వాత చేతులెత్తేసింది. 2022 ఏడాదికి సంబంధించినవి ఆ సంవత్సరం ఆగస్టులో ఇస్తామని కట్టుకథలు చెప్పారు. అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉందని.. 2023 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మాట మార్చారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.100 కోట్లు రావాలి. 20 నెలలు గడిచినా రాయితీల జాడే లేదు.
ఈమె పేరు లత. గంగాధర నెల్లూరులోని పారిశ్రామికవాడలో ఇనుప పైపుల తయారీ పరిశ్రమ స్థాపించారు. రూ.1.80 కోట్లు పెట్టుబడి పెట్టగా ప్రభుత్వం నుంచి రూ.85 లక్షలు రాయితీ రావాలి. దాదాపు రెండేళ్లుగా ఆమె ఎదురుచూస్తున్నారు. అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వానికి వివరాలు పంపామని సమాధానమిస్తున్నారే తప్ప ఎప్పుడు నగదు జమ చేస్తారో సమాధానం ఇవ్వడంలేదని వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని